ఇందూరు, న్యూస్‌లైన్ : ప్రతి ఆర్థిక సంవత్సరానికి గ్రామాల అభివృద్ధి కోసం కేంద్రం 13వ ఆర్థిక సంఘం నిధులను జిల్లాకు కేటాయిస్తూ వస్తుంది. కానీ వాటిని ఖర్చు చేద్దామంటే అనుమతి ఇవ్వడం లేదు. దీంతో సంబంధిత ఆర్థిక సంవత్సరం ముగియడంతో వచ్చిన నిధులన్నీ మంజురు కాకుండానే నిలిచిపోతున్నాయి. నిలిచినపోయిన నిధులను తిరిగి మళ్లీ మంజురుకు అనుమతివ్వకుండానే కొత్త ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 13వ ఆర్థిక సంఘం నిధులను కేటాయించి విడుదల చేస్తోంది. దీంతో కేంద్రం అందించే అభివృద్ధి నిధులు దేనికి అక్కరకు రాకుండా పోతున్నాయి. ఫలితంగా గ్రామాలు పూర్తిస్థాయిలో అభివృద్ధికి నోచుకోకుండా సమస్యల వలయంలో చిక్కుకున్నాయి.
ప్రస్తుత పరిస్థితి కూడా అలాగే ఉంది. 2014-15 ఆర్థిక సంవత్సరానికిగాను జిల్లాకు 13వ ఆర్థిక సంఘం నిధులు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దానికి సంబంధించిన ఉత్తర్వులనే పంచాయతీ రాజ్ కమిషనర్ వరప్రసాద్ జిల్లా పంచాయతీ కార్యాలయానికి ఇటు జిల్లా పరిషత్ కార్యాలయానికి పంపించారు. కానీ 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్థిక శాఖ అనుమతివ్వకపోవడం కారణంగా నిలిచిపోయిన గ్రామ పంచాయతీల నిధులు రూ.12 కోట్ల నిధులకు మోక్షం కలిగించకుండానే కొత్త ఆర్థిక సంవత్సరానికి చెందిన నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. గ్రామ పంచాయతీలకు రూ.1,38,84,200 నిధులను కేటాయించింది. అలాగే జిల్లా, మండల పరిషత్‌లకు కలిపి దాదాపు రూ.6 కోట్ల వరకు కేటాయించినట్లు తెలిసింది. సంబంధిత సెక్షన్ అధికారులు సెలవులో ఉండటంతో జిల్లా పరిషత్ ఉన్నతాధికారులు నిధులు ఎన్ని వచ్చాయో అధికారికారికంగా చెప్పలేకపోతున్నారు.
రూ. 26 కోట్లకు చేరిన నిధులు..
2013-14 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన రూ.12 కోట్ల 61 లక్షల 71వేల 900 నిధులు ఆర్థిక శాఖ అనుమతి నిరాకరించడంతో నిధులు నిలిపోయిన విషయం తెలిసిందే. తాజాగా 2014-15 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.13 కోట్ల 88 లక్షల 45 వేల 200లను కేటాయించింది. పాత నిధులు, కొత్త నిధులు మొత్తం కలిపితే గ్రామ పంచాయతీలకు వచ్చే 13వ ఆర్థిక సంఘం నిధులు రూ.26 కోట్ల 50 లక్షల 17 వేల 100కు చేరింది. ఈ లెక్కలన్నీ పేపర్లకే పరిమితమవుతున్నాయే తప్ప అమలుకు నోచుకోవడం లేదు.
కొత్త నిధులకు కూడా రాని అనుమతి..
గత పక్షం రోజుల క్రితం జిల్లాకు 13వ ఆర్థిక సంఘం నిధులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం అలవాటు ప్రకారంగానే వాటి విడుధలకు ప్రభుత్వం తరుపున ఆర్థిక శాఖ ఇంకా అనుమతి ఇవ్వలేదు. గ్రామ పంచాయతీలకు కేటాయించిన నిధులను జనాభా ఆధారంగా సర్దుబాటు చేయాలని జిల్లా పంచాయతీ అధికారులు గత నెల 23న జిల్లా ట్రెజరీ కార్యాలయంతో పాటు అన్నీ సబ్ ట్రెజరీ కార్యాలయాల్లో బిల్లులు సమర్పించారు. కానీ పది రోజులు కావాస్తున్న ఆర్థిక శాఖ వాటి విడుదలకు ట్రెజరీ అధికారులకు అనుమతి( ఆథారైజేషన్) ఇవ్వడంలేదు. దీంతో ఆ బిల్లులను ట్రెజరీ అధికారులు పక్కన పెట్టారు.
అయితే వారం పది రోజుల్లో నిధుల విడుధలకు అర్థిక శాఖ నుంచి అనుమతి రావొచ్చని ట్రెజరీ, పంచాయతీ శాఖల అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటు 2013-14 సంవత్సరానికి సంబంధించిన నిధులు రూ.12 కోట్ల 61 లక్షల నిధులకు మాత్రం ఇప్పట్లో మోక్షం కలిగే విధంగా సూచనలు కనిపించడంలేదు. అయితే నిబంధనల ప్రకారం నిధులు మంజురు చేసిన 15 రోజులల్లో ఆర్థిక శాఖ అనుమతినిచ్చిన నిధులను విడుదల చేయాలి. ఇలా చేయకపోతే ప్రభుత్వంతో పాటు ఆర్థిక శాఖకు జరిమాన విధించాలని కేంద్ర ప్రభుత్వం నిబంధనలు పెట్టింది.
నిధులిచ్చారు..అనుమతి మరిచారు..
Published Sat, May 3 2014 2:13 AM | Last Updated on Sat, Sep 2 2017 6:50 AM
Advertisement