అధికారులకు ‘దయ్యం’ పట్టింది! | Authorities 'supposedly' took! | Sakshi
Sakshi News home page

అధికారులకు ‘దయ్యం’ పట్టింది!

Published Thu, Dec 4 2014 1:44 AM | Last Updated on Sat, Sep 2 2017 5:34 PM

అధికారులకు ‘దయ్యం’ పట్టింది!

అధికారులకు ‘దయ్యం’ పట్టింది!

విద్యార్థుల్లో నైతిక విలువలు పెంచేందుకు తల్లిదండ్రులు, పెద్దలు ఏం చేస్తారు? దేశభక్తి, జాతీయ సమగ్రత, మంచి సందేశాత్మక చిత్రాలను చూపిస్తాం. స్ఫూర్తినిచ్చే మహనీయుల గాథలూ చెబుతాం. మరి... మన జిల్లా విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారో తెలుసా? దయ్యాల సినిమాలు చూడాలని ఉచిత సలహాలిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రదర్శించే థియేటర్లల్లో డబ్బులు చెల్లించి మరీ సినిమా చూడాలని ఆదేశాలిచ్చారు. ఈ ఉత్తర్వులను చూసిన వారికి విద్యాశాఖకు దయ్యం పట్టిందా? అని ఆశ్చర్యపోతుంటే... జిల్లా రెవెన్యూ విభాగం కూడా తానేమీ తక్కువ కాదన్నట్లుగా హర్రర్ సినిమాలకు సై అంటోంది. ఇలాంటి సినిమాలను ప్రదర్శించే ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్లకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరుతూ జిల్లాలోని రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీ అధికారులందరికీ ఏకంగా  ఆదేశాలు జారీ చేయడం విశేషం.
 
 సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : జాతీయ, రాష్ట్ర ఉత్తమ చిత్రాలు, చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైన సినిమాలను విద్యార్థులకు చూపించడం ద్వారా వారిలో నైతిక విలువలు పెంచవచ్చనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆయా చిత్రాలను ప్రత్యేకంగా థియేటర్లలో ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. కానీ, అందుకు భిన్నంగా ‘స్వీట్ చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ’ హర్రర్ సినిమాలను పాఠశాల విద్యార్థులకు చూపించి డబ్బులు దండుకునేందుకు సిద్ధమైంది. అనుకున్నదే తడవుగా సదరు సొసైటీ ప్రధాన కార్యదర్శి హుస్సేన్ పేరిట కొందరు జిల్లా అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. అందులో 1.డ్రాగన్ వార్ 2. సునామీ రిటర్న్స్ 3.ది గోల్డెన్ క్యాంపస్ సహా ఇతర సినిమాలను ప్రదర్శిస్తామని పేర్కొన్నారు.
 
 జిల్లా జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ సమక్షంలో ఈ దరఖాస్తును పరిశీలించిన అధికారులు వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఆయా సినిమాలను ప్రత్యేకంగా ప్రదర్శించే అవకాశం కల్పించారు. ఆయా చిత్రాలు ప్రదర్శించేందుకు సినిమా థియేటర్ల యాజమన్యాలు సహకరించడంతోపాటు థియేటర్‌కు అద్దె రూపేణా, ఒక్కో షోకు పట్టణాల్లో అయితే రూ.800, గ్రామాల్లో రూ.400 మాత్రమే వసూలు చేయాలని సూచించారు. ఈ విషయమై జిల్లా రెవెన్యూ అధికారి టి. వీరబ్రహ్మయ్య పేరిట ప్రొసీడింగ్స్ జారీ చేశారు. ఈ సినిమాలను ప్రదర్శిస్తున్న స్వీట్ చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీకి జిల్లా రెవెన్యూ, మున్సిపల్, మండలస్థాయి అధికారులంతా పూర్తి సహాయ సహకారాలు అందించాలని అందులో పేర్కొన్నారు.
 
 దీనిని పరిశీలించిన జిల్లా విద్యాశాఖ అధికారి కె.లింగయ్య ఆయా సినిమాలను ప్రదర్శించే విషయంలో పూర్తిగా సహకరించాలని కోరుతూ మండల విద్యాశాఖ అధికారులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చే శారు. డీఈవో ఆదేశాల మేరకు మండల విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ పాఠశాలలన్నింటికీ ఆదేశాలిచ్చారు. మరోవైపు ఈ హర్రర్ సినిమాలను విద్యార్థులకు చూపించాలని కోరుతూ జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు సైతం తెలంగాణ గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల అసోసియేషన్(ట్రస్మా) అధ్యక్షుడు శేఖర్‌రావు లేఖ రాయడం గమనార్హం.
 
 ఆ సినిమాలన్నీ పైరసీయేనా?
 మరోవైపు పైన పేర్కొన్న సినిమాలన్నీ హర్రర్, ఫాంటసీ సినిమాలే. ఆయా సినిమాల హక్కులు సదరు స్వీట్ చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీకి లేవని తెలుస్తోంది. ఆయా సినిమాలను ప్రదర్శిస్తున్న సొసైటీ ప్రాంతీయ హక్కులు పొందిందా? లేదా? అనే విషయాన్ని నిర్ధారించుకోకుండా అధికారులు అనుమతి ఇవ్వడం గమనార్హం. తద్వారా పైరసీ సినిమాలను అధికారులే పరోక్షంగా ప్రోత్సహించినట్లు కనిపిస్తోందని పలువురు ఉపాధ్యాయులు, అధ్యాపకులు అభిప్రాయపడుతున్నారు.
 
 మరోవైపు ఈ విషయంపై స్వీట్ చిల్డ్రన్స్ ఫిల్మ్  సొసైటీ ప్రధాన కార్యదర్శి హుస్సేన్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదు. హస్సేన్ పేరిట కొందరు తిమ్మాపూర్‌లో కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారని, వారే జిల్లా అధికారులకు దరఖాస్తు చేసుకున్నారని తెలిసింది. గతంలో వీరు రాయల్ ఫిల్మ్ సొసైటీ పేరిట ఇలాంటి సినిమాలను గడువు ముగిసిన తరువాత ప్రదర్శించగా, సదరు సొసైటీపై కేసు నమోదు చేసినట్లు సమాచారం.
 
 ఇకపై ఇలాంటి అనుమతులివ్వం :
 డీఈవో లింగయ్య
 విద్యార్థులకు హర్రర్ సినిమాలు చూపించే ఉత్తర్వుల విషయాన్ని డీఈవో లింగయ్య దృష్టికి తీసుకెళ్లగా ఇకపై అలాంటి సినిమాలకు అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది నుంచి పాఠశాల కరస్పాండెంట్, హెడ్‌మాస్టర్ తొలుత సందేశాత్మక సినిమాలను చూసి సంతృప్తి చెందిన తరువాతే పిల్లలకు ప్రదర్శించేలా అనుమతి ఇస్తామని పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement