సికింద్రాబాద్: మహిళలు ఒంటరిగా కనిపిస్తే చాలు..వాళ్ల మెడలో గొలుసులు మాయం చేయటం అతని ప్రొఫెషన్... ఆ సొత్తుతో బైక్‌రేస్‌ల్లో పాల్గొనటం అతని హాబీ..! ఈ ఘరానా నేరగాడిని బోయిన్‌పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్ ప్రాంతంలోని సింగదకుంటకు చెందిన మహ్మద్‌ముజీబ్ అలియాస్ గోర్‌ముజీబ్ అనే యువకుడికి బైక్ రేసింగ్‌లతోపాటు ఇతరత్రా వ్యసనాలున్నాయి. వాటి కోసం చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్నాడు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అసిఫ్‌నగర్, పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో జరిగిన 21 చైన్‌స్నాచింగ్ కేసుల్లో ఇతడు నిందితుడు. లోగడ ముజీబ్‌ను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.
బెయిల్‌పై వచ్చిన నిందితుడు 12 చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు. ఇతడు గురువారం అనూహ్యంగా పోలీసులకు చిక్కాడు. చోరీ సొత్తు 35 తులాల బంగారు గొలుసులను ఇతని నుంచి కొనుగోలు చేసిన చింతల్‌బస్తీకి చెందిన ప్రకాష్‌చంద్‌జైన్ అనే వ్యాపారిని కూడా పోలీసులు రిమాండ్ చేశారు.