ఆహార భద్రతా కార్డుల్లో డొల్లతనం | bogus in food protection cards | Sakshi
Sakshi News home page

ఆహార భద్రతా కార్డుల్లో డొల్లతనం

Published Fri, Jan 30 2015 10:46 AM | Last Updated on Thu, Oct 4 2018 5:10 PM

bogus in food protection cards

కరీంనగర్: 'పేదలకు దక్కాల్సిన సంక్షేమ పథకాల్లో ఒక్క రూపాయి దారిమళ్లించినా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం' అంటూ రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గత కొద్దిరోజులుగా పదేపదే హెచ్చరికలు చేస్తూనే ఉన్నా... ఆయన సొంత జిల్లాలో ఇబ్బడిముబ్బడిగా అనర్హుల చేతుల్లోకి ఆహార భద్రత కార్డులు వెళ్తున్నాయంటే ఇతర జిల్లాల్లో పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

పెరిగిన జనాభా 29 వేలు... కుటుంబాల సంఖ్య మాత్రం 2ల క్షలకు పైచిలుకు..
ఇదే విషయాన్ని పౌరసరఫరాల శాఖ అధికారుల దృష్టికి తీసుకెళితే సమగ్ర కుటుంబ సర్వేలోని గణాంకాల మేరకు కార్డులను జారీ చేశామని చెబుతున్నారు. వాస్తవానికి 2011 గణాంకాల ప్రకారం కరీంనగర్ జిల్లాలో 37,76,269 మంది జనాభా ఉన్నారు. కుటుంబాల పరంగా చూస్తే 9,76,022 కుటుంబాలున్నాయి. ఇక సమగ్ర సర్వే విషయానికొచ్చే సరికి జిల్లాలో 38,05,542 మంది జనాభా ఉన్నట్లుగా చూపారు. అంటే 2011తో పోలిస్తే జిల్లాలో పెరిగిన జనాభా 29,273 మంది మాత్రమే. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ కుటుంబాల పరంగా మాత్రం సమగ్ర సర్వేలో ఏకంగా 12,35,837 కుటుంబాలుగా పొందుపర్చారు. 2011 గణాంకాలతో పోలిస్తే కుటుంబాల సంఖ్య ఏకంగా 2,59,815 పెరిగినట్లు పేర్కొన్నారు. ఇదెలా సాధ్యమో అధికారులకే తెలియాలి.

గతం కంటే 'ఘనమే'..
వాస్తవానికి గత ప్రభుత్వంతో పోలిస్తే ఈసారి జిల్లాలో రేషన్‌కార్డులు ఎక్కువగానే జారీ చేసినట్లు అధికార గణాంకాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ హయాంలో మొత్తం 9,92,457 రేషన్ కార్డులు జారీ చేశారు. వీటిలో 8,44,451 తెల్లకార్డులు, 1,39,836 అంత్యోదయ, 1347 అన్నపూర్ణ, 6,823 ఆర్‌ఏపీ-2 కార్డులున్నాయి. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక రేషన్‌కార్డులను రద్దు చేసిన ప్రభుత్వం వాటి స్థానంలో ఆహారభద్రత కార్డులను ప్రవేశపెట్టింది. వీటికోసం జిల్లాలో ఇప్పటికే 12లక్షల పైచిలుకు కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి.

అందులో ఇప్పటివరకు 10.46 ల క్షల కార్డులను మంజూరు చేశారు. మరో లక్షన్నరకుపైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీళ్లుకాక జిల్లాలో ఆహారభద్రత కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు మరో 50 వేలకుపైగా సిద్ధమైనట్లు తెలుస్తోంది. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు, సంపన్నులు, ఐటీ చెల్లించే ప్రైవేటు ఉద్యోగుల కుటుంబాలన్నీ కలిపితేనే సమగ్ర కుటుంబ సర్వే తేల్చిన గణాంకాలు 12,35,837 కుటుంబాలు మాత్రమే. పైన పేర్కొన్న వర్గాలకు ఆహార భద్రత కార్డులిచ్చే పరిస్థితి లేదు. అయినప్పటికీ కార్డుల జారీ ప్రక్రియ చూస్తుంటే ఎస్‌కేఎస్ కుటుంబాల సంఖ్యను కూడా దాటే పరిస్థితి కన్పిస్తోంది.

25శాతం బోగస్ కార్డులే
కరీంనగర్ జిల్లాలో 25 శాాతానికిపైగా ఆహార భద్రత కార్డులు అనర్హుల చేతుల్లోకి వెళ్లినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు, క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం, చేతివాటం మూలంగా కార్డుల సంఖ్య చాంతాడంత పెరిగిపోయింది. రామగుండం, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లలో రూ.మూడు వేలిస్తే ఆహార భద్రత కార్డులిస్తామని పలువురు బ్రోకర్లు వందలాది మంది నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు బాహాటంగానే ఆరోపణలొస్తున్నాయి. మరోవైపు చాలాచోట్ల రేషన్ డీలర్లు సైతం వివిధ పేర్లతో వందల సంఖ్యలో కార్డులను సొం తం చేసుకున్నట్లు సమాచారం. నిజాయతీ అధికారులతో కూడిన కమిటీతో విచారణ చేయిస్తే ఆహార భద్రత కార్డుల బాగోతం బయటపడే అవకాశాలున్నాయి.
 
మళ్లీ వడపోత ఉంటుంది: డీఎస్‌వో చంద్రప్రకాశ్
కరీంనగర్ జిల్లాలో ఆహారభద్రత కార్డుల కోసం దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా వచ్చాయి. అంతకుముందు కుటుంబం వార్షిక ఆదాయం రూ.75 వేలుండగా ప్రభుత్వం దానిని రూ.2 లక్షలకు పెంచారు. దాంతో జిల్లాలోని కుటుంబాలతో సమానంగా ఆహారభద్రత కార్డుల కోసం దరఖాస్తులు వచ్చాయి. వచ్చినదరఖాస్తులను పరిశీలించి నిబంధనల ప్రకారం అర్హులకు మంజూరు చేయడంతో సంఖ్య పెరుగుతోంది. ఇది ఇక్కడితో ఆగదు. మళ్లీ ఫిల్టరింగ్ తప్పదు. వడపోత చేసి ఖచ్చితమైన అర్హులకే కార్డులుండేలా చర్యలు తీసుకోనున్నాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement