మాక్లూర్ : ‘నల్లాల నుంచి వచ్చే నీళ్లు మంచిగనే ఉంటయ్ అనుకున్నం. కానీ, కొద్దిగా తాగితే కళ్లు, ఒళ్లు తిరిగింది. చానా నీళ్లు తాగితే చచ్చేటోళ్లం’ అని మండలంలోని గద్వాల్ క్యాంపు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. వారు తెలిపిన వివరాలిలా...గ్రామ సమీపంలోని తాగునీటి బోరుబావిలో బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పంటల పొలాలకు వాడే పురుగుల మందు పోశారు. గురువారం ఉదయం గ్రామ వాటర్‌మన్ లచ్చయ్య వెళ్లి మోటారు స్టార్ట్ చేయగా బోరుబావి నుంచి ట్యాంకులోకి విషం కలిపిన నీరు చేరింది.
అదే నీటిని కుళాయిల ద్వారా గ్రామంలో సరఫరా చేయడంతో వాటిని పట్టుకుని తాగగా వాసన వచ్చింది. కొంచెం తాగి చూస్తే కళ్లు తిరగడం ప్రారంభమైంది. పురుగుల మందు కలిపి ఉంటారని గ్రహించి గ్రామస్తులు ఎంపీడీఓ, పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. బోరుబావి వద్ద పురుగుల మందు డబ్బా దొరికిందని తెలిపారు.
నిందితులను పట్టుకుని తాగునీటి సౌకర్యం కల్పించాలని ఎంపీడీఓను వేడుకున్నారు. కాసేపు ధర్నా నిర్వహించిన అనంతరం ఎంపీడీఓ గోపిబాబు, ఎస్సై వెంకట్‌రాములు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు గోపాల్‌నగేష్, గ్రామస్తులు గంగాధర్, ఇసాక్, పురుషోత్తం, పద్మారావు, సామెల్, లచ్చయ్య, బెంచిమెన్, మనోహర్, సుమారు 100 మంది పాల్గొన్నారు.
ఈ నీళ్లు తాగితే చచ్చేటోళ్లం
Published Fri, Apr 24 2015 1:53 AM | Last Updated on Sun, Sep 3 2017 12:45 AM
Advertisement