ఎన్నికల కోలాహలం.. నిఘా పటిష్టం | central paramilitary forces on election duty | Sakshi
Sakshi News home page

ఎన్నికల కోలాహలం.. నిఘా పటిష్టం

Published Fri, Nov 23 2018 10:06 AM | Last Updated on Wed, Mar 6 2019 6:04 PM

central paramilitary forces on election duty - Sakshi

జిల్లాకు చేరుకున్న భద్రతా దళాలు

సాక్షి, వనపర్తి క్రైం: పోలింగ్‌ సమయం మరింత దగ్గర పడుతుండటంతో పోలీసులు పటిష్టమైన బందోబస్తును సిద్ధంచేశారు. ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఖర్చుపై నిఘా బృందాలు నిఘా ఉంచాయి. అక్రమ మద్యం, డబ్బు పంపిణీ, ఓటర్లకు తాయిలాలు అనుమతి లేకుండా ప్రచార కార్యక్రమాలు నిర్వహించడంపై నిఘా బృందాలు కన్నెసి ఉంచాయి.

డిసెంబర్‌ 7న ఎన్నికలు ఉండటంతో గ్రామాలు, పట్టణాల్లో అభ్యర్థులు సుడిగాలి పర్యటనలు చేస్తూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఎన్నికల నియమావళికి లోబడి ప్రవర్తిస్తున్నారా, సమావేశానికి ఎంత వెచ్చిస్తున్నారు అనే విషయాలను లెక్క తేల్చడానికి తనిఖీ బృందాలు వెంటాడుతున్నాయి.   


తాయిలాలపై ప్రత్యేక దృష్టి  
ఆయా పార్టీల అభ్యర్థులు ఓటర్లకు తాయిలాల పంపిణీపై నిఘా బృందాలు ప్రత్యేకదృష్టి సారించాయి. డబ్బు, మద్యం పంపిణీపై ఓవైపు సివిల్‌ పోలీసులు, మరోవైపు ఎక్సైజ్‌శాఖ సిబ్బంది విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.  

ప్రస్తుతం జిల్లాలో వివిధ విభాగాలకు చెందిన 1500 మంది పోలీసులు ఉండగా, మరో రెండు మూడు రోజుల్లో 600 మంది సెంట్రల్, స్టేట్‌ పారామిలటరీ బలగాలు రానున్నాయి. ఆరు ఫ్లయింగ్‌ స్వా్కడ్‌ బృందాలు పనిచేస్తుండగా, ఆరు చెక్‌ పోస్టులను ఏర్పాటుచేశారు. ప్రతి వాహనాన్ని ఆపి విస్తృతంగా తనిఖీచేస్తున్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన నాటి నుంచి రూ.50లక్షల నగదును పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు.  


సమస్యాత్మక గ్రామాల్లో అవగాహన  
జిల్లాలో ఉన్న 40 సమస్యాత్మక గ్రామాలపై ఎస్పీ అపూర్వరావు ప్రత్యేక దృష్టి సారించారు. ఆయా గ్రామాల్లో ఏర్పాటుచేసి ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో 62 ఉన్న సమస్యాత్మక గ్రామాలు 57కు చేరాయి. ముఖ్యంగా యువత గొడవలకు వెళ్లకుండా వారిని చైతన్యం చేస్తున్నారు. ప్రత్యేకంగా పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ఓటుహక్కును వినియోగించుకోవాలని ఓటర్లకు సూచిస్తున్నారు.

అభ్యర్థుల సమావేశం, ప్రచారాలపై ఎస్పీ ఎప్పటికప్పుడు కిందస్థాయి అధికారుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. జిల్లాలో 513 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించారు. ఎస్పీ నేతృత్వంలో పలు గ్రామాల్లో కార్డెన్‌సెర్చ్‌ నిర్వహిస్తూ అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.   


బ్యాంకు లావాదేవీలపై నజర్‌ 
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బ్యాంకుల్లో వివిధ లావాదేవీలు జరిపే వారిపై ప్రత్యేక దృష్టి సారించారు. నామినేషన్ల పర్వం ముగియడంతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రాజకీయ పార్టీల నాయకులు వివిధ మార్గాల్లో ప్రయత్నాలు ఆరంభించారు. అభ్యర్థుల ఎత్తుగడలను అడ్డుకునేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపట్టింది.

ఖాతాల్లో ఒకేసారి నగదు జమకావడం, ఎక్కువ లావాదేవీలు నిర్వహించడం తదితర వాటిపై నిఘా ఉంచారు. రూ.50వేలు దాటితే పాన్‌కార్డు నంబర్‌ తప్పనిసరి అడుగుతున్నారు. ముఖ్యంగా రూ.లక్షలకు మించిన లావాదేవీలపై ఆరా తీస్తున్నారు.

  
 27న వనపర్తికి సీఎం కేసీఆర్‌ రాక 
ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్‌ అధినే త, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వ నపర్తికి రానున్నారు. అందుకోసం టీఆర్‌ఎస్‌ అ భ్యర్థులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కేసీఆర్‌ ప్రచారానికి వస్తున్నందున భద్రత ఏర్పాట్లపై జి ల్లా పోలీసులు ప్రణాళిక రూపొందించనున్నారు.   


యువత భవిష్యత్‌నునాశనం చేసుకోవద్దు  
జిల్లాలో ఉన్న సమస్యాత్మక గ్రామాల్లో ఓటర్లకు అవగాహన కల్పించాం. ఓటర్లు ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఒకరి సమావేశాలు జరిగే సమయంలో మరొకరు అక్కడి వెళ్లి గొడవలు చేస్తే చర్యలు తప్పవు. ముఖ్యంగా యువత గొడవలకు దిగి వారి భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దు. డబ్బు, మద్యం పంపిణీ జరగకుండా చెక్‌పోస్టులు ఏర్పాటుచేశాం. 
– అపూర్వరావు, ఎస్పీ, వనపర్తి   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement