ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈనెల 13వ తేదీ నాటికి జిల్లా ఓటర్ల సంఖ్య 28 లక్షల మార్క్‌ను దాటింది. శాసనసభ ఎన్నికల్లో ఓటు వేయడానికి ఈనెల 9వ తేదీలోగా ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఇచ్చిన అవకాశానికి భారీ స్పందన లభించింది. గత నెలన్నర రోజుల్లోనే జిల్లా వ్యాప్తంగా 1.60 లక్షల మంది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవడం విశేషం. వీటిలో 1.22 లక్షల దరఖాస్తులను అధికారులు పరిశీలించి 1.06 లక్షల అర్జీలు నిబంధనలకు అనుగుణంగా ఉండడంతో వారికి ఓటు హక్కు కల్పించారు. మరో 16,321 మంది దరఖాస్తులను తిరస్కరించారు. మరో 37 వేలకుపైగా దరఖాస్తులను పరిశీలించాల్సి ఉంది.
వీటిని కూడా ఈనెల 19 తేదీలోగా పరిష్కరించనున్నారు. కొత్తగా ఓటు హక్కు పొందిన వారి కోసం అనుబంధ జాబితాని ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. ఈ జాబితాలో కొత్త ఓటర్లకు స్థానం దక్కనుంది. వీరంతా ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. గత నెల 12న విడుదల చేసిన తుది జాబితా ప్రకారం జిల్లాలో 27.12 లక్షల మంది ఓటర్లుగా నమోదయ్యారు. తాజా పెంపుతో ఈ సంఖ్య 28.19 లక్షలకు చేరుకుంది. ఈ ఏడాది కొత్త ఓటర్లు 2.50 లక్షలు..
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయడానికి ఈ ఏడాది జనవరి ఒకటి నాటికి 18 ఏళ్ల వయసు నిండాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ నిర్దిష్ట వయసున్న వారు ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు అవకాశమిచ్చారు. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి సెప్టెంబర్ 26వ తేదీ వరకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో కలిపి మొత్తం 1.63 లక్షల దరఖాస్తులు అధికారులకు అందాయి. ఇందులో తొలిసారిగా ఓటు హక్కు పొందడంతోపాటు ఒక నియోజకవర్గంలో ఉన్న ఓటును రద్దు చేసుకుని మరొక అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో నమోదు చేసుకున్న వారి దరఖాస్తులున్నాయి. వీటన్నింటినీ వడపోసి అర్హత సాధించిన వారికి గత నెల విడుదలైన ఓటర్ల తుది జాబితాలో చోటు కల్పించారు. ఆ తర్వాత ఎన్నికల సంఘం మరిన్ని సూచనలిచ్చింది. వచ్చే ఎన్నికలకు నామినేషన్లు దాఖలయ్యే చివరి తేదీ వరకు ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు అవకాశమిచ్చారు.
తుది జాబితాలో పేర్ల నమోదుకు కటాఫ్‌గా తీసుకున్న సెప్టెంబర్ 26 నుంచి ఈనెల 9 వరకు ఓటు హక్కు పొందేందుకు అవకాశం కల్పించారు. ఈ 45 రోజుల వ్యవధిలోనే మరో 1.60 లక్షల మంది దరఖాస్తు చేసుకోవడం విశేషం. మొత్తం మీద ఈ ఏడాదిలో ఇప్పటివరకు కొత్తగా ఓటు హక్కు కోసం 3.29 లక్షల దరఖాస్తులురాగా.. ఇందులో నిబంధల మేరకు అన్ని అర్హతలున్న 2.49 లక్షల మందికి ఓటు హక్కు కల్పించారు.
Comments
Please login to add a commentAdd a comment