సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల సమరానికి ఓటర్లు, అభ్యర్థులూ సిద్ధమయ్యారు. డిసెంబర్ 7న రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాలకు జరగనున్న ఈ ఎన్నికల్లో మొత్తం 2,80,64,684 మంది ఓటర్లు ఓటేయనుండగా, 1,821 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అత్యధికంగా 5,75,541 మంది ఓటర్లుండగా, మల్కాజ్‌గిరి నియోజకవర్గం నుంచి అత్యధిక సంఖ్యలో 42 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. భద్రాచలంలో అత్యల్పంగా 1,37,319 మంది ఓటర్లుండగా, బోథ్, జుక్కల్, నర్సాపూర్ నియోజకవర్గాల నుంచి అతి తక్కువ సంఖ్యలో 7 మంది చొప్పున అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ నెల 23తో నామినేషన్ల ఉపసంహరణ పూర్తి కావడంతో అభ్యర్థుల తుది జాబితాలను ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రంలోని ఓటర్ల జాబితా రెండో అనుబంధాన్ని ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. ఈ నెల 19న ఈ జాబితాను ప్రకటించాల్సి ఉండగా, ఇప్పటి వరకు అధికారికంగా బయటకు వెల్లడించలేదు. తాజాగా ఈ జాబితాను ‘సాక్షి’సంపాదించింది. తుది ఓటర్ల జాబితాలో 1,41,56,182 మంది పురుషులు, 1,39,05,811 మంది మహిళలు, 2,691 మంది ఇతరులు కలిపి మొత్తం 2,80,64,684 మంది ఓటర్లు ఉన్నారు.
స్త్రీ, పురుష ఓటర్ల మధ్య భారీ వ్యత్యాసం
ఓటర్ల తుది జాబితాలో సైతం స్త్రీ, పురుష ఓటర్ల మధ్య వ్యత్యాసం గణనీయ సంఖ్యలో కనిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా ఓటర్లతో పోల్చితే పురుష ఓటర్లు 2,50,371 మంది అధికంగా ఉన్నారు. సంఖ్యాపరంగా 119 స్థానాలకు గాను 64 నియోజకవర్గాల్లో పురుష ఓటర్లు, 55 మంది నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు పై చేయి సాధించారు. నియోజకవర్గాల వారీగా ఖుత్బుల్లాపూర్‌లో మహిళల కంటే పురుష ఓటర్లు ఏకంగా 33,961 మంది అధికంగా ఉండగా, జూబ్లీహిల్స్‌లో 24,839 మంది, కూకట్‌పల్లిలో 21,846 మంది, మేడ్చల్‌లో 20,654 మంది అధిక సంఖ్యలో ఉన్నారు.
పెరిగిన బ్యాలెట్లు: రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో వినియోగించనున్న ఈవీఎంలలోని ఒక బ్యాలెట్ యూనిట్‌లో నోటాతో కలిపి గరిష్టంగా 16 మంది అభ్యర్థులకు మాత్రమే చోటు కల్పించడానికి అవకాశముంది. అభ్యర్థుల సంఖ్య పెరిగే కొద్దీ ప్రతి 16 మంది అభ్యర్థులకు ఒక బ్యాలెట్ యూనిట్ చొప్పున వాడాల్సి ఉంటుంది. మల్కాజ్‌గిరి నుంచి 42, ఉప్పల్, ఎల్బీనగర్ నుంచి చెరో 35 మంది, ఖైరతాబాద్ నుంచి 32 మంది పోటీ చేస్తుండటంతో ఈ స్థానాల్లో ఒక ఈవీఎంకు మూడు బ్యాలెట్ యూనిట్లను అనుసంధానం చేసి పోలింగ్ నిర్వహించనున్నారు. దీంతో ఓటర్లు తాము ఓటేయనున్న అభ్యర్థి పేరును మూడు బ్యాలెట్ యూనిట్లలో వెతికి జాగ్రత్తగా మీట నొక్కాల్సిన పరిస్థితి రానుంది.
ఇక అంబర్‌పేట్ నుంచి 31 మంది, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి, మిర్యాలగూడ నుంచి 29 మంది, రాజేంద్రనగర్, ముషీరాబాద్ నుంచి 26 మంది, కరీంనగర్, గోషామహల్, సూర్యాపేట నుంచి 25 మంది, యాకుత్‌పూరా, నిజామాబాద్ అర్బన్, మంచిర్యాల, వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్ నుంచి 21 మంది, ఖుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, ఇబ్రహింపట్నం, మలక్‌పేట నుంచి 20 మంది, కంటోన్మెంట్, నాంపల్లి 19 మంది, దుబ్బాక, జూబ్లీహిల్స్, కార్వాన్, పాలకుర్తి నుంచి 18 మంది, పెద్దపల్లి, మహేశ్వరం, నల్లగొండ, తుంగతుర్తి, కొత్తగూడెం నుంచి 17 మంది, ములుగు, పినపాక, హూజూర్‌నగర్, రామగుండం, పటాన్‌చెరు, చార్మినార్ నుంచి 16 మంది పోటీ చేస్తుండటంతో ఈ స్థానాల్లో రెండేసి బ్యాలెట్ యూనిట్లు, మిగిలిన స్థానాల్లో ఒక యూనిట్‌తో పోలింగ్ జరపనున్నారు.
ఓటర్లు 2,80,64,684.. అభ్యర్థులు 1,821
Published Sun, Nov 25 2018 3:21 AM | Last Updated on Sun, Nov 25 2018 3:22 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment