ప్రస్తుతం నగరంలో వజ్రాభరణాలపై ఆసక్తి పీక్ స్టేజ్‌లో ఉంది. ఒకప్పుడు వైట్ గోల్డ్ అంటే కాస్త తటపటాయించే మధ్యతరగతి వర్గాలు సైతం డైమండ్‌కి డైహార్డ్ ఫ్యాన్స్ అయిపోతున్నారు. దీంతో సిటీ షాప్స్‌లో డైమండ్ జ్యువెలరీ వెరైటీలు వెల్లువెత్తుతున్నాయి. అయితే వజ్రం మరింత అపురూపం కానుంది అంటున్నారు నగరానికి చెందిన ఆభరణాల నిపుణులు. రోజురోజుకు వజ్ర నిల్వలు పడిపోతుండడమే దీనికి కారణమంటున్నారు.
సాక్షి, సిటీబ్యూరో : ఇప్పుడు సిటీ ఆభరణాల విపణిలో బిజినెస్ హీట్ పెంచుతున్న డైమండ్స్... అగ్నిపర్వతాల పేలుళ్లు తదనంతర పరిణామల నుంచి పుడతాయి. చేతి గడియారాల దగ్గర్నుంచి కోట్ బటన్‌ల దాకా అన్నింటా నగరవాసుల అలంకరణలో భాగమైపోయిన వజ్రం... స్టేటస్ సింబల్ మాత్రమే కాదు ఎన్నో విశేషాల చిరునామా కూడా.
శక్తికి.. సామర్థ్యానికి..
భూమితో సమానంగా దాదాపు అంతే వయసు డైమండ్స్‌కి కూడా ఉంటుందని ఒక అంచనా. వజ్రాలపై సామాన్య ప్రజానీకంలో ఆసక్తి ఇప్పటిదేమో కానీ... దానికి ఉన్న క్రేజ్ ఏనాటిదో. ఆకర్షణీయమైనవి అనేదాని కన్నా శతాబ్దాల క్రితం వీటిని ధరిస్తే అవి శక్తిని, ధైర్యాన్ని, అజేయమైన భవిష్యత్తును అందిస్తాయనే నమ్మకం కూడా దీనికో కారణం. అలంకారానికి, కట్టింగ్ టూల్స్‌గానూ, దెయ్యాన్ని పారద్రోలే మహత్యం కలిగినవి గానూ, ఆఖరికి యుద్ధంలో గెలుపును అందించేవిగానూ వజ్రాలను విశ్వసించేవారు. మెడికల్ ఎయిడ్‌గా, అనారోగ్యం నుంచి కోలుకునేలా చేసేవిగా, గాయాలను మాన్పేవి అనీ కూడా వాడేవారట.
మేరా భారత్ డైమండ్...
16వ శతాబ్దంలో భారతదేశంలో వజ్రాల ఉత్పత్తి అత్యధికంగా జరిగింది. అలాగే 18వ శతాబ్దం దాకా ప్రపంచంలో భారతదేశం మాత్రమే డైమండ్స్ లభించే ఏకైక చోటు. వజ్రాల ప్రాశస్త్యం పెరుగుతున్న 1400 సంవత్సరం ప్రాంతంలో వెనిస్ తదితర యూరోపియన్ వాణిజ్యంలో భారతీయ డైమండ్స్ కాంతులీనాయి. ప్రస్తుతం బ్రిటీషర్ల సొంతమైన కోహినూర్ దగ్గర్నుంచి చాలా మందికి తెలియని గ్రేట్ మొఘల్, ఫ్లోరెంటైన్, రెజెంట్, దార్యా–ఐ–నూర్, పైగొట్, టావర్నియర్, నాస్సక్ వంటి ప్రసిద్ధ వజ్రాలు మన దేశంలోనే తయారైనవి.
అపురూపమవుతోంది...
ఇండియన్ డైమండ్ మైన్స్ క్షీణించడం ప్రారంభించాక... ప్రత్యామ్నాయాలకై వెదుకులాట మొదలైంది. బ్రెజిల్‌లో 1725లో కాస్త మొత్తంలో వజ్ర నిక్షేపాలను కనుగొన్నప్పటికీ... ప్రపంచ అవసరాలకు అది సరిపోలేదు. దీంతో డైమండ్స్ ఇంకా అరుదైపోతున్నాయి. ఇప్పటిదాకా చెప్పుకోదగిన రీతిలో వజ్ర నిక్షేపాలను కనుగొని 20ఏళ్లయింది అంటేనే అవి ఎంత అపురూపమైనవిగా మారుతున్నాయో అర్థమవుతుంది. ఇప్పుడు అరకొరగా అయినా ప్రపంచవ్యాప్తంగా 50 ప్రాంతాల్లో మాత్రమే లభిస్తున్నాయి. ప్రస్తుతం బాగా డైమండ్ మైనింగ్ జరిగే ప్రాంతాలుగా దక్షిణాఫ్రికా, రష్యా, బోత్సానా మాత్రమే పేరొందాయి.
ప్రతిదీ విశేషమే...
డైమండ్ అంటే ప్రేమను, ఇష్టాన్ని వ్యక్తపరిచేందుకు ఒక అత్యుత్తమ మార్గం. దానిని ఎంత అపురూపమైన బహుమతిగా వినియోగిస్తున్నారో... అంతే అరుదుగా వజ్ర నిల్వలు లభిస్తున్నాయి. దీని చరిత్ర, లభ్యతతో పాటు దీనిని మలిచే క్రమం కూడా కష్టతరమైనదే. పాలిషింగ్ సమయంలో సగానికిపైగా రఫ్ డైమండ్ అదృశ్యం అవుతుంది. సింపుల్ డైమండ్ కట్స్ గురించి తెలుసుకోవడానికి కూడా కనీసం రెండేళ్లు పడుతుంది. అనుభవజ్ఞులైన క్రాఫ్టŠస్‌మెన్‌కి సైతం అత్యంత ఖరీదైన డైమండ్స్‌ని కట్ చేయడానికే రెండేళ్లు పడుతుంది. – రిచాసింగ్, ఎండీ, డీపీఏ ఇండియా
Comments
Please login to add a commentAdd a comment