గుట్ట మాస్టర్‌ప్లాన్‌పై సమీక్ష
నేడు యాదగిరిగుట్టకు రానున్న సీఎం కేసీఆర్
ఆర్కిటెక్‌లతో కలిసి ఆలయ పరిసరాలు పరిశీలించే అవకాశం
స్వామి,అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం
భువనగిరి : తిరుపతి తరహాలో యాదగిరిగుట్ట అభివృద్ధికి రూపొం దించిన మాస్టర్‌ప్లాన్‌పై క్షేత్రస్థాయిలో సమగ్రంగా చర్చించేందుకు సీఎం కేసీఆర్ బుధవారం యాదగిరిగుట్టకు రానున్నారు. ఈ మేరకు ముంబయ్ నుంచి అర్కిటెక్‌లు, స్థపతులు, యాదగిరిగుట్ట డెవలప్‌మెంట్ అథారిటీ అధికారులు అయన వెంట రానున్నారు. మంగళవారం సచివాలయంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో గుట్ట అభివృద్ధికి రూపొందించిన మాస్టర్‌ప్లాన్ నమూనాను సీఎం పరిశీలించారు. డిజైన్‌లు, ప్రణాళికలపై అధికారులతో చర్చించారు. దీంతోపాటు స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవానికి సం బంధించి గతంలో ప్రకటించిన విధంగా స్వ యంగా పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
గత అక్టోబర్ 17, డిసెంబర్ 17న రెండుసార్లు గుట్టకు వచ్చిన కేసీఆర్ తిరుపతి తరహాలో యాదగిరిగుట్టను అభివృద్ధి చేస్తానని వెల్లడించారు. ఈ మేరకు యాదగిరిగుట్ట డెవలప్‌మెంట్ అధారిటీని నియమించడంతోపాటు, తొలిబడ్జెట్‌లో 100 కోట్ల రూపాయలు కేటాయించారు. తాజాగా దేవాదాయ శాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి సచివాలయంలో యాదగిరిగుట్ట అభివృద్ధిపై సమీక్ష నిర్వహించి మరో రూ.100 కోట్లు వచ్చే బడ్జెట్‌లో కేటాయించాలని కోరారు. మరోవైపు యాదగిరిగుట్ట డెవలప్‌మెంట్ అధికారులు గుట్ట అభివృద్దికి సంబంధించిన ప్రణాళికను రూపొందించి సీఎంకు సమర్పించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ తాజా పర్యటన మరింత అసక్తికరంగా మారింది.
నాలుగు దశల్లో అభివృద్ధి?
యాదగిరిగుట్ట క్షేత్రాన్ని నాలుగు దశల్లో అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. మొదటి దశలో దేవాలయం అభివృద్ధి, రెండవ దశలో కొండపైన ఆలయ పరిసరాలు, పార్కింగ్ రవాణా వసతులు, మూడవ దశలో కొండ చుట్టూ పచ్చదనం గ్రీన్ పార్క్, నాలుగో దశలో అభయారణ్యం, ఆధ్యాత్మిక కేంద్రాలు అభివృద్ధి చేయడానికి మాస్టర్‌ప్లాన్ రూపొందించాలని అధికారులకు సూచించారు. ఇందుకోసం దేశంలోని ప్రముఖ అర్కిటెక్‌లను పిలిపించి మైక్రో ప్లానింగ్ చేయించాలని రెండవ సారి గుట్టకు వచ్చిన సమయంలో ఆదేశించారు.
గతంలో సీఎం ప్రతిపాదనలు ఇలా
ప్రధాన ఆలయం అభివృద్ధిని ఆగమశాస్త్రం ప్రకారం చేపట్టాలని, ఇందుకోసం ప్రణాళికను రూపొందించాలని స్థపతి సుందర్‌రాజన్‌ను ఆదేశించారు.
ఎక్కువమంది భక్తులు ఆలయంలో కూర్చోని స్వామివారిని దర్శించుకునేందుకు వీలుగా ఆలయ పరిసరాలను వెడల్పు చేయాలి.
ఇందుకోసం ఆగమశాస్త్రం నిబంధనల ప్రకారం ఆలయాన్ని విస్తరించాలి.
ఆలయం చట్టు గల మాడవీధులతోపాటు కొండపై ఎక్కడి నుంచి చూసిన స్వామి వారి దివ్యగోపురం కనిపించేందుకు అడ్డంకిగా ఉన్న పాత భవనాలను కూల్చివేయాలి.
ఆలయం పవిత్రతకు ఎలాంటి భంగం కలగకుండా మార్పులు చేర్పులు చేయాలి.
ఆలయం చుట్టూ ఉన్న మూడు మాడ వీధులలో ప్రాకారాలు నిర్మించాలి.
ఆలయ విమాన గోపురం ఎత్తును 42 ఫీట్ల ఎత్తుకు పెంచాలి.
గతంలో ఉన్న మెట్లమార్గం అభివృద్ధి చేసి కాలినడకన వచ్చే భక్తులకు వసతులు కల్పించాలి.
భక్తులకు శ్రీ గిరి ప్రదర్శన, వాకింగ్, సైక్లింగ్‌కు ఉపయోగపడే విధంగా కొండ చుట్టూ ఫుట్‌పాత్‌ను అన్ని వసతులతో రూపొందించాలి.
యాదగిరికొండపై ఎత్తై ఆంజనేయస్వామి, గరుత్మంతుడి విగ్రహాలను ఏర్పాటు చేయాలి.
రెండు వేల ఎకరాల భూసేకరణ వేగవంతం చేయాలి.
ప్రస్తుతం సేకరించాలనుకుంటున్న భూమిలోని ఆట వీ శాఖ భూమిలో నృసింహ అభయారణ్యం ఏర్పాటు చేసి జింకలు, ఇతర వన్యప్రాణులను పెంచాలి.
భక్తుల వాహనాలు కొండపైన నిలపకుండా కింది భాగంలో నిలిపే విధంగా పార్కింగ్ జోన్ ఏర్పాటు చేయాలి.
సీఎం టూర్ షెడ్యూల్
ఉదయం 10 గంటలకు బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరుతారు.
11.30గంటలకు యాదగిరిగుట్టకు చేరుకుంటారు.
2 గంటల వరకు కొండపైన అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష, పరిసరాల పరిశీలన.
2 గంటలకు తిరిగి హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు పయనం.