* తిరుపతి తరహాలో యాదగిరిగుట్ట సమగ్రాభివృద్ధి
* నాలుగంచెల ప్రణాళిక రూపకల్పనకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశం
* ఆగమశాస్త్ర ప్రకారం కొండపై మార్పులు చేర్పులు
* ఆలయ విస్తరణ, గోపురం ఎత్తు పెంపు, మాడవీధుల్లో ప్రాకారాల నిర్మాణం.. మెట్లమార్గం పునరుద్ధరణ
* గుట్టపై ఆంజనేయస్వామి, గరుత్మంతుని భారీ విగ్రహాలు
* కొండ చుట్టూ గిరి ప్రదర్శన, వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌లు
* యాదగిరీశుడ్ని దర్శించుకున్న సీఎం, గుట్టపైనే అధికారులతో సమీక్ష
* 2 వేల ఎకరాల భూసేకరణపై ప్రత్యేక దృష్టి
భువనగిరి (నల్లగొండ): ప్రఖ్యాత పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట సమగ్రాభివృద్ధిపై సీఎం కె.చంద్రశేఖర్‌రావు దృష్టిసారించారు. తిరుపతి తరహాలో భక్తులకు సకల సౌకర్యాలను కల్పిస్తూ గుట్టను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేలా మాస్టర్‌ప్లాన్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సరిగ్గా రెండు నెలల తర్వాత కేసీఆర్ బుధవారం యాదగిరిగుట్ట క్షేత్రాన్ని మరోసారి సందర్శించారు. గుట్టపై కొలువైన శ్రీ లక్ష్మీ నారసింహస్వామిని దర్శించుకున్నారు. శివాలయాన్ని కూడా సందర్శించి మెట్ల మార్గంలో కొంచెం దూరం వెళ్లి పరిశీలించారు. అనంతరం ఆండాళ్ నిలయంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు.
యాదగిరిగుట్టను నాలుగంచెల్లో అభివృద్ధిపరచాలని సీఎం సూచించారు. తొలిదశలో దేవాలయాభివృద్ధి, రెండోదశలో కొండపైన పరిసరాలను తీర్చిదిద్దడం, మూడోదశలో కొండ చుట్టూ పచ్చదనాన్ని పెంపొందించడం, గ్రీన్‌పార్క్ ఏర్పాటు, నాలుగోదశలో అభయారణ్యం, ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేయాలని పేర్కొన్నారు. ఇందుకోసం దేశంలోని ప్రముఖ ఆర్కిటెక్ట్‌లను పిలిపించి మైక్రోప్లానింగ్ చేయించాలని గుట్ట డెవలప్‌మెంట్ అథారిటీ అధికారులను ఆదేశించారు.
ఆగమశాస్త్ర ప్రకారం ప్రధానాలయాన్ని అభివృద్ధిపరచాలని, ఇందుకు తగిన ప్రణాళికను రూపొందించాలని ఆలయ స్థపతి, వాస్తుశిల్పి సుందర్‌రాజన్‌ను కోరారు. ఎక్కువ మంది భక్తులు కూర్చోడానికి వీలుగా ఆలయాన్ని విస్తరించాలని సూచించారు. ఆలయం చుట్టూ ఉన్న మూడు మాడవీధుల్లో ప్రాకారాలను నిర్మించాలని, విమానగోపురం ఎత్తును 42 అడుగులకు పెంచాలని పేర్కొన్నారు. కొండపై ఎక్కడి నుంచి చూసినా స్వామివారి దివ్యగోపురం కనిపించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు అడ్డంకిగా ఉన్న పాత భవనాలను కూల్చివేయాలని చెప్పారు. ఉత్తరం దిక్కున ఆలయ మండపాన్ని విస్తరించాలని సూచించారు.
ఆలయం వెలుపల ప్రసాద విక్రయశాలను, వాస్తుకు విరుద్ధంగా ఈశాన్యంలో ఇటీవల నిర్మించిన పెద్ద వాటర్‌ట్యాంకు, సంగీత భవనం, ఇతరత్రా అవసరం లేని పాత భవనాలను వెంటనే కూల్చివేయాలని సీఎం ఆదేశించారు. అవసరమైతే ఆండాళ్ నిలయాన్ని కూడా తొలగించాలని పేర్కొన్నారు. మెట్లమార్గాన్ని పునరుద్ధరించి అభివృద్ధి చేయాలని, భక్తులకు వసతులు కల్పించాలని సూచించారు. గిరి ప్రదర్శన, వాకింగ్, సైక్లింగ్ కోసం కొండ చుట్టూ ప్రత్యేకంగా 8 ట్రాక్‌లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. కొండపై ఆగ్నేయంలో ఎత్తయిన ఆంజనేయస్వామి, వాయవ్యంలో గరుత్మంతుని విగ్రహాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
అటవీ భూమిలో వన్యప్రాణులను పెంచడానికి నృసింహ అభయారణ్యాన్ని ఏర్పాటు చేయాలన్నారు. కొండ దిగువనే వాహనాలు నిలిపేందుకు వీలుగా పార్కింగ్ జోన్ ఏర్పాటుకు కే సీఆర్ ఆదేశించారు. సమీక్షలో విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, మండలి వైస్‌చైర్మన్ నేతి విద్యాసాగర్, జిల్లా ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, వేముల వీరేశం, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
భూసేకరణను వేగవంతం చేయండి
యాదగిరిగుట్ట చుట్టూ రెండు వేల ఎకరాల భూసేకరణను వేగవంతం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా స్థానిక భూముల వివరాలను ఆయన పరిశీలించారు. గుట్టకు సంబంధించి 135 ఎకరాల స్థలం ఉందని, గుట్ట చుట్టూ 634 ఎకరాల రెవెన్యూ స్థలం ఉందని అధికారులు వివరించారు. దీంతో మిగతా స్థలాన్ని ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరించాలని కేసీఆర్ ఆదేశించారు. భువనగిరి మండలం రాయగిరిలో దిల్ సంస్థకు కేటాయించిన 72 ఎకరాలను స్వాధీనం చేసుకోవాలని కూడా చెప్పారు. గుట్ట మండలం దాసరపల్లి ప్రాంతంలో 220 ఎకరాలను సేకరించాలని, రైతుల వద్ద సేకరించే భూమికి ఎకరాకు రూ. 5 నుంచి రూ. 10 లక్షల వరకు చెల్లించాలని పేర్కొన్నారు.
యాదగిరిగుట్టకు మాస్టర్‌ప్లాన్
Published Thu, Dec 18 2014 1:07 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement