సాక్షి, హైదరాబాద్ : భూసేకరణ, నిధుల సమీకరణ, అటవీ అనుమతులు తదితర అంశాల్లో ఎలాంటి అవాంతరాలు లేనందున కాళేశ్వరం పనులు శరవేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రగతి భవన్‌లో శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. ఈమేరకు ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి త్వరలో వస్తుందని, అప్పటికే డిజైన్లు, ఇతర నిర్మాణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. కోర్టులో ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్‌కు కట్టుబడి ఉన్నామని, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మంచినీటి పథకానికి సంబంధించిన పనులు చేస్తున్నామని ప్రకటించారు. కాళేశ్వరం పథకానికి సంబంధించిన అంతర్రాష్ట ఒప్పందాలు పూర్తయ్యాయని, దీనికి సీడబ్ల్యూసీ ఆమోదించిందన్నారు. బడ్జెట్‌లో రూ.25 వేల కోట్లతో పాటు మరో రూ.20 వేల కోట్లు బ్యాంకుల ద్వారా సమకూరుస్తున్నట్లు ప్రకటించారు. తక్కువ వ్యవధిలో ప్రాజెక్టు అనుమతులు సాధించడానికి కృషి చేసిన అధికారులకు సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. గోదావరిపై నిర్మించే ప్రాజెక్టుల ద్వారానే హైదరాబాద్‌తో సహా 7 పాత జిల్లాలకు సాగునీరు, మంచినీరు అందిస్తామని సీఎం పేర్కొన్నారు.
విద్యుత్ శాఖకు సీఎం కృతజ్ఞతలు
తెలంగాణలో విద్యుత్ పరిస్థితిని అద్భుతంగా మెరుగుచినందుకు గాను ముఖ్యమంత్రి అధికారలుకు అభినందనలు తెలిపారు. వ్యవసాయాంతోపాటు ఇతర రంగాలకు 24 గంటల విద్యుత్ అందిస్తున్నామన్నారు. మూడు వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తితో దేశంలోనే ప్రధమస్థానంలో ఉన్నమని ఆయన తెలిపారు. త్వరలో మరో 500 మెగావాట్లు అందుబాటులోకి వస్తునందన్నారు. అనుకున్నదాని కంటే ముందే విద్యుత్ శాఖ పని పూర్తి చేస్తోందని, జెన్‌కో, ట్రాన్స్‌కో అధికారులు, సిబ్బంది సేవలను ఆయన కొనియాడారు. పంప్ హౌజ్‌ల వద్ద, ఇతర పనుల్లో చేసిన ఏర్పాట్లును జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావు, ఇతర అధికారులు సీఎంకు వివరించారు.
హరీష్‌పై కోటి ఆశలు
నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావుపై తెలంగాణ ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారని దానికి అనుగుణంగానే వారు పని చేస్తున్నారని పేర్కొన్నారు. మహారాష్టతో ఒప్పందం విషయంలో హరీష్‌రావు, సీఈ వెంకటేశ్వర్లు క్రియాశీలకంగా పనిచేశారన్నారు. ప్రాజెక్టులు పూర్తి కావడానికి కూడా ఇదే పట్టుదలతో పని చేయాలని సూచించారు. ఇకపై మంత్రి హరీష్ రావు ప్రతి 10 రోజులకోసారి కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించాలన్నారు. తాను కూడా ప్రతినెలకోసారి సమీక్షిస్తాన్నారు.
నెలన్నరలో 98 శాతం గ్రామాలకు భగీరథ నీళ్లు
మరో నెలన్నరలో 98 శాతం గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా నీళ్లు అందుతాయని సీఎం ప్రకటించారు. మిషన్ భగీరథకు దేశ వ్యాప్తంగా మంచి పేరు వచ్చిందని, ఇతర రాష్ట్రాలు కూడా ఇటువంటి ప్రాజెక్టుకోసం తెలంగాణ సహకారాన్ని కోరుతున్నారన్నారు. మిషన్ భగీరథకు కాళేశ్వరం ద్వారా నీరు అందించాలని కేసీఆర్ చెప్పారు. ‘‘దేవాదుల ఎత్తిపోతల పథకం కోసం అవసరమయ్యే నీటిని అందించడానికి కొత్తూరు వద్ద నిర్మిస్తున్న బ్యారేజీ పనుల్లో వేగం పెంచాలని మంత్రి హరీష్, ఇఎన్‌సీ మురళీధర్‌లకు సీఎం సూచించారు.
ఈ సమీక్షలో మంత్రులు టీ.హరీష్ రావు, ఈటల రాజేందర్, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, మిషన్ భగీరథ వైస్ చైర్మెన్ వేముల ప్రశాంత్ రెడ్డి, నీటి పారుదల అభివృద్ధి సంస్థ చైర్మెన్ శంకర్ రెడ్డి, ఎంపీ బాల్క సుమన్, సీఎస్ ఎస్పీ సింగ్, డీజీపీ మహేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషీ, ముఖ్యకార్యదర్శులు రామకృష్ణరావు, పీకే జా, ట్రన్స్‌కో డైరెక్టర్లు సూర్యప్రకాశ్, జగత్ రెడ్డి నర్సింగ్ రావు, పెద్దపల్లి, సిరిసిల్లా, భూపాలపల్లి జిల్లాల కలెక్టర్లు, నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్, సీఈ వెంకటేశ్వర్లు, ఇతర ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
సమీక్షలో ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు
– అటవీ శాఖ అనుమతులు త్వరగా సాధించేందుకు పీసీసీఎఫ్ పీకే జాతో పాటు ఇతర అధికారులు బాగా శ్రమించాలి. ఇదే స్ఫూర్తితో ప్రాజెక్టు పనులు చేయడానికి, విద్యుత్ టవర్లు, లైన్లు నిర్మించడానికి అటవీ శాఖ సహకరించాలి.
– కాళేశ్వరం నుంచి ఎస్సారెస్పీ, సింగూరు, మిడ్‌మానేరుకు నీరు అందగలిగితేనే మంచినీటి పథకం అమలు చేయగలం. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి.
– ప్రతీ బ్యారేజీ వద్ద మంచి అతిథి గృహం నిర్మించాలి. అంతేకాకుండా బ్యారేజీపై డబుల్ లైన్ రోడ్డు నిర్మించాలి. విద్యుత్ సబ్ స్టేషన్లు, కాల్వలు, పంప్‌హౌజ్‌లకు శాశ్వత ప్రాతిపదికన రహదారులు నిర్మించాలి.
– ప్రతి పంప్‌హౌజ్ వద్ద ఒక విద్యుత్ ఉద్యోగిని ప్రత్యేకంగా నియమించాలి. నీటిపారుదల శాలఖతో సమన్వయం ఏర్పాటు చేసుకోవాలి.
– బ్యారేజీలు, పంప్ హౌజ్‌లు, కరకట్టలు, కాలువలు, రిజర్వాయర్లు తదితర పనులన్ని సమాంతరంగా జరగాలి.
– బ్యారేజీల వద్ద భద్రతను పర్యవేక్షించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి. నిరంతరం నిఘా కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. ప్రతి ప్రాజెక్టు వద్ద కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయాలి.
– ప్రతి బ్యారేజీ వద్ద శాశ్వత ప్రాతిపదికపై హెలీప్యాడ్‌లను ఏర్పాటు చేయాలి.
– కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న మేడిగడ్డ వద్ద 365 రోజులు నీరు అందుబాటులోకి ఉంటుంది. కాబట్టి లిఫ్టులకు ఎంత పని జరిగితే అంత మేర నీటిని తరలించవచ్చు. ప్రాజెక్టు వంద శాతం పూర్తయ్యే దాకా ఆగాల్సిన పని లేదు.
– తుపాకులగూడెం, మేడిగడ్డ, అన్నారం, సుందేళ్ల బ్యారేజీల వద్ద గేట్లు ఆపరేట్ చేయడానికి అవసరమైన విద్యుత్ అందించాలి. జనరేటర్లు కూడా అందుబాటులోకి ఉంచాలి.
– లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం 400 కేవీ లైన్లను సిద్ధం చేశామని, కేవలం ఒకే కేంద్రం నుంచి కాకుండా వేర్వేరు జనరేషన్ స్టేషన్ల ద్వారా విద్యుత్ అందించడానికి ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఏ మాత్రం అంతరాయం కలగకుండా విద్యుత్ సరఫరా చేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment