సారొస్తారొస్తారా..! | CM KCR Will Contest From Nalgonda in 2019 Elections ? | Sakshi
Sakshi News home page

సారొస్తారొస్తారా..!

Published Sun, Apr 2 2017 4:41 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM

సారొస్తారొస్తారా..! - Sakshi

సారొస్తారొస్తారా..!

 ► వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ జిల్లా నుంచి పోటీ చేస్తారా..?
 ► వారం రోజులుగా రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ
 ► మిర్యాలగూడ స్థానం ఇచ్చేందుకు సిద్ధపడ్డ ఎమ్మెల్యే భాస్కరరావు
 ► అక్కడి నుంచి పోటీ చేస్తే 80శాతం ఓట్లేయిస్తామని వ్యాఖ్య
 ► స్వాగతించిన ఎంపీ గుత్తా..ఇతర గులాబీ నాయకులు
 ► ఎక్కడి నుంచి బరిలో ఉంటారన్న అంశంపై ఉత్కంఠ
 
‘నేను ఈ సారి రెండు చోట్ల పోటీ చేస్తా. గజ్వేల్‌తోపాటు నల్లగొండ జిల్లా నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నా. ఎలా ఉంటుంది. అని’ జిల్లాకు చెందిన  తనకు సన్నిహితుడైన ఓ రైతుతో సీఎం కేసీఆర్‌ చర్చించినట్లు సమాచారం. ఇది జిల్లా రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గామారింది. 
 
 నల్లగొండ : సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్ల ముందే జిల్లా రాజకీయవర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2019 ఎన్నికల్లో జిల్లా నుంచి పోటీ చేస్తారని వస్తున్న వార్తలు అన్ని పార్టీల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. వారం రోజుల క్రితం బయటకు వచ్చిన ఈ విషయంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. సీఎం.. జిల్లా నుంచే ఎన్నికల యుద్ధం చేస్తారన్న వార్తలు అధికార టీఆర్‌ఎస్‌ కేడర్‌లో ఉత్సాహంతోపాటు ఉత్సుకతను కలిగిస్తున్నాయి. ఇతర రాజకీయ పార్టీలు కూడా కేసీఆర్‌ వ్యూహం ఏంటన్న దానిపై చర్చలు చేస్తున్నాయి. రాజకీయ వర్గాలకు తోడు సామాన్య ప్రజానీకంలో సైతం ఈ అంశం అనేక రకాల చర్చలకు దారి తీస్తోంది.
 
అసలేం జరిగిందంటే..
కేసీఆర్‌కు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ ప్రారంభం నుంచి సీఎం అయ్యేంత వరకు జిల్లాతో చాలా అనుబంధం ఉంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన వందలాది మంది పార్టీ ముఖ్యులు, ఇతర వర్గాలకు చెందిన వారిని ఆయన పేరు పెట్టి పిలుస్తారు కూడా. వారిలో ముఖ్యమైన వారితో సీఎం టచ్‌లోనే ఉంటున్నారు. అలాంటి వారిలో మన జిల్లాలో పేరున్న ఓ రైతు కూడా ఉన్నారు. ఆయనతో సీఎం రెండు, మూడు నెలలకోసారి అయినా ఫోన్‌లో మాట్లాడతారని సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. 15 రోజుల క్రితం సీఎం కేసీఆర్‌ ఆ రైతుకు ఫోన్‌ చేసి తన ఇంటికి భోజనానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ మేరకు సదరు రైతు పది రోజుల క్రితం సీఎం దగ్గరకు వెళ్లారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆ రైతుతో సీఎం కేసీఆర్‌ తన పనిచేసుకుంటూనే ముచ్చట పెట్టారు. అక్కడే సదరు రైతుకు భోజనం పెట్టి సమయం దొరికినప్పుడల్లా పలు అంశాలపై మాట్లాడారు. 
 
ఆ సమయంలో అక్కడ ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, పింఛన్లు, మిషన్‌ భగీరథ.. ఇలా పలు అంశాలు చర్చకు వచ్చాయి. ఈ సందర్భంగా జిల్లా రాజకీయ పరిస్థితులు సైతం చర్చకు వచ్చాయని, ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్‌ తాను నల్లగొండ జిల్లా నుంచి పోటీ చేసే అంశాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. తాను ఈసారి రెండు చోట్ల పోటీ చేస్తానని, ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తోన్న గజ్వేల్‌తో పాటు నల్లగొండ జిల్లా నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నానని, ఎలా ఉంటుందని సదరు రైతును సీఎం ప్రశ్నించినట్లు సమాచారం. ఈ ప్రశ్నే జిల్లా రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఇంకా రెండేళ్లు సమయమున్నా అనేక చర్చోపచర్చలకు దారి తీస్తోంది. సీఎం కేసీఆర్‌ అసలు పోటీ చేస్తారా.. నల్లగొండ అంటే ప్రస్తుత జిల్లానా.. ఉమ్మడి జిల్లాలోని ఏదేని ప్రాంతం నుంచా.. అసెంబ్లీకి పోటీ చేస్తారా.. పార్లమెంట్‌కా.. అసలు ఇక్కడి నుంచి ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు అనే అంశాలపై పలువురు విశ్లేషిస్తున్నారు.
 
ఇక్కడే ఎందుకు..
2019 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ సాధించే విజయం అనేక రాజకీయ పరిణామాలకు దారితీయనుంది. తెలంగాణ సెంటిమెంట్‌తో 2014 ఎన్నికల్లో అధికారం దక్కేందుకు కావాల్సిన స్థానాల కన్నా 2,3 స్థానాలు ఎక్కువ సాధించిన టీఆర్‌ఎస్, ఈసారి ఎన్నికల్లో మాత్రం 100 సీట్లు సాధనే లక్ష్యంగా ముందుకెళ్లాలని ప్రణాళికలు రచిస్తోంది. జిల్లాల వారీగా చూస్తే ఉత్తర తెలంగాణలో పార్టీ పరిస్థితి బాగానే ఉంటుందని అనుకున్నా.. దక్షిణ తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు పటిష్ట పునాదులు లేవు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో చేరికలు, గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో విజయం మాత్రమే ఆ పార్టీ పటిష్టతకు ప్రామాణికాలుగా నిలుస్తున్నాయి. కానీ.. హైదరాబాద్‌లో ఉండే 20కు పైగా అసెంబ్లీ స్థానాల్లో ఎన్ని సీట్లు సాధిస్తారన్న దానిపై టీఆర్‌ఎస్‌లో పకడ్బందీ లెక్కలు లేని పరిస్థితి. ఇక.. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్ల గొండ జిల్లాల్లో కాంగ్రెస్‌ బలంగానే ఉంది. ముఖ్యంగా నల్ల గొండ జిల్లాలో కాంగ్రెస్‌ దిగ్గజాలైన జానారెడ్డి, కోమటిరెడ్డి, ఉత్తమ్‌ వంటి నేతలున్నారు. తమ నియోజకవర్గాలతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రభావం చూపగలిగిన ఈ నాయకులను ఎదుర్కోవడం ఆయా నియోజకవర్గాల్లోని స్థానిక నాయకత్వానికి కత్తిమీద సాముగానే మారింది.
 
ప్రజల్లో టీఆర్‌ఎస్‌ పాలనపై పెద్ద ఎత్తున వ్యతిరేకత లేనప్పటికీ.. ఉమ్మడి జిల్లాలో ప్రతిపక్షాల బలం తక్కువగా అంచనా వేసే స్థాయిలో ఏమీ లేదు. ఇటీవల సీఎం చేయించిన సర్వేలో కూడా కాంగ్రెస్‌కు అంత వ్యతిరేకత ఏమీ లేదని వెల్లడైంది. అదేవిధంగా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, స్థానిక ఇన్‌చార్జుల పనితీరు పట్ల కూడా ప్రజలు భారీ స్థాయిలో సంతృప్తి వ్యక్తపరచలేదు. ఒకటి, రెండు చోట్ల తప్ప టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల గ్రాఫ్‌ పడిపోయిందని సర్వే చెబుతోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలు టీఆర్‌ఎస్‌కు కీలకం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 100 సీట్ల సాధనలో మన జిల్లాతో పాటు మహబూబ్‌నగర్‌ జిల్లాలోని స్థానాలు కూడా చాలా కీలకంగా మారనున్నాయి. కాంగ్రెస్‌ దిగ్గజాలను ఢీకొట్టడంతోపాటు కీలకంగా మారే జిల్లాలో వీలునన్ని ఎక్కువ సీట్లు సాధించాలంటే తాను ఇక్కడి నుంచే బరిలోకి దిగి పార్టీ కేడర్‌లో ఆత్మస్థైర్యాన్ని నింపాలని, వలసల ద్వారా వచ్చిన కేడర్‌ను చివరి వరకూ కాపాడుకోవాలన్నది కేసీఆర్‌ వ్యూహంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులంటున్నారు.
 
ఎక్కడి నుంచి..
కేసీఆర్‌ జిల్లా నుంచి పోటీ చేస్తారనే వార్త టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపినా.. ఆయన ఎక్కడి నుంచి బరిలోకి దిగుతారన్న దానిపై చర్చలు జరుగుతున్నాయి. అసలు కేసీఆర్‌ చెప్పిన నల్లగొండ జిల్లా అంటే ప్రస్తుత జిల్లానా లేక ఉమ్మడి జిల్లానా అనే చర్చ కూడా జరుగుతోంది. దీంతోపాటు ఆయన అసెంబ్లీ బరిలోకి దిగుతారా.. పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేయడం ద్వారా ఆ ఎంపీ స్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలపై దృష్టి పెడతారా అన్నది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. ఎన్నికలకు చాలా సమయం ఉన్నందున సీఎం ఎక్కడి నుంచి పోటీచేస్తారన్న దానిపై ఎలాంటి సంకేతాలు లేవని.. తన రాజకీయ వ్యూహంలో భాగంగానే ఆయన నల్లగొండ జిల్లా నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారని టీఆర్‌ఎస్‌ వర్గాలంటున్నాయి. అయితే.. జిల్లా నుంచి  సీఎం పోటీచేస్తారని మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు తన స్థానం ఇచ్చేందుకు పరోక్షంగా సిద్ధపడ్డారు. కేసీఆర్‌ మిర్యాలగూడ నుంచి పోటీ చేస్తే పోలయ్యే ఓట్లలో 80శాతం వరకు ఆయనకే వేయిస్తామని ఆయన చెప్పడం విశేషం. ఇక, జిల్లాలోని అన్ని నియోజకవర్గాల స్థానిక నేతలతోపాటు ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి కూడా బహిరంగంగానే కేసీఆర్‌ జిల్లా నుంచి పోటీచేయాలనే ఆకాంక్షను వెలిబుచ్చారు. ఆయన రాకను స్వాగతిస్తామని, జిల్లాలో ఎక్కడి నుంచి పోటీచేసినా అఖండ మెజార్టీతో గెలిపిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ వర్గాలు మాత్రం జిల్లా నుంచి సీఎం పోటీచేస్తే ఓడిస్తామని ప్రకటనలు చేస్తున్నాయి. 
 
గత ఎన్నికల్లోనే..
తెలంగాణ ఆవిర్భావ ప్రకటన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లోనే నల్లగొండ జిల్లా నుంచి పోటీ చేయాలని కేసీఆర్‌ భావించారు. అప్పట్లో ఇక్కడ కాంగ్రెస్‌కున్న పట్టుపై దెబ్బ కొట్టాలన్న ఆలోచనతో కేసీఆర్‌ ఆ కోణంలో ఆలోచించినా.. అది కార్యరూపం దాల్చలేదు. టికెట్ల కేటాయింపు, సామాజిక వర్గాల కూర్పు నేపథ్యంలో ఆయన ఇక్కడకు రాలేదు.  ఈసారి మాత్రం నియోజకవర్గాల పునర్విభజన జరిగినా, జరగకున్నా కీలకంగా మారనున్న నల్ల గొండ జిల్లా నుంచి పోటీచేయడం ద్వారా  కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీల స్థైర్యాన్ని దెబ్బకొట్టాలనే వ్యహంతో ఆయన ఉన్నట్లు తెలంగాణ భవన్‌ వర్గాలు చెబుతున్నాయి.   

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement