సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3 వేలు దాటింది. గ్రేటర్ హైదరాబాద్‌లో వైరస్ ఉధృతి ఏ మాత్రమూ తగ్గట్లేదు. రోజూ వంద వరకు కేసులు నమోదవుతున్నాయి. బుధవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 129 కొత్త కేసులు నమోదైతే.. వాటిలో 108 కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలోనివే కావడం గమనార్హం. దీంతో ఇప్పటివరకు జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా బారినపడిన వారి సంఖ్య 2,105కు చేరింది. రంగారెడ్డిలో 6, ఆసిఫాబాద్ జిల్లాలో 6, మేడ్చల్, సిరిసిల్ల జిల్లాల్లో రెండు చొప్పున, మహబూబ్‌నగర్, కామారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైంది. వీరితో పాటు మరో ఇద్దరు వలస కార్మికులకు సోకింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 3,020కు చేరింది. ఇప్పటివరకు 1,556 మందిని డిశ్చార్జి చేయగా, 1,365 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా కారణంగా బుధవా రం ఒక్క రోజే ఏడుగురు కన్నుమూశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 99కు చేరింది. గత 3 రోజుల వ్యవధిలోనే 17 మంది మృత్యువాత పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment