సాక్షి, హైదరాబాద్: పట్టాదారు పాస్‌పుస్తకం... రైతు జీవితంతో ముడిపడి ఉన్న ఈ పదానికి కాలం చెల్లిందా? పాస్‌బుక్ పేరుతో పాటు రూపం కూడా మార్చుకుని పాస్ కార్డుగా మారుతోందా..? రెవెన్యూ వర్గాలు దీనికి అవుననే సమాధానం ఇస్తున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞా నంతో రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థలో కీలక మార్పునకు అధికారులు శ్రీకారం చుట్టారు. వ్యయసాయ భూములకు పాస్ పుస్తకాల స్థానంలో ఏటీఎం, పాన్ కార్డుల తరహాలోనే పాస్ కార్డులను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ మేరకు 18 సెక్యూరిటీ ఫీచర్లతో కూడిన రెండు నమూనాలకు రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు ఆమోదం తెలిపినట్టు సమాచారం. పాస్‌బుక్‌తోపాటు గతంలో ఉన్న టైటిల్ డీడ్ వ్యవస్థను కూడా మార్చివేసి డిజిటల్– ఈ పాస్‌కార్డులోనే రెండూ ఉండే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనలకు చట్టబద్ధత కల్పించేందుకుగాను రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్‌బుక్స్ చట్టం– 1971లో కొన్ని సవరణలను ప్రతిపాదించి, 27నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమయింది.
ఆర్డీవో సంతకంతోనే పాస్ కార్డు
ఇప్పటివరకు రైతులకు సంబంధించిన భూములకు పాస్‌పుస్తకంతో పాటు టైటిల్‌డీడ్ కూడా ఉండేది. తహసీల్దార్ సంతకంతో జారీ చేసే పాస్‌బుక్ ద్వారా రైతులకు రుణాలిచ్చేందుకు బ్యాంకర్లు అభ్యంతరం చెప్పడంతో ఆర్డీవో సంతకంతో కూడిన టైటిల్ డీడ్‌ను జారీ చేస్తున్నారు. ఈ టైటిల్‌డీడ్ సదరు భూమిపై రైతుకు అధికారాన్ని సంక్రమింపజేస్తుంది. అయితే, ఇప్పుడు ఎలాగూ డిజిటల్ ఈ–పాస్ కార్డు తయారు చేస్తున్న క్రమంలో టైటిల్‌డీడ్‌ను కూడా ఇందులోనే జతచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే రైతు డిజిటల్ ఫొటోతో పాటు ఆర్డీవో సంతకంతో కూడిన కార్డును తయారు చేస్తోంది.
అయితే, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్న ఈ తరుణంలో భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా, నకిలీల ప్రమాదం రాకుండా ఉండేందుకు గాను మొత్తం 18 సెక్యూరిటీ ఫీచర్లతో కార్డు ఉండేలా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.ఆర్.మీనా కసరత్తు చేస్తున్నారని ఆ శాఖ వర్గాలంటున్నాయి. ఇందుకోసం తెలంగాణ స్టేట్ టెక్నలాజికల్ సర్వీసెస్‌తో పాటు ఎన్‌ఐసీ లాంటి సంస్థలతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నారని, ముఖ్యంగా తెలంగాణ రాజముద్ర, హోలోగ్రామ్, కార్డు రంగు, డిజైన్, కార్డుపై ఉండే నినాదం, కార్డు తయారీకి వాడాల్సిన కాగితం లాంటి సాంకేతిక అంశాలపై నేడో, రేపో తుది నిర్ణయానికి వచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు. తుది నిర్ణయం తర్వాత ఈ అంశాలను బిల్లులో చేర్చి ఉభయసభల ఆమోదం పొందిన తర్వాత వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ కార్డుల జారీ ప్రారంభించనున్నారు.
రిజిస్ట్రేషన్ అయిన 15 రోజుల్లోనే
ఇక భూముల క్రయ, విక్రయ లావాదేవీలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత కేవలం 15 రోజుల్లో నే పాస్ కార్డు వచ్చేలా చట్టంలో మార్పు లు తేనున్నారు. ఈమేరకు రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్‌ఓఆర్) చట్టంలో మార్పులు తీసుకురానున్నారు. గతంలో భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్త యిన తర్వాత పాస్‌పుస్తకం జారీ చేయ డానికి 90 రోజులు గడువుండగా, ఇప్పుడు ఈ మ్యుటేషన్ ప్రక్రియ గడువును కేవలం 15 రోజులకు కుదిస్తున్నారు. ఈ మేరకు తయారుచేసిన ముసాయిదాకు న్యాయ శాఖ ఆమోదం కూడా లభించగా, ఈ అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టి మ్యుటేషన్ గడువులో మార్పునకు అధికారిక ముద్ర వేయించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment