ఉత్తర్వులు అందలేదంటున్న అధికారులు నిలిచిన రిజిస్ట్రేషన్లతో ఇబ్బందులు
సాక్షి, హైదరాబాద్: కలకలం రేపిన జీవో 398ను తక్షణమే రద్దు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించి వారం కావస్తున్నా ఇప్పటికీ ఉత్తర్వులు జారీ కాలేదు. భూ యజమానులకున్న విక్రయ హక్కును హరించేలా వెలువడిన ఈ జీవోపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ప్రజల్లో సైతం వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఈ నేపథ్యంలో సీఎం జీవో 398ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఉత్తర్వులు మాత్రం జారీ కాకపోవడంతో పక్షం రోజులుగా ఖాళీ స్థలాల (లేఅవుట్ అప్రూవల్ లేనివి) రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. దీనిపై ప్రశ్నిస్తున్న అమ్మకందారులు, కొనుగోలుదారులకు.. తమకు ఉత్తర్వులు రాలేదని సబ్ రిజిస్ట్రార్లు చెబుతున్నారు. రెవెన్యూ శాఖ నుంచి సబ్ డివిజన్ నివేదిక లేకపోతే వ్యవసాయ భూములు, లేఅవుట్ అప్రూవల్ లేకపోతే ఇళ్లస్థలాల విక్రయు రిజిస్ట్రేషన్లను తిరస్కరించాలంటూ ప్రభుత్వం గత నెల 28వ తేదీన జీవో 398 జారీ చేసిన సంగతి తెలిసిందే.
అయితే వ్యవసాయు భూవుుల రిజిస్ట్రేషన్లకు రెవెన్యూ సబ్ డివిజన్ నివేదిక నుంచి మినహారుుంపు ఇచ్చి పాత విధానమే కొనసాగిస్తావుని రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి ఈనెల ఒకటో తేదీన ప్రకటించారు. మరుసటి రోజే ఇందుకు సంబంధించి సబ్ రిజిస్ట్రార్లకు అంతర్గత ఉత్తర్వులు (మెమో నంబరు జి1/9732/2014) జారీ అయ్యాయి. దీంతో రెవెన్యూ సబ్ డివిజన్‌తో సంబంధం లేకుండా పాత విధానం ప్రకారమే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఇలావుండగా జీవో 398ని రద్దు చేస్తున్నామని, పాత విధానంలోనే రిజిస్ట్రేషన్లు చేస్తారని సీఎం చంద్రబాబు ఈనెల 8న మీడియా సమావేశంలో ప్రకటించినా రద్దు ఉత్తర్వులు జారీ చేయలేదు. దీంతో లేఅవుట్ అప్రూవల్ లేని స్థలాల కొనుగోలు కోసం అడ్వాన్సు ఇచ్చి అమ్మకం అగ్రిమెంట్లు చేసుకున్న వారు రిజిస్ట్రేషన్లు జరగక ఇబ్బంది పడుతున్నారు. తమ అడ్వాన్సు వెనక్కు ఇవ్వాలని కోరితే అమ్మకందారులు తిరస్కరిస్తున్నారు. దీంతో వివాదాలు పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో లక్షలాది స్థలాలకు లేఅవుట్ అప్రూవల్ లేదు. గ్రామాల్లో అయితే లేఅవుట్ అప్రూవల్ అనే పదమే తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో జీవో 398 పేరిట రిజిస్ట్రేషన్లు ఆపివేయడం వల్ల లక్షలాది మంది ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది.
సీఎం చెప్పినా రద్దుకాని 398 జీవో
Published Sat, Dec 13 2014 3:47 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement