జలగోస | drinking water Problem in Nalgonda | Sakshi
Sakshi News home page

జలగోస

Published Fri, Jul 18 2014 1:14 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

జలగోస - Sakshi

జలగోస

 జిల్లా లో తాగునీటి సమస్య తీవ్ర స్థాయికి చేరింది. వర్షాభావ పరిస్థితులతో రెండు నెలలుగా జిల్లాలో  కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అనేక గ్రామాల్లో చెరువులు ఎండిపోయి, బోరు బావుల్లో నీటిమట్టాలు అట్టడుగు స్థాయికి చేరాయి. తాగు నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న గ్రామాల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. దీంతో ఆయా గ్రామాల్లో వ్యవసాయ బోర్లను అద్దెకు తీసుకుని తాత్కాలిక పైపు లైన్లు ఏర్పాటు చేసి తాగునీటి సరఫరా చేస్తున్నారు. సాధారణంగా జిల్లాలో 120 మీటర్ల లోతు తవ్విన బోరు బావుల్లో నీరు పుష్కలంగా వస్తుంది. కానీ వర్షాలు లేకపోవడంతో ప్రస్తుతం 70-80 మీటర్ల లోతు ఉన్న బోరు బావుల్లో కూడా నీరు అట్టఅడుగు స్థాయికి చేరిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీంతో జిల్లాలో వ్యవసాయ పంటల సాగు విస్తీర్ణం కూడా గణనీయంగా తగ్గిపోయింది.
  నల్లగొండ అగ్రికల్చర్/ నీలగిరి
 
 145 గ్రామాల్లో నీటి ఎద్దడి
 జిల్లాలో తాగునీటి ఎద్దడి ఎదుర్కొంటున్న గ్రామాల సంఖ్య నెలవారీ పెరుగుతూ వస్తోంది. మేలో 135 గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ఉండగా..జూన్‌లో ఆ గ్రామాల సంఖ్య 145కు చేరింది. మొత్తం 26 మండలాల పరిధిలోని 145 గ్రామాల్లో వ్యవసాయ బోర్లను అద్దెకు తీసుకుని పైపులైన్ల ద్వారా తాగు నీటిని సరఫరా చేస్తున్నారు. వర్షాలు పడనట్లయితే మున్మందు తాగునీటి ఎద్దడికి గురయ్యే గ్రామాలు మరింత పెరిగే అవకాశం ఉంది.
 
 పడిపోయిన జలమట్టం..
 గడిచిన నాలుగు మాసాల్లో జిల్లాలో నీటిమట్టాలను పరిశీలించినట్లయితే... ఈ ఏడాది మార్చిలో 6.57 మీటర్ల లోతులోనే నీటి మట్టాలు ఉన్నాయి. అదే ఏప్రిల్‌కు వచ్చే సరికి 7.47కు పడిపోయింది. ైనె రుతి రుతుపవనాల ప్రభావం ఎక్కువగా ఉండే ఏప్రిల్, మేలో వర్షాలు పడకపోవడంతో నీటిమట్టాలు మరింత దిగజారాయి. దీంతో మేలో 7.41 మీటర్ల లోతులో ఉన్న నీటి మట్టాలు కాస్తా జూన్‌కు వచ్చే సరికి 9.52కు పడిపోయాయి. రెండు మాసాల వ్యవధిలో నీటి మట్టాలు 2.11 మీటర్ల లోతుకు తగ్గాయి. జిల్లా వ్యాప్తంగా 45మండలాల్లో జల మట్టాలు అట్టడుగు స్థాయికి చేరినట్లు భూగర్భ జలవనరుల శాఖ సర్వేలో తేలింది.
 
 ఆయకట్టు, నాన్ ఆయకట్టు అనే తేడా లేకుండా అన్ని మండలాల్లో భూగర్భ జలాలు తగ్గిపోయాయి. అత్యధికంగా వలిగొండ మండలంలో భూగర్భ జలాలు 4.98 మీటర్ల నుంచి 16.97 మీటర్ల లోతుకు పడిపోయాయి. సాగర్ కాలువల ద్వారా నీటి విడుదల నామమాత్రంగానే ఉండటం వల్ల ఆయకట్టు ప్రాంతాలైన చిలుకూరు, నడిగూడెం, మునగాల, పెద్దవూర, త్రిపురారం, మేళ్లచెర్వు మండలాల్లో సైతం నీటి మట్టాలు 2.97 మీటర్ల నుంచి 5.66 మీటర్ల లోతుకు తగ్గాయి. అనుమల మండలంలో అయితే 2.56 మీటర్ల నుంచి 8.3 మీటర్ల లోతుకు పడిపోయాయి. సిమెంట్ పరిశ్రమలు ఉన్న ప్రాంతాల్లో నీటి వాడకం ఎక్కువగా ఉన్నందున ఆ ప్రాంతాల్లో బోరు బావులు ఎండిపోతున్నాయి.
 
 సాగు 20శాతమే..
 జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌లో ఇప్పటి వరకు కేవలం 20 శాతం మాత్రమే వివిధ పంటలు సాగుకు నోచుకున్నాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగా జిల్లాలో సాగు విస్తీర్ణం బాగా తగ్గింది. విద్యుత్ కోతలు, ఆయకట్టులో సాగునీటిని విడుదల లేకపోవడంతో పాటు వర్షాభావ పరిస్థితులు రైతాంగాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. బోరుబావుల కింద వరిసాగు చేద్దామన్నా విద్యుత్ సరఫరా తీరుతో దైర్యం చాలడం లేదు. జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 4లక్షల 83 వేల 452 హెక్టార్లు కాగా గత ఖరీఫ్‌లో 6లక్షల 2 వేల 799 హెక్టార్లలో వరి, పత్తి, కంది, పెసర, ఆముదం తదితర పంటలు సాగు చేశారు. ఈ ఏడు జిల్లాలో సుమారు 6లక్షల 50 వేల హెక్టార్లలో వివిధ పంటలను సాగు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అంచనాలు వేసినప్పటికీ వరుణుడు కరుణించని కారణంగా ఇప్పటి వరకు కేవలం 94వేల 834 హెక్టార్లలో మాత్రమే వివిధ పంటలను రైతులు సాగు చేశారు. అందులో పత్తి 75వేల 379 హెక్టార్లు,  వరి 10961హెక్టార్లు, జొన్న 324, సజ్జ 112, మొక్కజొన్న 868, కంది 2983, పెసర 2925, మినుములు 372, వేరుశనగ 478, నువ్వులు 128, ఆముదం 8, మిర్చి 20 హెక్టార్లుగా ఉంది.
 
 తగ్గనున్న వరిసాగు
 ప్రస్తుత ఖరీఫ్‌లో వరిసాగు పూర్తిగా పడిపోయే అవకాశం ఉంది. నాగార్జునసాగర్, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టులకు సాగునీటిని విడుదల చేయకపోవడంతో పాటు వర్షాభావ పరిస్థితులు, విద్యుత్ కోతల  నేపథ్యంలో ఈ సారి వరిసాగు భారీగా తగ్గేలా కనిపిస్తోంది. గత ఖరీఫ్‌లో సుమారు 2లక్షల హెక్టార్లలో వరిసాగు కాగా ప్రస్తుతం 10961 హెక్టార్లలో మాత్రమే బోరుబావుల కింద సాగు చేశారు. మరో 5390 హెక్టార్లలో వరినార్లు పోసుకుని సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ వర్షాలు అనుకున్న స్థాయిలో కురిస్తే మరో 60వేల హెక్టార్లలో వరిసాగు కానుంది.
 
 ఆరుతడి పంటలే మేలు
 ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో రైతులు వరి, పత్తి పంటల వైపు వెళ్లకుండా ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు సాగు చేసుకుని నష్టాలనుంచి బయటపడాలని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల లో మెట్ట, ఆరుతడి పంటలైన వేరుశనగ, మొక్కజొన్న, కంది, ఆముదం, పెసరతోపాటు కూరగాయాల సాగు చేపట్టాలని సూచిస్తున్నారు. ఇప్పటికిప్పుడు వర్షాలు కురిసిన పత్తిని తగ్గించాలని చెబుతున్నారు. ఈ మేరకు ఆరుతడి పంటల విత్తనాలను సబ్సిడీపై అందించడానికి జిల్లా వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement