గల్లిలో సేవకులం.. ఢిల్లీలో సైనికులం | Federal Front Will Come Definitely Says Kavitha | Sakshi
Sakshi News home page

గల్లిలో సేవకులం.. ఢిల్లీలో సైనికులం

Published Thu, Mar 28 2019 1:41 AM | Last Updated on Thu, Mar 28 2019 4:46 AM

Federal Front Will Come Definitely Says Kavitha - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా ప్రజలు టీఆర్‌ఎస్‌నే ఆదరిస్తారని నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతోనే టీఆర్‌ఎస్‌కు ఆదరణ పెరుగుతోందన్నారు. దేశంలో ప్రాంతీయ పార్టీలు ఉండకూడదనే ఉద్దేశంతో కాంగ్రెస్, బీజేపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వమే ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో తాను ఎలాంటి పాత్ర నిర్వహించాలనేది పూర్తిగా పార్టీ నిర్ణయిస్తుందని చెప్పారు. నిజామాబాద్‌ ప్రజల ఆకాంక్ష అయిన పసుపు బోర్డు విషయంలో ఎన్నిసార్లు విన్నవించినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఎర్రజొన్న రైతులకు బోనస్‌ ఇచ్చే విషయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. నిజామాబాద్‌ ఎంపీగా తన పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా ఏర్పాటు చేసిన తెలంగాణ జాగృతిని పూర్తి స్థాయి ఎన్జీవోగా మార్చే ప్రయత్నం జరుగుతోందని కవిత వెల్లడించారు. నిజామాబాద్‌ లోక్‌సభ స్థానంలో రెండోసారి ఎంపీగా పోటీ చేస్తున్న కల్వకుంట కవిత ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేకంగా ఇంటర్వ్యూ విశేషాలు.. 
 
2,500 కోట్లతో అభివృద్ధి 
లోక్‌సభ నియోజకవర్గంలోని ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ప్రస్తావించి కేంద్ర ప్రభుత్వం ద్వారా పరిష్కరించడం పార్లమెంటు సభ్యులుగా మా బాధ్యత. అభివృద్ధి విషయంలో ఎంపీల పాత్ర నామమాత్రమే. అయినా, బాధ్యత గల ప్రజాప్రతినిధిగా, తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పనిచేసిన ఆడబిడ్డగా, నిజామాబాద్‌ జిల్లా కోడలిగా ఈ ఐదేళ్లలో 18వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశాను. ప్రతి అసెంబ్లీ పరిధిలో అభివృద్ధి పథకాల కోసం రూ.2,500 కోట్లు ఖర్చుపెట్టగలిగాను. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ నిధులే ఎక్కువున్నా కేంద్రం నుంచి నిధుల కోసం కష్టపడ్డా. వెంటపడ్డా. 
 
రైల్వే లైను పెద్ద విజయం 
20 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న నిజామాబాద్‌–పెద్దపల్లి రైల్వేలైన్‌కు నిధులు తెచ్చి పూర్తి చేయించా. ఇది నా అతిపెద్ద విజయం. దేశంలో ఎవరూ చేయని విధంగా ఎంపీగా పోటీచేసినప్పుడే మేనిఫెస్టో విడుదల చేశా. అందులో మొదటిది నిజామాబాద్‌–పెద్దపల్లి రైల్వే లైన్‌. అది పూర్తయిపోయింది. దేశంలో వేలాదిగా రైల్వే పనులు జరుగుతుంటాయి. ప్రతిఏటా బడ్జెట్‌లో 20–30 లైన్లకు ప్రాధాన్యత ఇస్తారు. అయితే, ఈ ప్రాధాన్యత ఎలా లభిస్తుందనేది ఎంపీ కాకముందు నుంచే తెలుసుకోవడం ప్రారంభించాను. రైల్వే బడ్జెట్‌ రూపకల్పనకు ఆరునెలల ముందే ప్రతిపాదనలు పంపి రైల్వే మంత్రి వెంటపడితే కానీ పనులు కావని అర్థమయింది. దీనికి నాన్న (కేసీఆర్‌) మహబూబ్‌నగర్‌ ఎంపీగా పోటీ చేసినప్పుడు హామీ ఇచ్చి నెరవేర్చిన మహబూబ్‌నగర్‌–హైదరాబాద్‌ రైల్వేలైన్‌ డబ్లింగ్‌ పనుల అనుభవం కూడా తోడయింది. నిజామాబాద్‌–పెద్దపల్లి రైల్వేలైన్‌ కోసం అప్పటి మంత్రి సదానందగౌడ గారిని 50 సార్లు కలిశాను.

ఆయన చివరకు నీకు దండం పెడతానమ్మా.. ఖచ్చితంగా చేస్తాను తల్లీ అని హామీ ఇచ్చారు. మొదటి మూడేళ్లలోనే రూ.390 కోట్లు సాధించాను. అండర్‌పాస్‌లు, బ్రిడ్జిలు, ఇతర చిన్న చిన్న పనుల కోసం మరో రూ.500 కోట్లు తెచ్చా. ఇప్పుడు ఆ లైన్‌ పూర్తికావడం చాలా సంతోషం. ఇంటింటికీ తాగునీరు. మిషన్‌భగీరథ ద్వారా దాన్ని కూడా సాధించాం. రైతులు పండించే సాగుభూమిని రెండింతలు చేస్తానని చెప్పా. సింగూరుతో నిజాంసాగర్‌ను లింక్‌ చేయించి నా లోక్‌సభ పరిధిలోని రెండు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిప్పించాను. నిజాంసాగర్‌ కాల్వలు, డిస్ట్రిబ్యూటరీల ఆధునీకరణ కోసం రూ.900 కోట్ల విలువైన పనులు జరగడంతో టెయిలెండ్‌ భూములకు కూడా నీళ్లు అందుతున్నాయి. ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకానికి రూ.1000 కోట్లు కేటాయించి 25 కిలోమీటర్ల కాల్వను ఫీడర్‌చానెళ్లతో అనుసంధానం చేయించాం. మిషన్‌కాకతీయ ద్వారా మరో 50వేల ఎకరాలకు సాగునీరందింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్యాకేజీ–21 ద్వారా రెండులక్షల ఎకరాలకు నీరందబోతోంది. మొత్తంమీద అదనంగా 6లక్షల ఎకరాలకు సాగునీటిని ఇప్పించి ఆయకట్టును స్థిరీకరించడంతో పాటు శాశ్వతంగా నీటిని అందించే ఏర్పాట్లు చేయించా. 
 
ఎర్రజోన్న రైతులకు బోనస్‌ 
టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే ఎర్రజొన్న రైతులకు రూ.11కోట్ల బకాయిలిచ్చాం. ఆ తర్వాతి సంవత్సరంలో రూ.150 కోట్లు పెట్టి చివరిగింజ వరకు రైతుల నుంచి ఎర్రజొన్నలను కొనుగోలు చేశాం. మద్దతు ధర లేకున్నా క్వింటాలుకు రూ.2,300 పెట్టి కొన్నాం. ఈసారి కూడా రైతుల నుంచి కొనుగోలు చేయాలని ఉన్నా కాంగ్రెస్, బీజేపీలకు చెందిన వ్యాపారవేత్తలు రాజకీయం చేస్తున్నారు. రైతులు, ప్రభుత్వానికి మధ్య అగాథం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ధర్నాలు, రాస్తారోకోలంటూ రైతులకు నష్టం చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, కేసీఆర్‌ ఎర్రజొన్న రైతులకు అండగా ఉంటారు. వారికి ఎన్నికల తర్వాత బోనస్‌ ప్రకటిస్తాం. 
 
బోర్డుపై కేంద్రం స్పందించలేదు 
పసుపుబోర్డు అంశం మన రాష్ట్రానికే సంబంధించింది కాదు. 13 రాష్ట్రాల్లో ఈ పంటను పండిస్తున్నారు. పొగాకు, మిర్చి తరహాలో పసుపుబోర్డును కూడా ఏర్పాటు చేస్తే రైతులకు మద్దతు ధర లభిస్తుంది. 20ఏళ్లుగా ఈ బోర్డు కోసం పోరాటం జరుగుతోంది. ఒకరిద్దరు రైతులయితే 15ఏళ్లుగా ఈ బోర్డు కోసం చెప్పుల్లేకుండా తిరుగుతూ నిరసన తెలియజేస్తున్నారు. దీని కోసం ప్రధానమంత్రిని, వాణిజ్య మంత్రిని అనేక సార్లు కలిసి మాట్లాడాను. వివరించాను. లోక్‌సభలో ప్రైవేటు మెంబర్‌ బిల్లు పెట్టాను. అనేకసార్లు మాట్లాడాను. రాజకీయ ఒత్తిడి కోసం బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో లేఖలు రాయించాను. కానీ, ప్రధాని, బీజేపీ మంత్రులు స్పందించలేదు. చివరకు ‘టర్మరిక్‌ సెల్‌’పెడతామని కూడా పెట్టలేదు. ఎంపీగా ప్రజలు మరోసారి అవకాశం ఇస్తే పసుపుబోర్డు కోసం మళ్లీ పోరాటం చేస్తా. 
 
కార్మిక సంఘంపై పార్టీదే నిర్ణయం 
నేను కార్మిక సంఘం బాధ్యతలు తీసుకోవాలా వద్దా అనేది పార్టీ నిర్ణయిస్తుంది. డిపెండెంట్‌ ఉద్యోగాల విషయంలో కార్మిక అనుకూల విధానాలు రూపొందించడం కోసం సీఎండీతో మాట్లాడాను. అయితే, కాంగ్రెస్‌ నేతలు, కొందరు కోదండరాం శిష్యులు కోర్టుల్లో కేసులు వేశారు. అక్కడ కొట్లాడితే రూల్సు మార్చాల్సి వచ్చింది. అందుకే వారసత్వ ఉద్యోగాల స్థానంలో కారుణ్య నియామకాలని పెట్టాల్సి వచ్చింది. సింగరేణి కార్మికులకు ఆసుపత్రులు, డాక్టర్లను అందుబాటులోకి తేవడంలోనూ, రూ.100 కోట్ల వృతి పన్ను రద్దు చేయించడంలోనూ, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కార్మికులకు 23% బోనస్‌ ఇప్పించడంలోనూ కార్మిక సంఘం పాత్ర కీలకం. 
 
ఎన్జీవోగా జాగృతి 
తెలంగాణ జాగృతి సంస్థను అంతర్జాతీయ స్థాయి ఎన్జీవోగా తీర్చిదిద్దాలనుకుంటున్నాం. ఐక్యరాజ్యసమితిలాంటి వ్యవస్థలతో వేదికలు పంచుకునే అవకాశం లభిస్తోంది. ఈ తరుణంలో మా కమిటీల్లో కూడా అంతర్జాతీయ స్థాయి నిపుణత ఉండాలి. ఆ కోణంలోనే పాత కమిటీలను రద్దు చేసి కొత్త కమిటీలు వేశాం. కొత్త కమిటీలకు ఐదు రోజుల పాటు శిక్షణ కూడా ఇచ్చాం. ఉద్యమ సంస్థ నుంచి సంపూర్ణ ఎన్జీవోగా మారుతున్నాం. మా కేడర్, మా సంస్థ కూడా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు సమకూర్చునేలా ముందుకెళుతున్నాం. 
 
మాట్లాడగానే పరిష్కారం కావు 
పార్లమెంటులో మాట్లాడిన సమస్యలన్నీ పరిష్కారం కావనేది మాత్రం బాగా అర్థమయింది. మాట్లాడడం ద్వారా కేవలం అటెన్షన్‌ను మాత్రమే తీసుకురాగలం. కానీ, ఆ సమస్య పరిష్కారం కావాలంటే చాలా కష్టాలు, పద్ధతులుంటాయి. పసుపుబోర్డు ఏర్పాటు విషయంలో ఇదే అర్థమయింది. అయితే, పార్టీలకు అతీతంగా దేశానికి సంబంధించిన విషయాల్లో అనుభవం వస్తుంది. సీనియర్‌ ఎంపీల ప్రోత్సాహం ఉంటుంది. మనం బాగా మాట్లాడితే అభినందిస్తూ వారు చిట్టీల మీద రాసి పంపుతారు. మనకు స్వయంగా చెప్తారు. అప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. 
 
కన్నీళ్లు వచ్చాయి 
ఎంపీ హోదాలో ఈ ఐదేళ్లలో చాలా మందిని కలిసే అదృష్టం లభించింది. ప్రత్యక్షంగా వారి సమస్యలను తెలుసుకున్నారు. అయితే, నా నియోజకవర్గంలోని ఆలూరు అనే గ్రామానికి వెళ్లినప్పుడు లభించిన స్వాగతం మర్చిపోలేనిది. కళ్లు మూసుకుంటే చాలు అదే కనిపిస్తుంది. మరో ఘటన ఏంటంటే.. నేను ఈ ఎన్నికల్లో ప్రచారానికి వెళ్లినప్పుడు ప్రజలు నాకు విరాళాలు ఇస్తున్నారు. అప్పుడు ఓ వికలాంగ బాలిక వచ్చి రూ.5వేల విరాళం ఇచ్చింది. ఏంటమ్మా అని అడిగితే నేనే ఆమెకు ఉద్యోగం ఇప్పించానని చెప్పింది. హాయిగా బతుకుతున్నానని సంతోషపడింది. ఆ బాలిక వాత్సల్యం కన్నీళ్లు తెప్పించింది. ఎక్కడకు వెళ్లినా ప్రజలు పలికే స్వాగతాలు, ఆత్మీయ ఆలింగనాలు ఎంతో సంతోషాన్ని, బలాన్ని ఇస్తాయి. ముఖ్యంగా ముసలివాళ్లు పలకరించే తీరు నాకు చాలా బాగా అనిపిస్తుంది. 
 
జాతీయ పార్టీల కుట్ర 
అది వాళ్లకు అలవాటయిపోయింది. ప్రాంతీయ పార్టీలపై మాటల దాడులు చేయడం దేశవ్యాప్తంగా ఓ ట్రెండ్‌ అయిపోయింది. ఇది ఆ రెండు జాతీయ పార్టీల కుట్ర. దేశంలో రెండు పార్టీల విధానమే ఉండాలని ఆ రెండు పార్టీలు మ్యాచ్‌ఫిక్సింగ్‌ చేసుకుని ఇతర పార్టీలపై నిందలు మోపుతాయి. టీఆర్‌ఎస్‌ ఎవరికీ బీ–టీమ్‌ కాదు. మాది తెలంగాణ ప్రజల ‘ట్రూ టీమ్‌’. టీఆర్‌ఎస్‌ ఎంపీలు గల్లీలో సేవకులు.. ఢిల్లీలో సైనికులు. దేశంలో రెండు పార్టీల విధానం ఉండడం వల్ల సమాఖ్య స్ఫూర్తిని మర్చిపోవాల్సి వస్తోంది. సీల్డ్‌కవర్‌లలో సీఎంలు నిర్ణయం కావడం వల్ల రాజ్యాంగం, ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతున్నాయి. మూడుసార్లు సీఎంగా పనిచేసి ప్రధాని అయిన మోదీకే సీఎంలను గౌరవించడం సాధ్యం కాలేదు. రాష్ట్రాల ఆకాంక్షలను, వాణిని పార్లమెంటు గౌరవించగలిగే మార్పు కోసమే ఫెడరల్‌ ఫ్రంట్‌. రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడే పార్టీలకు అధికారం ఇవ్వాలనే ఆలోచనతోనే ఫెడరల్‌ఫ్రంట్‌ ప్రతిపాదించారు సీఎం కేసీఆర్‌. 
 
వచ్చేది ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వమే 
కచ్చితంగా రానున్నది ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వమే. టీఆర్‌ఎస్‌ లేకుండా ఆ ప్రభుత్వం ఉండదు. ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం ఏర్పాటు చేయడమే మాలక్ష్యం. నిజామాబాద్‌ ప్రజల దయతో ఎంపీగా మాత్రం ఉంటాను. వారి సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో నిజాయితీతో కృషి చేస్తాను. ఇంకా పెద్ద స్థానంలో ఉండాలా వద్దా అనేది పార్టీ నిర్ణయం. 
 
కేటీఆర్‌ చాలా సున్నిత మనస్కులు 
టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ చాలా అనుభవజ్ఞులు, సున్నిత మనస్కులు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చాలా సున్నిత మనస్కులు. నిజాయితీగల రాజకీయ నాయకుడు. ఆ ఇద్దరి గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది. 
 
ఏ ఎన్నికలైనా టీఆర్‌ఎస్‌దే గెలుపు 
ఎంపీ ఎన్నికలయినా, ఎంపీటీసీ ఎన్నికలయినా తెలంగాణ ప్రజలు గులాబీ జెండాను కాపాడతారని, అండగా నిలుస్తారని రుజువయింది. ఈ ఎన్నికల్లోనూ అదే జరగబోతోంది. రాష్ట్రంలో యేటా రూ.40 వేల కోట్లు వెచ్చించి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. ప్రతి ఇంటికి పింఛన్‌ ఇస్తున్నాం. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి జరుగుతోంది. బీడీ కార్మికులకు, ఆడబిడ్డలకు, ఒంటరి మహిళలకు ఇలా అందరికీ పింఛన్లు ఇస్తున్నాం. వారి జీవితాలకు భరోసా కల్పించిన ఘనత కేసీఆర్‌దే. అందుకే అందరూ తమ కుటుంబ సభ్యునిగా, పెద్ద కొడుకుగా చూసుకుంటారు. మా దళపతి సంక్షేమ రాజ్యంలో గులాబీ గుబాళింపునకు తిరుగులేదు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement