ఎస్సారెస్పీకి వరద ఉధృతి
సాయంత్రం వరకు 1.90 లక్షల క్యూసెక్కుల మేర ఇన్‌ఫ్లో
► 17.84 టీఎంసీలకు చేరిన నీటిమట్టం
► నిజాంసాగర్, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టులకు ప్రవాహాలు
సాక్షి, హైదరాబాద్/బాల్కొండ: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి భారీ ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. స్థానిక వర్షాలకు తోడు ఎగువ ప్రాజెక్టుల వరద నీరు కూడా తోడవ్వడంతో ఇన్‌ఫ్లో పెరుగుతోంది. సోమవారం ఉదయం 1.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరగా సాయంత్రానికి అది మరో 40 వేల క్యూసెక్కులకు పెరిగి 1.90 లక్షల క్యూసెక్కులకు చేరింది. అయితే సాయంత్రం తర్వాత వరద తగ్గుముఖం పట్టి, 95 వేల క్యూసెక్కులకు చేరిందని నీటి పారుదల వర్గాలు తెలిపాయి.
ఇక భారీ ప్రవాహాలు వచ్చి చేరడంతో ప్రాజెక్టు నీటి మట్టం శరవేగంగా పెరుగుతోంది. ప్రాజెక్టు నీటిమట్టం ఆదివారం 9.66 టీఎంసీలు ఉండగా, సోమవారం సాయంత్రానికి 17.84 టీఎంసీలకు చేరింది. ఇక నిజాంసాగర్, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టులకు స్థిరంగా ప్రవాహాలు కొనసాగుతున్నాయి. నిజాంసాగర్‌కు 3 వేల క్యూసెక్కులు, కడెంకు 2,400 క్యూసెక్కులు, ఎల్లంపల్లికి 6,110 క్యూసెక్కుల మేర ప్రవాహాలు వస్తుండటంతో ప్రాజెక్టుల మట్టాలు క్రమంగా పెరుగుతున్నాయి. కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల్లో జూరాలకు వస్తున్న 2,500 క్యూసెక్కుల ప్రవాహం మినహాయించి, మరెక్కడా ప్రవాహాలు లేవు.
వేగంగా పెరుగుతున్న నీటి మట్టం..
శ్రీ రాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్ట్ నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా, సోమవారం సాయంత్రానికి 1,065 అడుగు లకు చేరింది. అయితే రాత్రికల్లా ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు క్రమంగా తగ్గుముఖం పట్టింది. రాత్రి 8 గంటల వరకు 1.5 లక్షల క్యూసెక్కులు వచ్చిన ఇన్‌ఫ్లో.. 9 గంటలకు 95 వేల క్యూసెక్కులకు పడిపోయింది. మొత్తంగా ఒక్క రోజు వ్యవధిలో 8.80 అడుగుల మట్టం పెరగ్గా.. 10 టీఎంసీల మేర వరద నీరు వచ్చి చేరింది.
కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదల..
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి జగిత్యాల, కరీంనగర్ జిల్లాల ప్రజల తాగు నీటి అవసరాల కోసం కాకతీయ కాలువ ద్వారా 500 క్యూసెక్కుల నీటిని సోమవారం ప్రాజెక్ట్ అధికారులు విడుదల చేశారు.