మునిసిపల్ పోరులో తమ అభ్యర్థుల గెలుపే ప్రధాన లక్ష్యంగా పొత్తులపై అన్ని రాజకీయపార్టీల నేతలు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. సాధారణ ఎన్నికలను కాసేపు పక్కనపెట్టి..తాత్కాలిక ప్రయోజనాల కోసం ఎవరికి వారే ఎత్తులు వేస్తున్నారు. నామినేషన్ల పరిశీలన ఘట్టం ముగియడంతో పోటీని నిలువరించేందుకు ఉపసంహరణలపై ప్రధానపక్షాలు దృష్టి సారించాయి. బుజ్జగింపుల పర్వానికి తెరతీస్తూనే..గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.
సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లాలోని నాలుగు మునిసిపాలిటీలు మహబూబ్‌నగర్, గద్వాల, నారాయణపేట, వనపర్తి, నాలుగు నగర పంచాయతీలు షాద్‌నగర్, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, అయిజ పరిధిలోని 206 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. జిల్లాలో చాంపియన్‌గా నిలవడం ద్వారా సాధారణ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఏకైక లక్ష్యంతో టీఆర్‌ఎస్ ఒంటరిపోరుకే సిద్ధమైంది. పార్టీ అభ్యర్థులు రంగంలో లేనిచోట కలిసొచ్చే సీపీఐ, ఎంఐఎం, ఇండిపెండెంట్ అభ్యర్థులకు మద్దతు తెలుపాలనే యోచనలో గులాబీ దండు ఉన్నట్లు తెలుస్తోంది. నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, గద్వాల, మహబూబ్‌నగర్, నారాయణపేట పట్టణాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది.
తొలిసారిగా వైఎస్‌ఆర్ సీపీ
సాధారణ ఎన్నికలకు ముందుగా జరుగుతున్న మునిసిపల్ ఎన్నికల్లో తొలిసారిగా వైఎస్‌ఆర్ సీపీ తమ అభ్యర్థులను రంగంలోకి దింపింది. మహబూబ్‌నగర్, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, గద్వాల, అయిజతో పాటు ఇతర ప్రాంతాల్లో తమ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. తొలిసారిగా ఎదుర్కొంటున్న ఈ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా తగినవ్యుహంతో ముందుకుసాగుతున్నారు. కాంగ్రెస్, టీడీపీలకు వ్యతిరేకంగా కలిసొచ్చే పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులతో మద్దతు ఇచ్చిపుచ్చుకోవడంపై వైఎస్‌ఆర్ సీపీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
టీడీపీ, బీజేపీ తహతహ!
టీడీపీకి వలసల భయం తీవ్రంగా పట్టుకుంది. మెజార్టీ మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో పోటీలో నిలిపేందుకు అభ్యర్థులు లేకపోవడంతో కాంగ్రెస్‌ను మినహాయించి కలిసొచ్చే పార్టీ అభ్యర్థులకు మద్దతివ్వడం ద్వారా బలాన్ని కూడగట్టుకోవాలని టీడీపీ భావిస్తోంది. గద్వాల మునిసిపాలిటీలో 33 వార్డులుండగా బరిలో టీడీపీ అభ్యర్థులు 34 మంది మాత్రమే ఉన్నారు. అయిజ నగర పంచాయతీలో 20 వార్డులకు ఆ పార్టీ అభ్యర్థులు 16 మంది మాత్రమే పోటీలో నిలిచారు.
కల్వకుర్తిలో 20 వార్డులకు ఐదుగురే ఉన్నారు. ‘పేట’లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ పూర్తిబలం లేకపోవడంతో కలిసొచ్చే సీపీఎం, సీపీఐ, బీజేపీ, ఎంఐఎంలతో సీట్ల సర్దుబాటు చేసుకోవాలని టీడీపీ తహతహలాడుతున్నట్లు స్పష్టమవుతోంది. బీజేపీ మాత్రం కాంగ్రెస్ వ్యతిరేకంగా టీడీపీతో సీట్ల సర్దుబాటు చేసుకోవాలని భావిస్తోంది. నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, మహబూబ్‌నగర్, నారాయణపేట మునిసిపాలిటీల్లో బీజేపీ పాగా వేయాలని తీవ్ర కసరత్తు చేస్తోంది.
బరిలో వామపక్షాలు
జిల్లాలో సీపీఎం 20 వార్డుల్లో తమ అభ్యర్థులను పోటీలో నిలిపింది. జిల్లాకేంద్రంలోని ఐదు వార్డులు, నారాయణపేటలో ఒకటి, వనపర్తిలో ఏడు, గద్వాలలో ఒకటి, నాగర్‌కర్నూల్ ఆరు వార్డుల్లో ఆ పార్టీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా కలిసొచ్చే పార్టీలతో సీట్ల సర్దుబాటుకు పార్టీ నాయకత్వం చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ప్రధానంగా సీపీఐ, టీడీపీ, వైఎస్‌ఆర్ సీపీలతో పొత్తు పెట్టుకోవాలని సీపీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. సీపీఐ మాత్రం టీడీపీ, బీజేపీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో సహా కలిసి వచ్చే అన్ని పార్టీలతో సీట్ల సర్దుబాటు చేసుకోవడం ద్వారా మునిసిపల్ ఎన్నికల్లో లబ్ధిపొందాలని భావిస్తోంది. జిల్లాలోని 20 వార్డుల్లో తమ అభ్యర్థులను సీపీఐ పోటీలో నిలిపింది.
పొత్తులు.. ఎత్తులు
Published Mon, Mar 17 2014 4:12 AM | Last Updated on Tue, Oct 16 2018 6:44 PM
Advertisement