హైదరాబాద్ : హైదరాబాద్‌లో ఉచిత వైఫై సేవలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఈ సేవలను దశలవారీగా ప్రారంభించే విషయమై పంచాయితీరాజ్, ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ గురువారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో బీఎస్‌ఎన్‌ఎల్‌తోపాటు క్వాడ్‌జెన్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. హుస్సేన్‌సాగర్ పరిసరాల్లోని లుంబినీ పార్క్, ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్డులో 2500ల మంది పౌరులు ఈ సేవలను ఒకేసారి లాగిన్ అయి పొందవచ్చని తెలుస్తోంది. త్వరలోనే హుస్సేన్‌సాగర్ చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇక్కడ ఉచితంగా 2 ఎంబీపీఎస్ నుంచి 20 ఎంబీపీఎస్ వరకు వేగంగా దాదాపు అరగంట పాటు వైఫై సేవలు పొందే వీలుంటుంది. దీనికోసం ఇప్పటికే అన్ని అనుమతులు వచ్చాయి. ఈ మేరకు హైదరాబాద్‌లోని ఏదో ఒక జోన్‌లో వైఫై సేవలను పూర్తిస్థాయిలో అందించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులను కోరారు.