ఎల్బీ నగర్ కామినేని ఆస్పత్రి వద్ద ప్రీకాస్టింగ్ విధానంలో జరుగుతున్న పిల్లర్ల నిర్మాణ పనులు
సాక్షి, హైదరాబాద్
విశ్వనగర ప్రణాళికలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) రెడీమేడ్ ఫ్లైఓవర్‌ను సిద్ధం చేస్తోంది. ఈ ఫ్లైఓవర్‌ను పూర్తిగా ప్రీకాస్టింగ్ విధానంలోనే నిర్మిస్తోంది. అలైన్‌మెంట్ మేరకు ఫౌండేషన్ పనులు పూర్తి చేసి ఫ్లైఓవర్ మొత్తాన్ని ప్రీకాస్టింగ్ ద్వారా పూర్తిచేస్తారు. అంటే ఆన్‌సైట్‌లో ఫౌండేషన్, ఆఫ్‌సైట్‌లో ప్రీకాస్టింగ్ పనులు కానిస్తారు. గల్ఫ్, చైనా, జర్మనీ, అమెరికా తదితర దేశాల్లో ఎంతోకాలంగా ఈ విధానాన్ని అనుసరిస్తున్నా.. మన దేశంలో మాత్రం ఇదే తొలిసారి.
అడ్వాన్స్‌డ్ ఇంజనీరింగ్ టెక్నాలజీతో..
స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్(ఎస్సార్‌డీపీ)లో భాగంగా వివిధ ఫ్లైఓవర్లు, జంక్షన్ల అభివృద్ధి పనులను జీహెచ్‌ఎంసీ చేపట్టింది. ఇందులోభాగంగా ఎల్‌బీనగర్ కామినేని ఆస్పత్రి జంక్షన్ వద్ద ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించేందుకు అడ్వాన్స్‌డ్ ఇంజనీరింగ్ టెక్నాలజీతో పూర్తిగా ప్రీకాస్టింగ్ విధానంలో ఈ ఫ్లైఓవర్‌ను నిర్మిస్తోంది. మెట్రో రైలుతోపాటు వివిధ ప్రాజెక్టుల్లో ప్రీకాస్టింగ్ విధానం ఇప్పటికే అమలులో ఉంది. అయితే హారిజాంటల్‌గా(భూమికి సమాంతరంగా) పిల్లర్లపైన ఉండే నిర్మాణాలైన పియర్ క్యాపింగ్ సెగ్మెంట్లు, గర్డర్ల వంటి వాటికి మాత్రమే దీ నిని వినియోగించుకున్నారు. వర్టికల్‌గా(నిలువుగా) ఉండే పియర్ స్టెమ్‌ల(పిల్లర్లు)కు కూడా ప్రీకాస్టింగ్ విధానాన్ని అనుసరిస్తుండటం దేశంలో ఇదే తొలిసారి. ఇందులో ఒక్కో సెగ్మెంట్ 1.5 వీ ుటర్ల ఎత్తుతో ఉంటుంది.
పిల్లర్ ఎత్తుకు అనుగుణంగా ఎన్ని సెగ్మెంట్లు అవసరమైతే అన్ని సెగ్మెంట్లను ఒక దానిలో మరొకటి అమరుస్తారు. పిల్లర్లతోపాటు గర్డర్లు, శ్లాబ్ తదితర పనులకు సైతం ప్రీకాస్టింగ్ విధానాన్నే వినియోగించనున్నారు. ఇందుకుగానూ నగర శివార్లలోని బాటసింగారం దగ్గర పిల్లాయపల్లిలో 30 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ప్రీకాస్టింగ్ యార్డులో వీటిని తయారు చేస్తున్నారు. పిల్లర్లు, గర్డర్లు, పియర్‌క్యాప్స్ తదితరమైనవన్నీ అక్కడే(ఆఫ్ సైట్‌లో) రూపొందించి వాహనాల ద్వారా పని జరుగుతున్న ప్రాంతానికి(ఆన్‌సైట్) తరలించి రెడీమేడ్‌గా అమరు స్తున్నట్లు సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కృష్ణారావు తెలిపారు. తద్వారా పనిజరిగే ప్రదేశంలో నిర్మాణ సామగ్రి ఉంచే అవసరం లేదని, ట్రాఫిక్ ఆటంకాలు కూడా తగ్గుతాయన్నారు.
రెడీమేడ్ ఫ్లైఓవర్ స్వరూపం ఇదీ..
- అంచనా వ్యయం: రూ.45.08 కోట్లు
- ఇప్పటి వరకు చేసిన పనులు: రూ.14.45 కోట్లు
- ఫ్లైఓవర్ పొడవు: 940 మీటర్లు
- ఫ్లైఓవర్ వెడల్పు: 12 మీటర్లు
- స్టాండర్డ్ స్పాన్స్: 11 స్పాన్స్ (30 మీటర్లు)
- ఆబ్లిగేటరీ స్పాన్: 1 స్పాన్ (50 మీటర్లు)
- అప్రోచ్ పోర్షన్: 365 మీటర్లు(ఉప్పల్ వైపు)
- అప్రోచ్ పోర్షన్: 195 మీటర్లు(ఎల్‌బీనగర్ వైపు)
- ట్రాఫిక్ పరిష్కారం: 89 శాతం
- 2015లో రద్దీ సమయంలో వాహనాలు: 10,324
- 2034 నాటికి రద్దీ సమయంలో వాహనాలు: 16,209
టెక్నాలజీని అందుబాటులోకి తేవాలని..
సంప్రదాయ ఫ్లైఓవర్ కంటే దీని ఖర్చు 25 శాతం అధికం. ఈ ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని కాంట్రాక్టు సంస్థ ఆసక్తి కనబరచడంతో అంగీకరించాం. అదనపు వ్యయాన్ని కాంట్రాక్టు సంస్థే భరిస్తోంది. ప్రీ ఫ్యాబ్ సెగ్మెంట్ విత్ ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్ పోస్ట్ టెన్షనింగ్ టెక్నాలజీతో పిల్లర్ల నిర్మాణం జరిగింది. త్వరితగతిన పనులు పూర్తవడమే కాక పర్యావరణపరంగానూ ఈ విధానం వే ులైనది. ఫ్లైఓవర్ పూర్తయ్యేంత వరకు ప్రమాదాలకు తావు లేకుండా తగిన భద్రతా ఏర్పాట్లు చేశాం.
– శ్రీధర్ రుమాండ్ల(చీఫ్ ఇంజనీర్, జీహెచ్‌ఎంసీ)
త్వరితంగా పనులు..
సంప్రదాయ పద్ధతుల్లో నిర్మించే ఫ్లైఓవర్లకు ఏడాదిన్నర నుంచి రెండేళ్ల వ్యవధి పడుతుండగా, ప్రీకాస్ట్ ఫ్లైఓవర్ 9 నెలల నుంచి ఏడాది కాలంలో పూర్తవుతుందని బి.శీనయ్య ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధి, ప్రాజెక్ట్ మేనేజర్ పి.మల్లిఖార్జునయ్య తెలిపారు. రెండు మార్గాల్లో మూడేసి లేన్లతో నిర్మించనున్న ఈ ఫ్లైఓవర్ ఒక మార్గం పనులు ఏప్రిల్‌లో ప్రారంభం కాగా, వచ్చే వ ూర్చికి పూర్తి కాగలవని భావిస్తున్నారు. ఫ్లైఓవర్‌లోని మొత్తం 13 పియర్ స్టెమ్(పిల్లర్లు)లను విజయవంతంగా అమర్చారు. గర్డర్లు, శ్లాబ్ పనులు పూర్తి కావాల్సి ఉంది.
ఇక రయ్.. రయ్..
కామినేని జంక్షన్ వద్ద ఈ ఫ్లైఓవర్‌తో పాటు ఎల్‌బీనగర్ జంక్షన్ వద్ద నిర్మిస్తున్న అండర్‌పాస్, ఫ్లైఓవర్, చింతల్‌కుంట వద్ద అండర్‌పాస్‌తోపాటు బైరామల్‌గూడ వద్ద ప్రారంభం కావాల్సిన ప్లైఓవర్ పనులు పూర్తయితే ఈ జంక్షన్ల మీదుగా వివిధ ప్రాంతాలకు వెళ్లే వారికి ట్రాఫిక్ చిక్కులు తగ్గి, సమయం కలసి వస్తుంది. ఉప్పల్ వైపు నుంచి శంషాబాద్ వైపు వెళ్లే వారు త్వరిత సవ ుయంలోనే గమ్యం చేరుకోగలుగుతారు.
రూ.448 కోట్లతో ప్యాకేజీ–2
గ్రేటర్‌లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ఎస్సార్‌డీపీ ప్యాకేజీ–2లో భాగంగా ఎల్‌బీనగర్ చుట్టుపక్కల 4 జంక్షన్ల(ఎల్‌బీనగర్, కామినేని, చింతల్‌కుంట, బైరామల్‌గూడ) వద్ద నిర్మించే నాలుగు ఫ్లైఓవర్ల మొత్తం వ్యయం రూ.448 కోట్లు. కామినేని జంక్షన్ వద్ద ప్రీకాస్టింగ్ పనులు త్వరితంగా జరుగుతుండటంతో మిగతా జంక్షన్ల వద్ద కూడా ఇదే విధానాన్ని అనుసరించాలని అధికారులు యోచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment