చస్తే చావని!
- ఆపరేషన్ చేసి పట్టించుకోలేదన్నందుకు వైద్యురాలి ఆగ్రహం
- గుండెనొప్పితో తీవ్ర అస్వస్థకు గురైన మహిళ
- జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఇదీ పరిస్థితి
సంగారెడ్డి టౌన్: ప్రభుత్వాసుపత్రుల్లో నిర్లక్ష్యానికి పరాకాష్ట ఇది. చావుబతుకుల మధ్య పోరాడుతున్న అభాగ్యుల ప్రాణానికి అక్కడి సిబ్బంది ఇచ్చే విలువ ఇది. కర్తవ్యం మరిచి... కరుడుగట్టిన వారి హృదయాలకు ప్రత్యక్ష సాక్ష్యం ఇది. ఆసుపత్రికి వచ్చిన మహిళకు ఆపరేషన్ చేసి... ఆ తర్వాత రోగి పస్థితిని పట్టించుకోకుండా గాలికి వదిలేశారు.
దాంతో సదరు మహిళ తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటన సోమవారం స్థానిక జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలివి... కౌడిపల్లి మండలంలోని సలావత్‌పుర తండాకు చెందిన కె.లతిత కుటుంబ నియంత్రణ ఆపరేషన్ గురించి ఉదయం 6 గంటలకు ఆసుపత్రికి వచ్చారు. 10 గంటలకు ఆమెకు ఆపరేషన్ చేసి వార్డుకు తరలించారు. ఇక ఆ తర్వాత దైద్యులు గానీ, నర్సులు, ఇతర సిబ్బంది గానీ పట్టించుకోలేదు.
సాయంత్రం మూడు గంటలవుతోంది. లలిత తీవ్ర అస్వస్తకు గురైంది. ఆమె భర్త కమ్యా ఎన్నిసార్లు వెళ్లి డాక్టర్లు, సిబ్బందికి చెప్పినా పట్టించుకోలేదు. లలిత పరిస్థితి విషమిస్తోంది. చివరకు బంధువులు ఆందోళనకు దిగితే... ఆపరేషన్ చేసిన వైద్యురాలు వచ్చి పరీక్షించారు. లలిత గుండె సమస్యతో బాధపడుతుందని, హైదరాబాద్‌కు తీసుకుపొమ్మని చెప్పారు. ‘మీరు పట్టించుకోకపోవడంవల్లే లలిత పరిస్థితి తీవ్రమైంది’ అంటూ బంధువులు వైద్యురాలితో అన్నారు.
దీంతో ఆగ్రహించిన వైద్యురాలు... ‘లలిత భర్త సంతకం చేశాడు. చస్తే చావని.. నేనేం చేయాలి. ఇక్కడి నుంచి తీసుకుపోండి’ అంటూ ఎంతో బాధ్యతారాహిత్యంగా బదులిచ్చారని బంధువులు ఆరోపించారు. జిల్లా కేంద్ర ఆసుపత్రిలోని డాక్టర్లు, నర్సులు, సిబ్బంది బాధ్యరాహిత్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు చేసేది లేక... 108 అంబులెన్సులో హైదరాబాదుకు తీసుకువెళ్లారు. దీనిపై విరణ కోరేందుకు ప్రయత్నించగా... ఆసుపత్రిలో డాక్టర్లు ఎవరూ అందుబాటులో లేకపోవడం గమనార్హం.