ప్రచారంలో హరీష్, ఈటెల
సాక్షి, కరీంనగర్ : ప్రజాకూటమి నేతల్లో ఒకరిపై మరొకరికి నమ్మకం లేదని ఆపధర్మ మంత్రి హరీష్ వ్యాఖ్యానించారు. కోడందరాంపై కాంగ్రెస్‌కి, చాడ వెంకట్ రెడ్డిపై ఉత్తమ్ కుమార్‌కి నమ్మకం లేదని ఆయన అన్నారు. కంటి వెలుగులు అందించే నాయకుడు కేసీఆర్ అని.. కన్నుకొట్టే నాయకుడు రాహుల్ గాంధీ అని వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజవర్గంలోని శంకరపట్నంలో మంత్రి ఈటెల రాజేందర్, ఆ నియోజకవర్గ అభ్యర్థి రసమయి బాలకిషన్‌తో కలిసి హరీష్ రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ.. మరోసారి టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడితే హుజురాబాద్, సిద్దిపేటలా మానకొండూర్‌ను కూడా అభివృద్ది చేస్తామని ప్రకటించారు.
రోడ్ షోలో ఆయన ప్రసంగిస్తూ.. ‘‘ప్రజాకూటమిలో పొత్తుపెట్టుకుని కూడా ఎవరికి వారే అభ్యర్థులను ప్రకటించారు. తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అలాంటి వ్యక్తితో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్‌ని నమ్మెదు. ఉద్యమకారుడైన కోదండరాంను కాంగ్రెస్ మోసం చేసింది. తెలంగాణ ఉద్యమ సమయంలో తప్పించుకుని తిరిగిన నాయకులు కాంగ్రెస్ వాళ్లు. మిడ్ మానేర్ పూర్తయితే 50వేల ఎకరాలకు నీళ్లు వస్తాయి. ఈ నియోజకవర్గ అభివృద్దిలో నేనూ, ఈటెల పాలుపంచుకుంటాము. ఏడాదిలోపల కాళేశ్వరం పూర్తి అవుతుంది. మిడ్‌మానేర్, కాళేశ్వరం కలిపితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా సస్యశ్యామలవుతుంది. తెలంగాణ రాష్ట్రాన్ని కంటికి రెప్పలా చూసుకుంటున్న ఏకైక నాయకుడు కేసీఆర్’’ అని హరీష్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment