పేట: సభలో మాట్లాడుతున్న పరిపూర్ణానందస్వామి, చిత్రంలో రతంగ్‌పాండురెడ్డి, నాగురావు
సాక్షి, నారాయణపేట: బీజేపీ స్టార్ క్యాంపెయినర్ పరిపూర్ణానందస్వామి ఉమ్మడి జిల్లాలో శుక్రవారం సుడిగాలి పర్యటన చేశారు. నారాయణపేట నియోజకవర్గంలోని దామరగిద్ద, అచ్చంపేట, గద్వాల బీజేపీ అభ్యర్థులు రతంగ్‌పాండురెడ్డి, మల్లీశ్వర్, వెంకటాద్రిరెడ్డికి మద్దతుగా నిర్వహించిన సభల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా కేసీఆర్, టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ ఓటుదెబ్బతో తెలంగాణలో కేసీఆర్ దుకాణం బంద్ కాబోతుందని బీజేపీ రాష్ట్ర నేత, శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానందస్వామి అన్నారు. బంగారు తెలంగాణ అంటూ జనం నోట మట్టికొడుతున్న కేసీఆర్‌ను తరిమికొట్టేందుకు సమయం ఆసన్నమైందన్నారు.
శుక్రవారం దామరగిద్దలో మార్పు కోసం బీజేపీ.. బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై పేట బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రతంగ్‌పాండురెడ్డి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే రజాకార్ల హయాంలో పెట్టిన మహబూబ్‌నగర్ పేరును పాలమూరు జిల్లాగా మారుస్తామన్నారు.
ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు గెలవడం ఖాయమన్నారు. పాలమూరుతో నాకు చాలా అనుబంధం ఉంది.. ఇక్కడే గుడిసె వేసుకొని ప్రతి నియోజకవర్గంలో పర్యటిస్తూ.. అభివృద్ధికి బాటలు వేస్తానన్నారు. జిల్లాలో పారుతున్న భీమా, కృష్ణానదుల నుంచి సాగునీరు తీసుకువచ్చి ప్రతి ఎకరాకు అందిస్తామన్నారు.
అభివృద్ధి పథంలో దేశం..
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో యావత్ భారతదేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. ఉజ్వల పథకం కింద నిరుపేదలకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా సిలిండర్లు అందిస్తుంటే టీఆర్‌ఎస్ నాయకులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ, ప్రత్యేక తెలంగాణ టీఆర్‌ఎస్ పాలన చూశారు.. ఈసారి బీజేపీకి పట్టం కట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పేటలో రతంగ్‌పాండురెడ్డి, కొడంగల్‌లో నాగూరావు నామాజీ, మక్తల్‌లో కొండయ్యలకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
దళితుడిని సీఎంగా ప్రకటించాలి..
కేసీఆర్‌కు దమ్ముంటే దళితుడిని సీఎంగా చేస్తానని ప్రకటిస్తే ఇప్పుడే తాను పోటీలోంచి తప్పుకొంటా నని బీజేపీ రాష్ట్ర నాయకుడు, కొడంగల్ ఎమ్మెల్యే అభ్యర్థి నాగూరావు నామాజీ సవాల్ విసిరారు. జి ల్లా కావాలని పేట డివిజన్ ప్రాంత సకలజనులు ఉద్యమం చేపడితే స్పందించని కేసీఆర్.. ప్రస్తుతం ఓటమి పాలవుతామని భయపడి జిల్లా మాట ఎత్తారని, ఆయన మోసపూరిత మాటలు నమ్మే పరిస్థితుల్లో పేట ప్రజలు లేరన్నారు. ఆయా స్థానాల్లో బీజేపీ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ అభ్యర్థి రతంగపాండురెడ్డి, నాయకులు సత్యయాదవ్, హన్మిరెడ్డి, ప్రభాకవర్‌వర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment