సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, వైద్యం వంటి వృత్తి విద్యలకూ, క్రీడల కోటాకూ సంబంధం ఏమిటో తెలియడం లేదు. క్రీడల జాబితాలో ఆటల పేర్లు వింటే ఆశ్చర్యంగా ఉంది. చింతపిక్కల ఆటను కూడా ఆ జాబితాలో చేరిస్తే సరిపోయేది కదా.. అని హైకోర్టు వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. రాజ్యాంగంలో క్రీడల కోటా ఎక్కడా లేదని, రాజ్యాంగం ద్వారా సిద్ధించిన రిజర్వేషన్లు, ప్రభుత్వాలిచ్చే క్రీడల కోటా రిజర్వేషన్లకు సమతుల్యత ఉండాల్సిన అవసరం ఎంతో ఉందని అభిప్రాయపడింది.
వృత్తి విద్యలో క్రీడల కోటా రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 7ను సవాల్ చేస్తూ శ్రీయ సహా అయిదుగురు దాఖలు చేసిన పిల్‌పై సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌ల ధర్మాసనం ఎదుట మరోసారి విచారణకు వచ్చింది. ఈ విద్యా సంవత్సరంలో క్రీడల కోటా కింద వృత్తి విద్యలో రిజర్వేషన్లు అమలు చేయరాదని గతంలో ధర్మాసనం ఇచ్చిన మధ్యంతర ఆదేశాలపై కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
జీవో 7 అమలు చేయరాదని కొందరు సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ కేసుల్ని హైకోర్టులో పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు తెలిపింది. దీంతో హైకోర్టు వ్యాజ్యాలను విచారిస్తూ.. ఇంతకీ ఇందులో ప్రజాప్రయోజనం ఏముందని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. క్రీడల కోటాలో వైద్య విద్య సీటు పొందిన వ్యక్తి క్రీడల అభివృద్ధికి ఏం చేయగలరని, క్రీడలకు, వైద్య విద్యకు సంబంధం ఏమిటని ప్రశ్నించింది. ప్రభుత్వం జారీ చేసిన జాబితాలోని క్రీడల పేర్లు విన్న ధర్మాసనం.. చింత పిక్కల ఆటనూ అందులో చేర్చితే సరిపోయేదని వ్యాఖ్యానించింది. బుధవారం సమగ్రంగా విచారిస్తామని హైకోర్టు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment