పరువుతీస్తోందని ప్రాణం తీశాడు
- వీడిన మహిళ హత్య మిస్టరీ
- భర్తే నిందితుడు
- వివరాలు వెల్లడించిన రూరల్ సీఐ శివశంకర్
తాండూరు రూరల్: విచ్చలవిడిగా తిరుగుతూ కుటుంబం పరువు తీస్తోందని అవమానానికి గురైన భర్త భార్యను చంపేశాడు. ఈనెల 15న యాలాల మండల పరిధిలోని బండమీదిపల్లి శివారులో వెలుగుచూసిన మహిళ హత్య కేసు మిస్టరీ వీడింది. ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన మృతురాలి ఫొటో ఆధారాల ద్వారానే హతురాలిని కుటుంబీకులు గుర్తించారు.
ఈక్రమంలేనే కేసును పోలీసులు ఛేదించారు. సోమవారం కరన్‌కోట్ ఠాణాలోని తన కార్యాలయంలో రూరల్ సీఐ శివశంకర్ కేసు వివరాలు వెల్లడించారు. ఈనెల 15న తిమ్మాయిపల్లి అనుబంధ బండ మీదిపల్లి శివారులోని అడవిలో ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సీఐ శివశంకర్ వివరాలు సేకరించారు.
మహిళ తల, మొండెం వేర్వేరుగా పడి ఉన్నాయి. మృతదేహం కాలిపోయింది. దీంతో హతురాలిని గుర్తించే వీలులేకుండా పోయిం ది. ఘటనా స్థలంలో లభించిన చెప్పులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హతురాలి చేతిపై పచ్చబొట్టు, రోల్డ్‌గోల్డ్ గాజలు ఉన్నాయి. కేసు నమోదు చేసుకున్న ఎస్‌ఐ రమేష్ క్రైం విభాగం కానిస్టేబుళ్లు హరీశ్వర్‌రెడ్డి,ప్రేమ్‌కుమార్, రమేష్‌తో కలిసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం హతురాలికి సంబంధించిన ఆధారాలతో కూడిన పోస్టర్ ఈనెల 17న ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైంది.
దీని ఆధారంగా హతురాలిని దోమ మండలం గుండాల గ్రామానికి చెందిన చాకలి ఎర్ర గంగమ్మగా ఆమె కూతురు ఏడో తరగతి చదువుతున్న స్వప్న గుర్తించింది. గ్రామస్తుల సహాయంతో దోమ పోలీసులకు సమాచారమిచ్చింది. అక్కడి పోలీసులు జరిగిన విషయాన్ని తాండూరు పోలీసులకు తెలిపారు. ఇక్కడి పోలీసులు స్వప్న నుంచి మరిన్ని వివరాలు సేకరించారు. తన తల్లి హత్య విషయమై తండ్రి చెన్నయ్యపై స్వప్న అనుమానం వ్యక్తం చేసింది. దీంతో పోలీసులు హతురాలి భర్త చెన్నయ్యను అదుపులోకి తీసుకొని విచారించగా తానే గంగమ్మను చంపేసినట్లు అంగీకరించారు.
చంపేసి తలనీలాలు సమర్పించి..
దోమ మండలం గుండాల గ్రామానికి చెందిన చాకలి చెన్నయ్య, ఎర్ర గంగమ్మ(35) దంపతులు. చెన్నయ్య కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వీరికి ఓ కొడుకు, కూతురు స్వప్న ఉన్నారు. చాకలి చెన్నయ్యకు ముగ్గురు భార్యలు. మొదటి భార్య ఎర్ర గంగమ్మ. రెండో భార్య సువర్ణ, మూడో భార్య కళమ్మ ఉన్నారు. సువర్ణ గతేడాది అనారోగ్యంతో మృతి చెందింది. అయితే గంగమ్మ కొంతకాలంగా జల్సాలకు అలవాటు పడి విచ్చలవిడిగా తిరుగుతోంది. ఆమె తాండూరులోని ఇందిరానగర్‌లో ఓ అద్దెగదిలో ఒంటరిగా ఉంటోంది. చెడుతిరుగుడు మానుకోవాలని పలుమార్లు చెన్నయ్య భార్యను మందలించినా ఫలితం లేకుండా పోయింది.
దీంతో గంగమ్మ కుటుంబ పరువు పోతోందని చెన్నయ్య మనోవేదనకు గురయ్యాడు. ఎలాగైనా భార్యను చంపేయాలనుకొని పథకం పన్నాడు. ఈక్రమంలో ఈనెల 12న చెన్నయ్య కత్తి, పెట్రోల్ తీసుకొని తాండూరుకు బైక్‌పై వచ్చాడు. పట్టణంలోని బసవణ్ణ కట్ట వద్ద ఉన్న భార్య గంగమ్మ వద్దకు వెళ్లి కూతురు స్వప్న ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఆమెను వాహనంపై ఎక్కించుకొని బయలుదేరాడు. మార్గమధ్యంలో యాలాల మండలం బండమీదిపల్లి గ్రామ శివారులోని అడవిలోకి తీసుకెళ్లి రాళ్లతో గంగమ్మ తలపై మోదాడు.
ఆమె చనిపోయిన తర్వాత తలను మొండెం నుంచి వేరుచేశాడు. పెట్రోల్ పోసి మృతదేహాన్ని కాల్చివేసి అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. రెండు రోజుల తర్వాత చెన్నయ్య తన కూతురు స్వప్నను తీసుకొని శ్రీశైలం దైవదర్శనానికి వెళ్లి తలనీలాలు సమర్పించాడు. ఈవిషయమై తండ్రిని ప్రశ్నించగా మీ అమ్మ గంగమ్మ శని నాపై ఉంది అందుకే తలనీలాలు తీసేశానని నమ్మించాడు. స్వప్న తన తండ్రిపై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు చెన్నయ్యను అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించి పైవిషయాలు తెలిపాడు. ఈమేరకు పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చే సి రిమాండుకు తరలించారు. కేసు ఛేదనలో చాకచక్యంగా వ్యవహరించిన యాలాల ఎస్‌ఐ రమేష్‌తో పాటు కానిస్టేబుళ్లను సీఐ అభినందించారు. కేసు ఛేదనకు పరోక్షంగా సహకరించిన ‘సాక్షి’ దినపత్రికను సీఐ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.