సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినులకు ప్రభుత్వం పంపిణీ చేయ తలపెట్టిన ‘హెల్త్ అండ్ హైజీన్ కిట్స్’ సరఫరాకు అడ్డంకులు తొలగిపోయాయి. కిట్స్ సరఫరా టెండర్‌ను మా యార్న్ అండ్ ఫైబర్స్‌కు కట్టబెడుతూ తెలంగాణ విద్యా, సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ (టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ) జారీ చేసిన ఉత్తర్వులపై స్టే విధిస్తూ సింగిల్ జడ్జి గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ధర్మాసనం ఎత్తివేసింది. ఈ మేరకు గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
తమను అనర్హులుగా ప్రకటిస్తూ మా యార్న్ అండ్ ఫైబర్స్ సంస్థకు హైజీన్ కిట్ల సరఫరా కాంట్రాక్టును అప్పగిస్తూ టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ లైట్‌హౌస్ ప్రమోషన్స్ ప్రతినిధి హైకోర్టును ఆశ్రయించగా.. సింగిల్ జడ్జి జస్టిస్ ఎంఎస్.రామచంద్రరావు టెండర్‌పై స్టే విధించారు. దీన్ని సవాలు చేస్తూ మా యార్న్ అండ్ ఫైబర్స్ సంస్థ యజమాన్యం సీజే నేతృత్వంలోని ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేసింది.
వీటిపై విచారణ చేపట్టగా అప్పిలెట్ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ లైట్‌హౌస్ ప్రమోషన్స్ కంపెనీ అవాస్తవాలతో సింగిల్ జడ్జిని తప్పుదోవ పట్టించిందని తెలిపారు. నిబంధనల మేరకే తాము టెండర్‌ను దక్కించుకున్నామని వెల్లడించారు. ప్రభుత్వంతో ఒప్పందం కుదిరిన వెంటనే కిట్ల సరఫరా నిమిత్తం భారీ మొత్తంలో ఖర్చు చేశామని, స్టే ఉత్తర్వుల వల్ల తమకు భారీ నష్టం కలు గుతోందని వివరించారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. కిట్ల సరఫరా టెండర్‌పై సింగిల్ జడ్జి విధించిన స్టే ఉత్తర్వులను సడలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment