ఇప్పటి వరకు 95 సార్లు రక్తదానం చేసిన మలేష్
బోడుప్పల్ : ప్రాణాపాయంలో ఉన్న వారికి ఆయనో ప్రాణదాత. అత్యవసర పరిస్థితుల్లో రక్తం కావాల్సివారికి రక్తదాతగా పేరు పొందారు బోడుప్పల్‌కు చెందిన మరాఠి మల్లేష్. ఆయన 44 ఏళ్ల వయసులో సైతం రక్తదానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. రక్తం అవసరముందని ఎవరైనా ఫోన్ చేస్తే రెక్కలు కట్టుకుని మరీ అక్కడ వాలి రక్తదానం చేయడమే ఆయనకు తెలిసింది. ఇప్పటివరకు 95సార్లు రక్తదానం చేసి పలువురికి ప్రాణదాతగా నిలిచారు.
ఇవీ సంఘటనలు..
నల్గొండ జిల్లా అడ్డగూడూరు మండలానికి చెందిన మరాఠి మల్లేష్ బ్లడ్ గ్రూప్ ఏ+పాజిటివ్. బోడుప్పల్‌లో స్థిరపడ్డారు. ఈ క్రమంలో నల్లగొండ జిల్లా సీతారాంపురానికి చెందిన జెట్ట అశ్విని(10)కి గుండెకు రంధ్రం పడింది. ఆమెకు నగరంలోని గాంధీ ఆస్పత్రిలో ఆపరేషన్ చేసేందుకు డాక్టర్లు నిర్ణయించారు. బాలికకు కావాల్సిన రక్తం గ్రూపు అందుబాటులో లేదు. దీంతో విషయం తెలుసుకున్న మల్లేష్ ఆస్పత్రికి వెళ్లి రక్త దానం చేశారు. దీంతో ఆ బాలిక ప్రాణం పోసుకుంది. అలాగే.. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన లారీ డ్రైవర్ కుమారుడు రాము(12) రక్త హీనతతో బాధపడుతుండగా.. తల్లిదండ్రులు నాంపల్లిలోని ఓ హాస్పిటల్ చేర్పించారు. సకాలంలో రక్తం దొరకక ఇబ్బందిపడుతున్నారు. దినపత్రికలో ప్రకటనను చూసి హాస్పిటల్‌కు వెళ్లి రక్త దానం చేసి బాబుకు ప్రాణదానం చేశారు మల్లేష్.
మరో సంఘటనలో.. బోడుప్పల్‌కు చెందిన జోగు యాదమ్మ (50) రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో రక్తం చాలా వరకు పోయింది. ఆమెను చికిత్స నిమిత్తం ఉప్పల్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చేర్పించారు. బ్లడ్ లేక డాక్టర్లు ఆపరేషన్ చేయడం లేదని స్నేహితుల ద్వారా తెలుసుకున్న మల్లేష్ ఆమెకు రక్తదానం చేశారు. అలాగే.. పఠాన్ చెరువు రాంచంద్రాపురానికి బాలుడు బండ శ్రీకర్ (3), బోడుప్పల్‌కు చెందిన వేముల సంతోష్ (22)లకు కాకుండా మరెందరికో రక్తదానం చేసి ప్రాణదాతగా మారారు.
Comments
Please login to add a commentAdd a comment