మాల్ మాయ! | Increasing traffic trouble | Sakshi
Sakshi News home page

మాల్ మాయ!

Published Fri, Feb 6 2015 12:58 AM | Last Updated on Sat, Sep 2 2017 8:50 PM

మాల్ మాయ!

మాల్ మాయ!

కళ్యాణలక్ష్మి ప్రైవేట్ పార్కింగ్
ఇష్టారాజ్యంగా నాలా ఆక్రమణ
పెరుగుతున్న ట్రాఫిక్ కష్టాలు
పట్టించుకోని కార్పొరేషన్ అధికారులు

 
వరంగల్ :రాష్ర్ట ప్రభుత్వం వరంగల్ నగర అభివృద్ధిపై దృష్టి పెట్టి ప్రత్యేక చర్యలు చేపడుతోంది. విశాలమైన రహదారులను ఏర్పాటు చేసేందుకు వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. అవసరమైతే నివాసగృహాలను, కట్టడాలను కూల్చి వేస్తోంది. సాధారణ ప్రజల విషయంలో నిబంధనల ప్రకారం వెళ్తున్న నగరపాలక సంస్థ అధికారులు.. కొందరి విషయంలో  నిబంధనలు పక్కన బెడుతున్నారు. రహదారుల విస్తరణ కోసం ప్రైవేటు స్థలాల్లోని కట్టడాలను కూల్చివేస్తున్న అధికారులు.. ప్రముఖులు, ప్రముఖ సంస్థలు పార్కింగ్ పేరిట రోడ్లను ఆక్రమించినా చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. హన్మకొండ నగరంలోని వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే బస్‌స్టేషన్ రోడ్డులో కళ్యాణలక్ష్మీ షాపింగ్ మాల్ ఏకంగా ప్రభుత్వ నాలాపైనే స్లాబ్ వేసి వాహనాలను పార్కింగ్ చేస్తోంది. విమర్శలను పక్కన బెట్టి స్లాబ్ వేసేందుకు అనుమతి ఇచ్చిన అధికారులు.. అక్రమ పార్కింగ్ విషయంలోనూ చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. రహదారిని, నాలాను కబ్జా చేసి అక్రమంగా పెయిడ్ పార్కింగ్‌కు వినియోగిస్తున్న వారిపై చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారు.
 
నిబంధనలకు విరుద్ధంగా..

హన్మకొండ బస్‌స్టేషన్ నుంచి కాంగ్రెస్ భవన్ సర్కిల్‌కు వెళ్లే ప్రధాన రహదారిలో కుడివైపు కళ్యాణలక్ష్మి షాపింగ్ మాల్ ఉంది. నిబంధనల ప్రకారం కళ్యాణలక్ష్మి షాపింగ్ మాల్ సెల్లార్‌లో వాహనాల పార్కింగ్ సదుపాయం ఉండాలి. ఇవేవి లేకుండానే షాపింగ్‌మాల్ నడుస్తోంది. ఈ మాల్‌కు వచ్చే వారి వాహనాలను పార్కింగ్ చేసేందుకు స్థలం లేదు. వరంగల్ నగరపాలక సంస్థ అధికారుల సహకారంతో షాపింగ్‌మాల్ నిర్వాహకులు ఏకంగా ప్రధాన రహదారిని కబ్జా చేశారు. సామాజిక సేవ ముసుగులో నాలాపై స్లాబ్ వేసి భారీ వాహనాలను నిలిపేలా పార్కింగ్ జోన్‌గా మార్చారు. స్లాబ్ వేసిన స్థలం తమదేనని ఇప్పుడు దబాయిస్తున్నారు. కేవలం తమ షాపింగ్ మాల్‌కు వచ్చేవారు మాత్రమే అక్కడ వాహనాలు నిలపాలని బెదిరిస్తున్నారు. ఇది ప్రభుత్వ స్థలం కదా అని ప్రశ్నించిన వారిపై దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఇష్టం వచ్చిన చోట చెప్పుకోండి అని బెదిరిస్తున్నారు. రద్దీగా ఉండే రోడ్డు కావడం, షాపింగ్ మాల్ వాహనాలు దీనికి తోడుకావడంతో సాయంత్రం సమయాల్లో ఇక్కడ ట్రాఫిక్ కష్టాలు బాగా ఉంటున్నాయి. పోలీసు ఎస్కార్టు వాహనతో వెళ్తే జిల్లా ఉన్నతాధికారులకు, ప్రజాప్రతినిధులకు ఇది తెలియడంలేదని.. నగర అభివృద్ధి అంటే ఇదేనా అని వాహనదారులు విసుగ్గుకుంటున్నారు.

పదేపదే అలాగే..

కళ్యాణలక్ష్మి షాపింగ్‌మాల్ రెండున్నరేళ్ల క్రితం ప్రారంభమైంది. ప్రారంభమైన కొత్తలోనూ పార్కింగ్ సమస్యను అధిగమించేందుకు నాలాను కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. అక్రమ నిర్మాణం చేపట్టారు. అప్పటి వరంగల్ నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి రాహుల్‌బొజ్జా కఠినంగా వ్యవహరించి కూల్చి వేసేలా ఉత్తర్వులు ఇచ్చారు. పార్కింగ్ కోసం సెల్లార్ లేదా ఇతర ప్రత్యామ్నాయం చూసుకోవాలని కళ్యాణలక్ష్మి షాపింగ్‌మాల్ యాజమాన్యానికి ఆదేశాలు ఇచ్చారు. రెండు నెలల క్రితం కళ్యాణలక్ష్మి షాపింగ్ మాల్ మళ్లీ ఇదే పని చేసింది. పలువురు అప్పటి కలెక్టర్ జి.కిషన్‌కు ఫిర్యాదు చేశారు. అప్పుడు నిర్మాణం ఆగింది. తర్వాత షాపింగ్ మాల్ కథ మార్చింది. కార్పొరేషన్‌లోని ఓ అధికారి సహకారంతో.. సామాజిక సేవ(ఫండ్ యువర్ సిటీ) పేరుతో నాలాపై నిర్మాణం చేపట్టింది. షాపింగ్ మాల్ సమీపంలోని ప్రజల అభిప్రాయంతో సంబంధంలేకుండానే అప్పటి కమిషనర్ స్లాబ్ నిర్మాణానికి అనుమతి ఇచ్చారు. స్లాబ్ వేసి ఊరుకోకుండా ఇప్పుడు అక్రమంగా పార్కింగ్ కోసం వినియోగిస్తోంది.
 
‘‘వరంగల్ నగరంలో ప్రస్తుతం ఎక్కడా పెయిడ్ పార్కింగ్‌కు అనుమతి లేదు. డ్రెరుునేజీపై స్లాబ్ నిర్మాణం ఎలా ఉన్నా ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేటు పార్కింగ్ కోసం వినియోగించడం నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుంది. ఈ విషయంపై పరిశీలించి చర్యలు తీసుకుంటాం.
 - సర్ఫరాజ్ అహ్మద్,
 వరంగల్ నగరపాలక సంస్థ కమిషనర్
 
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement