తూతూమంత్రంగా ఐటీడీఏ సమావేశం
* విద్య, వైద్యంపై కానరాని ప్రణాళిక
* రుణసాయంపై అందని భరోసా
* పెండింగ్ పనుల పూర్తికి లేని గడువు
* రెండో రోజు సగం మంది గైర్హాజర్
సాక్షి, హన్మకొండ : నాలుగున్నరేళ్ల తర్వాత ఐటీడీఏ పాలకమండలి సమావేశం జరుగుతుండడంతో సంక్షేమం, అభివృద్ధి పథకాల అమలుకు నిర్ధిష్ట కార్యాచరణ రూపొందిస్తారని, ఇకపై అంతా సవ్యంగా జరుగుతుందని ఆశించిన గిరిజనులకు చుక్కెదురైంది. ‘ఉత్తీర్ణత శాతాన్ని 90 శాతానికి పైగా చూపిస్తే సరిపోదు.. ఉత్తీర్ణులయ్యే వారంతా ఏ గ్రేడ్‌తోనే పాస్ అయ్యేలా చర్యలు తీసుకోవాలి. ఈ మేరకు మన బడి-మన ప్రణాళిక, మన హాస్టల్-మన రూపొందిచాలి’ అంటూ లోతైన విశ్లేషణతో ప్రారంభమైన ఐటీడీఏ పాలకమండలి సమావేశం చివరకు నిస్సారంగా ముగిసింది.
వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నత్తనడకన సాగడానికి కారకులైన వారిని గుర్తించడం, అసంపూర్తిగా ఉన్న పనులను సత్వరమే పూర్తి చేసే చర్యలపై చర్చించకుండానే సమావేశాన్ని మమ అనిపించారు. రెండో రోజు పాలకమండలి సమావేశానికి సగం మంది ప్రజాప్రతినిధులు హాజరు కాలేదు. ఎంపీలు గుండు సుధారాణి, కడియం శ్రీహరి, ఎమ్మెల్సీలు బోడకుంటి వెంకటేశ్వర్లు, నాగపూరి రాజలింగం, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ సమావేశానికి రాలేదు.
మన బడి - మన విద్య ఎప్పుడో...
నాణ్యమైన విద్యను అందించడం ద్వారా గిరిజనులను త్వరితగతిన అభివృద్ధిలోకి తీసుకురావచ్చంటూ మొదటి రోజు సమావేశంలో ప్రజాప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ఇందులో భాగంగా మన ఊరు-మన ప్రణాళిక తరహాలో ఐటీడీఏ ఆధ్వర్యంలో నడుస్తున్న అన్ని గురుకుల పాఠశాలలు, హాస్టళ్లు, ఆశ్రమపాఠశాలల్లో అక్కడి అవసరాలకు అనుగుణంగా మార్పులు.. చేర్పులు చేపట్టాలని డిప్యూటీ సీఎం రాజయ్య సూచించారు. కానీ... ఈ కార్యక్రమానికి సంబంధించి ఎటువంటి కార్యాచరణ రూపొందించ లేదు. కేవలం ఏటూరునాగారంలో ఇంటర్మీడియట్ కోర్సును ఆంగ్ల మాధ్యమంలో ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఒకే ఒక్క విధానపరమైన నిర్ణయం తీసుకున్నారు.
అదేవిధంగా 13 మండలాల పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నెలకొన్న సమస్యలు.. వైద్యుల కొరత వంటి అంశాలను ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు ఏకరువు పెట్టినా.. వీటిపై ప్రత్యేకంగా ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఐటీడీఏ పరిధిలోని అన్ని పీహెచ్‌సీలను 30 పడకల ఆస్పత్రులుగా మార్చాలని కోరగా.. కేవలం ఒక్క ఏటూరునాగారం ఆస్పత్రిలో గైనకాలజిస్టు, అనస్తీషియా పోస్టులను వెంటనే భర్తీ చేయాలని తీర్మానం చేశారు.
భరోసా లేని ఆర్థిక సాయం
ఆదివారం జరిగిన సమీక్షలో 2012-13 ఆర్థిక సంవత్సరానికి స్వయం ఉపాధి పథకం కింద ఆర్థిక సాయం చేసేం దుకు రూ 6.6 కోట్లు మంజూరయ్యాయని.. 959 మంది లబ్ధిదారులను ఎంపిక చేశామని కలెక్టర్ కిషన్ తెలిపారు. గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ నుంచి ఆదేశాలు రాకపోవడంతో వీరికి రుణసాయం అందించలేదన్నారు. కనీసం ఈ సమావేశంలో అయినా రుణసాయం త్వరగా అందిం చేందుకు చర్యలు చేపడతారని ఎదురు చూసిన నిరుద్యోగులకు నిరాశే ఎదురైంది. ఎంపికైన లబ్ధిదారులకు సత్వర సాయమందించే విషయంలో ఎటువంటి భరోసా ఇవ్వలేదు. గిరిజన విద్యార్థులు, నిరుద్యోగులకు బ్యాంకుతో సంబంధం లేకుండా రుణాలివ్వాలని రాపోలు ఆనందభాస్కర్ సూచించగా... ఎటువంటి హామీ లభించలేదు.
పరిష్కారానికి నోచుకోని అటవీ వివాదాలు
అటవీహక్కుల చట్టం చుట్టూ నెలకొన్న వివాదాలను పరిష్కరించేందుకు కార్యాచరణ రూపొందించాలని ఇటు గిరిజన ప్రజాప్రతినిధులు, అటు అటవీశాఖ అధికారులు కోరినప్పటికీ... ఏ విధమైన స్పష్టత ఇవ్వకుండా ఈ అంశాన్ని అర్ధంతరంగా వదిలేశారు. ఇంజినీరింగ్ విభాగంలో నాలుగైదేళ్లుగా నత్తనడకన సాగుతున్న పనులు పూర్తి చేసేందుకు ఎటువంటి గడువు విధించలేదు. మరోసారి సమీక్షిస్తామని చెప్పిన అధికారులు అందుకు కనీసం తేదీని కూడా ప్రకటించకపోవడంతో అసంపూర్తిగా ఉన్న భవనాలు ఎప్పుడు పూర్తవుతాయో ? అందులో నాణ్యత ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది.
రెండో రోజు తీర్మానాలివే...
రెండో రోజు సమావేశంలో మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలంటూ ఐటీడీఏ పాలకమండలి తీర్మానం చేసింది. పోలవరం ముంపు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం ఆర్డినెన్స్ రద్దు చేయడం... ఐటీడీఏ పీఓకు కొత్త వాహనం కొనుగోలు, ఖాళీలను వెంటనే భర్తీ చేయడం వంటి అంశాలపై తీర్మానాలు చేశారు. అదేవిధంగా మహబూబాబాద్‌లో మాడా కార్యాలయం ఏర్పాటు చేసి ఆర్డీ స్థాయి అధికారిని అక్కడ నియమించాలని నిర్ణయించారు. పెండింగ్‌లో ఉన్న చిలకలగుట్ట ఫెన్సింగ్ పనులు త్వరగా పూర్తి చేయడంతోపాటు మల్లూరు దేవస్థానం అభివృద్ధికి చర్యలు చేపట్టాలని సభ్యులు సూచించారు.
అలా ముగిసింది..
Published Mon, Jul 21 2014 4:00 AM | Last Updated on Wed, Oct 3 2018 5:26 PM
Advertisement
Advertisement