కేసీఆర్ నీతులు చెప్పడం విడ్డూరం: రేవంత్
హైదరాబాద్: చట్టసభల్లో విలువలను పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్న మాటలు విడ్డూరంగా ఉన్నాయని, వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్టుగా కేసీఆర్ తీరు ఉందని టీడీఎల్‌పీ ఉపనేత ఎ.రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. శాసనసభలో విలువలను కాలరాసి, ప్రతిపక్షాలను అణచివేస్తూ కేసీఆర్ నీతులు చె ప్పడం శోచనీయమన్నారు.
సోమవారం హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్ నాయకులకు శిక్షణ తరగతులు నిర్వహించడం సమాజానికి ఎలాంటి సందేశం పంపుతుందో ఆలోచించాలన్నారు. రాజా సదారాం, మహేందర్ రెడ్డి టీఆర్‌ఎస్ పార్టీ సభ్యుల్లా వ్యవహరించారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీ ఫిరాయించిన తుమ్మల, తలసాని, ధర్మారెడ్డి, మంచిరెడ్డి విలువల గురించి చెప్పడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు.