సాక్షి ప్రతినిధి, ఖమ్మం: రెండు సెమీ ఫైనల్స్ అయిపోయాయి. ఇక ఫైనల్స్(సార్వత్రిక ఎన్నికలు)కు తెరలేచింది. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలతో పాటు రెండు దశల ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ముగియడంతో అన్ని రాజకీయ పక్షాలు ఇక సార్వత్రిక ఎన్నికలపైనే దృష్టి సారించాయి. ఈనెల 30న జరగనున్న ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలలో విజయం సాధించేందుకు హోరాహోరీగా తలపడనున్నాయి.
జిల్లాలో ప్రధాన రాజకీయ పక్షాలైన వైఎస్సార్‌సీపీ, సీపీఎం, కాంగ్రెస్, సీపీఐ, టీఆర్‌ఎస్, టీడీపీ, న్యూడెమోక్రసీ, బీజేపీలతో పాటు ఇతర
పార్టీలు కూడా ఎన్నికల బరిలో సర్వశక్తులూ ఒడ్డేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. ఆయా పార్టీల తరఫున పోటీచేస్తున్న అభ్యర్థులు, వారి అనుచరులు, పార్టీ కార్యకర్తలు తమ గెలుపు కోసం పగలనక, రేయనక శ్రమించనున్నాయి. దీంతో రానున్న 20 రోజులు జిల్లాలో ఇక రాజకీయ వాతావరణం వేడెక్కనుంది.
తరలిరానున్న అగ్రనేతలు
వివిధ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించేందుకు ఆయా పార్టీల అగ్రనేతలు కూడా జిల్లాకు తరలిరానున్నారు. వీరి పర్యటనల కోసం అన్ని రాజకీయ పక్షాలు ప్రత్యేక కృషి చేస్తున్నాయి. వైఎస్సార్‌సీపీకి సంబంధించి ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే జిల్లా కేంద్రంలో లక్షలాది మందితో జనభేరి సభ విజయవంతంగా నిర్వహించారు. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ జిల్లాలోని మధిర, ఇల్లెందు, కొత్తగూడెం, సత్తుపల్లి మున్సిపాలిటీల్లో పర్యటించారు. కాగా, పార్టీకి చెందిన మరో ముఖ్య నాయకురాలు షర్మిల ఈనెల 13 నుంచి మూడు రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్నారు.
ఈ పార్టీతో పొత్తు కుదుర్చుకున్న సీపీఎం అగ్రనేతలు ప్రకాష్‌కారత్, సీతారాం ఏచూరి, బృందాకారత్, బి.వి.రాఘవులు కూడా జిల్లాకు వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటివరకు రాష్ట్రస్థాయి నేతలెవరూ రాకపోయినా సోనియా, రాహుల్‌గాంధీలలో ఒకరిని జిల్లాకు తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వారి బిజీ షెడ్యూల్ ఇందుకు అనుకూలించడం లేదని పార్టీ వర్గాలంటున్నాయి. జాతీయ స్థాయి నేతలు కాకపోయినా, టీపీసీసీ ప్రచార కమిటీ పక్షాన ముఖ్య నేతలు జిల్లాలో పర్యటించే అవకాశం ఉంది.
సీపీఐ నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యద ర్శే ఖమ్మం పార్లమెంటు అభ్యర్థిగా బరిలో ఉండగా, జాతీయ నాయకులు సురవరం సుధాకర్‌రెడ్డి, బర్ధన్ లాంటి నేతలు ఎన్నికల ప్రచారానికి వచ్చే అవకాశం ఉంది. ఇక తెలుగుదేశం అధినేత చంద్రబాబు కూడా ఒకసారి జిల్లాలో పర్యటించారు. ఆ పార్టీ అభ్యర్థుల విజయం కోసం ఆయన మరోసారి కూడా జిల్లాకు వచ్చే అవకాశం లేకపోలేదు. అయితే, వీరెవరి పర్యటనలూ ఖరారు కాలేదు. ఖరారయితే ఆయా పార్టీల శ్రేణుల్లో మరింత ఉత్సాహం నెలకొననుంది. ఏదేమైనా ఈ 20 రోజుల పాటు జిల్లాలో ఎన్నికల తీన్‌మార్ మారుమోగనుంది.
ఇక ‘ఫైనల్సే’
Published Sat, Apr 12 2014 2:06 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
Advertisement
Advertisement