వక్ఫ్‌పై కన్ను | mistakes in wakf gazette | Sakshi
Sakshi News home page

వక్ఫ్‌పై కన్ను

Published Wed, Jul 16 2014 3:21 AM | Last Updated on Sat, Sep 2 2017 10:20 AM

mistakes in wakf gazette

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: రికార్డులేమీ లేకుండానే అప్పనంగా సొంత భూములను ఇచ్చినట్టు వందల కోట్ల విలువైన భూమిని లీజుకిచ్చి ఆ తర్వాత వాటిని క్రమబద్ధీకరించుకోవచ్చు.. ఇందు కోసం ఏళ్ల నాడే కోట్ల రూపాయలు కొట్టేయవచ్చు... ఆ తర్వాత చిన్న పొరపాటును ఆసరాగా చేసుకుని భూమిని వశం చేసుకోవచ్చు... కోట్ల రూపాయలూ బొక్కేయవచ్చు...ఇదీ జిల్లా కేంద్రానికి సమీపంలో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న దాదాపు 30 ఎకరాల వక్ఫ్ భూమిని కబ్జా చేసేందుకు కొందరు అక్రమార్కులు పన్నిన పన్నాగం.

 వక్ఫ్ గెజిట్‌లో సదరు సర్వే నంబర్లు ప్రింట్ కాలేదన్న సాకుతో ఏకంగా ఆక్యుపైడ్ రైట్ సర్టిఫికెట్ (ఓఆర్‌సీ)లకే దరఖాస్తు చేశారు వీరు. తమ వశం చేసుకునేందుకు వక్ఫ్ భూములను ఇనాం భూములుగా మార్చి పట్టాలు పొందే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అధికారులు కళ్లు మూసుకుని విచారణ జరిపితే తమ మతానికి చెందిన ఈద్గా, ఖబర్‌స్థాన్‌లు ప్రైవేటు వ్యక్తుల పాలయ్యే ప్రమాదముందని ముస్లింలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 సొంత భూమి ఇచ్చినట్టు..
 వాస్తవానికి జిల్లాలో వందల కోట్ల విలువ చేసే వేలాది ఎకరాల వక్ఫ్ భూములున్నాయి. వీటిపై జిల్లాలోని ఏ అధికారికీ ప్రత్యక్ష అధికారం లేకపోవడం, హైదరాబాద్‌లో ఉండే వక్ఫ్ కమిషనర్‌కే సర్వాధికారాలు ఉండడంతో చాలా వరకు కబ్జాకు గురయ్యాయి. వక్ఫ్ రికార్డులు సరిగా లేకపోవడం, ఉన్నా సరిగా ప్రింట్ కాకపోవడం వంటి సమస్యలతో అసలు ఆ భూములకు సార్ధకతే  లేకుండా పోయింది.

 ముజావర్‌లు, ముతవ ల్లీల పేరుతో ఉండే వక్ఫ్ భూముల సంరక్షకులు కూడా సొమ్ములకు ఆశపడడంతో కబ్జాదారులకు అంతే లేకుండా పోయిందన్న ఆరోపణలూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఖమ్మం అర్బన్ మండలం గొల్లగూడెంలోని విలువైన భూమికి కొందరు టెండర్ పెట్టారు. ఎకరం కోట్ల రూపాయలు పలికే ఈ భూమిని అనధికారికంగా ఎప్పుడో లీజుకిచ్చేసి ఇప్పుడు క్రమబద్ధీకరణ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న ముస్లింలతో పాటు అన్ని మండలాలకు చెందిన వారు ప్రార్థనలు జరుపుకునే ఈద్గా, అంత్యక్రియలు నిర్వహించే ఖబర్‌స్థాన్‌లున్న 432, 425 సర్వే నెంబర్లలోని 30 ఎకరాల భూమిని ఆక్రమించుకునేందుకు ముమ్మరంగా పావులు కదుపుతున్నారని తెలుస్తోంది.

రెవెన్యూ శాఖ బలహీనతలను, వక్ఫ్ గెజిట్‌లో ఉన్న తప్పులను చూపెడుతూ అసలు అది వక్ఫ్ భూమే కాదని, ఇనాం భూమంటూ ఆక్యుపైడ్ రైట్ సర్టిఫికెట్ (ఓఆర్‌సీ) కోసం దరఖాస్తు చేశారు. అయితే, రెవెన్యూ అధికారులు దీనిపై జాగ్రత్తగా విచారణ చేయాలని ముస్లిం మతస్తులు కోరుతున్నారు. ఈ విచారణలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా దాదాపు రూ.100 కోట్లపైగానే విలువున్న ఈ భూమి ప్రైవేటు వ్యక్తుల పాలవుతుందని వారు వాపోతున్నారు.

 లీజులిప్పించారు... రద్దు చేశారు
 వాస్తవానికి ఈ భూమిని కాపాడాల్సిన వారే భక్షించే ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. వక్ఫ్ కార్యాలయానికే తప్పుడు సమాచారమిచ్చి ఈ భూములను 2007, 08లోనే కొందరు వ్యక్తులకు లీజుకిప్పించారు.  జిల్లా కేంద్రంలోని ఓ పాఠశాల యజమాని, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మరో ముస్లిం సంస్థ పెద్ద, మరో పాఠశాల కరస్పాండెంట్‌లకు 30 ఎకరాల భూమిని లీజుకిప్పించారని, అప్పుడే రూ.కోట్లు చేతులు మారాయని సమాచారం.

 ఆ తర్వాత అది ఈద్గా, ఖబర్‌స్థాన్‌లకు చెందిన భూమి అని నిర్ధారించుకున్న వక్ఫ్ కమిషనర్ కార్యాలయం ఆ లీజులను రద్దు చేసింది. దీంతో ఈ భూములను ఇప్పుడు ఏకంగా క్రమబద్ధీకరించుకునే ప్రయత్నాలు పడ్డారు. ఇందుకోసం ఓఆర్‌సీలిప్పించాలని కలెక్టర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నట్టు తెలిసింది. అయితే, దీనిపై విచారణ జరపాలని ఆర్డీవోకు కలెక్టర్ సిఫారసు చేయడంతో ఇప్పుడు ఆ పనిలో పడ్డారాయన.

 ఇది వక్ఫ్ భూమే!
 అక్రమార్కులు పన్నాగం పన్ని కాజేయాలని చూసేందుకు ప్రయత్నిస్తున్న భూమి వక్ఫ్‌కు చెందినదేనని, ఇందుకు తగిన రికార్డులున్నాయని తెలుస్తోంది. ఈ సర్వే నెంబర్లలోని భూమి వక్ఫ్‌కు చెందుతుందని, వక్ఫ్ భూముల సర్వేలో భాగంగా వెంటనే దీనికి సంబంధించిన పహాణీలు తమకు పంపాలని 2010 డిసెంబర్ 23న అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం నుంచి అసిస్టెంట్ సర్వే కమిషనర్ ఆఫ్ వక్ఫ్ పేరిట ఖమ్మం అర్బన్ తహశీల్దార్‌కు సర్క్యులర్ జారీ అయింది.

మరి ఏమైందో కానీ, ఆ వ్యవహారం అక్కడితోనే ఆగిపోయింది. అంతకుముందు 1997లో అప్పటి తహశీల్దార్ తయారు చేసిన సర్వే మ్యాప్‌లో గొల్లగూడెం ఈద్గా, ఖబర్‌స్థాన్‌ల కింద సర్వే నెంబర్లు 397, 420-32 వరకు 70 ఎకరాలకు పైగా భూమి ఉన్నట్టు చూపించారు. అయితే, అక్రమార్కులకు ఓ చిన్న ఆసరా దొరికింది. అంతకుముందు జిల్లాకు చెందిన వక్ఫ్ భూములను చూపిస్తూ వక్ఫ్‌బోర్డు జారీ చేసిన గెజిట్‌లో గొల్లగూడెం గ్రామ పరిధిలోని 423 సర్వే నెంబర్ రెండుసార్లు చూపించారు.

కానీ, 432, 425 సర్వే నెంబర్లు మాత్రం చూపించలేదు. అయితే, ఇటీవల వక్ఫ్ బోర్డు తయారుచేసిన గెజిట్‌లో మాత్రం చూపించారు. మరోవైపు తహశీల్దార్ తయారు చేసిన మ్యాప్‌లో ఉన్న 420 సర్వే నెంబర్ కూడా వక్ఫ్ పాత గెజిట్‌లో లేదు. అయితే, ఆ భూమి కేవలం 21 కుంటలే కావడం, పెద్ద బండరాయి కావడంతో దాని జోలికి వెళ్లలేదు. ఇదే, వక్ఫ్ పాత గెజిట్‌లో లేని 425, 432 సర్వే నెంబర్లలోని భూమిని మాత్రం ఇనాం అంటూ కబ్జా సర్టిఫికెట్లు కావాలని అధికారులపై అన్ని విధాలా ఒత్తిడి తీసుకువస్తుండడం గమనార్హం.

 ఖమ్మంలో ఇది అలవాటే
 ఖమ్మం జిల్లా కేంద్రంలోని వక్ఫ్ భూములను కాజేయడం అక్రమార్కులకు రివాజుగా మారింది. ముస్తఫానగర్‌లో ఉన్న 481-485 సర్వే నెంబర్లలోని 15ఎకరాలకు పైగా భూమి (ఇప్పటి విలువ రూ.150 కోట్ల పైమాటే)ని గతంలో కొందరు స్వాధీనం చేసుకున్నారు. కాల్వొడ్డు సమీపంలో ఉన్న సోందీషహీద్ దర్గా షరీఫ్‌కు చెందిన 11 ఎకరాల భూమి పూర్తిగా కబ్జాకు గురయింది.

 దీని విలువ రూ.30 కోట్లపైమాటే. వక్ఫ్‌బోర్డుకు చెందిన మాజీ చైర్మన్ అనుచరులు కొందరు ఇందులో కీలకపాత్ర పోషించి కోట్ల రూపాయలు దండుకున్నట్టు ఆరోపణలున్నాయి. అదే విధంగా ఖమ్మం నడిబొడ్డున కలెక్టరేట్‌కు కూత వేటు దూరంలో ఉన్న తాలింమస్తాన్ దర్గా షరీఫ్‌కు చెందిన 7.33 గుంటల భూమిని కూడా అక్రమార్కులు ప్లాట్లు చేసి అమ్మేశారు. ఈ భూమిని కూడా కాపాడాల్సిన వారే భక్షించారనే ఆరోపణలొచ్చాయి. ఈ అక్రమాలపై అటు వక్ఫ్ కానీ, ఇటు జిల్లా అధికారులు కానీ ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంతో తాజాగా వందల కోట్ల విలువ చేసే గొల్లగూడెం ఈద్గా, ఖబర్‌స్థాన్ భూములను కబ్జా చేసే పనిలో పడ్డారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement