మన క్రీడా బడ్జెట్ రూ.40.18 కోట్లు | nalgonda district sport budget of Rs .40.18 crore | Sakshi
Sakshi News home page

మన క్రీడా బడ్జెట్ రూ.40.18 కోట్లు

Published Mon, Aug 4 2014 1:03 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

మన క్రీడా బడ్జెట్  రూ.40.18 కోట్లు - Sakshi

మన క్రీడా బడ్జెట్ రూ.40.18 కోట్లు

నల్లగొండ స్పోర్ట్స్ :‘మన ఊరు-మన ప్రణాళిక’లో భాగంగా జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ‘మన ఊరు-మన క్రీడా’ బడ్జెట్ రూపొందించింది. ఉమ్మడి రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి కోసం నయాపైసా కూడా విడుదల కాలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే ‘పైకా’ నిధులు మినహా మరెలాంటి ఆర్థిక సహాయం రాష్ట్రం నుంచి అందలేదు. కేవలం మండల, జిల్లాస్థాయిలో నిర్వహించే క్రీడలకు సంబంధించి క్రీడాకారుల ఎంపికకు మాత్రమే నామమాత్రంగా నిధులు విడుదలయ్యేవి. ఉమ్మడి రాష్ట్రానికి చివరి సీఎంగా వ్యవహరించిన కిరణ్ కుమార్‌రెడ్డి స్టేడియాల అభివృద్ధి పట్ల కొంత కరుణ చూపించారు. ‘గ్రీన్ ఫీల్డ్ స్టేడియం’ల పేరిట జిల్లాలోని ఐదు స్టేడియాల్లో మెరుగైన వసతులు కల్పించేందుకుగాను రూ. 6 కోట్లు నిధులు విడుదల చేశారు. వీటితోపాటు మరమ్మతుల కోసం మరో రూ.20  లక్షలు కేటాయించారు. ప్రస్తుతం ఆ పనులు చివర దశకు చేరుకున్నాయి. ఇవి తప్ప ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాకు క్రీడల అభివృద్ధికి సంబంధించి ఎలాంటి సహాయమూ రాష్ట్రం నుంచి అందలేదు.
 
 తెలంగాణ రాష్ట్రంలో జీవం..
 తెలంగాణ రాష్ట్రంలో క్రీడలకు మళ్లీ మంచిరోజులు రానున్నాయి. టీఆర్‌ఎస్ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు-మన ప్రణాళిక’లో భాగంగా క్రీడలకు సైతం పెద్దపీట వేయాలని నిర్ణయించారు. దీనిలో భాగంగానే ‘మన ఊరు-మన క్రీడా’ పేరిట ప్రత్యేకంగా ప్రణాళికలు తయారు చేశారు. కొత్త రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేయాలని టీఆర్‌ఎస్ సర్కార్ భావిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో స్పోర్ట్స్ అకాడమీలు సికింద్రాబాద్, కరీంనగర్‌లో మాత్రమే ఉన్నాయి. మన జిల్లాలో ‘హాకీ అకాడమీ’ ఉంది. దీనికి జిల్లా క్రీడల అధికారి (డీఎస్‌డీఓ) ఇన్‌చార్జి కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో గ్రామ, మండల స్థాయిలో క్రీడా పాఠశాలలు, జిల్లా స్థాయిలో పలు రకాల క్రీడలకు సంబంధించిన అకాడమీలు ఏర్పాటు చేస్తే బాగుటుందన్న ఉద్దేశంతో అధికారులు పేరొందిన కొన్ని క్రీడలను ఎంపిక చేసి ప్రణాళికలు రూపొందించారు.
 
 మన క్రీడా ప్రణాళిక ఇదీ...
 పంచాయత్ యువ క్రీడా కేల్ అభియాన్ (పైకా) పథకంలో భాగంగా 2008-09 నుంచి 2010-11 వరకు జిల్లాలో 1178 గ్రామాలకు గాను కేవలం 102 గ్రామాల్లోని పాఠశాలల్లో మాత్రమే మైదానాలను అభివృద్ధి చేశారు. దీనికిగాను రూ.49,27,189 ఖర్చు పెట్టారు. ఇంకా 1076 గ్రామాల్లోని పాఠశాలల్లో మైదానాలు అభివృద్ధి పర్చాల్సి ఉంది. దీనికి గాను గ్రామానికి లక్ష చొప్పున రూ.10.76 కోట్లు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేశారు. పైకాలో భాగంగానే 2008 నుంచి 2011 వరకు 59 మండలాలకు గాను కేవలం 5 మండల కేంద్రాల్లోని పాఠశాలల్లో మాత్రమే మైదాలను అభివృద్ధి పర్చారు. దీనికి గాను రూ.9 లక్షల 55 వేలు ఖర్చు పెట్టారు. ఇంకా 54 మండల కేంద్రాల్లోని పాఠశాలల్లో మైదానాలను అభివృద్ధి చేసేందుకు రూ.27 కోట్లు అవసరం అవుతాయని అధికారుల అంచనా.
 
 ప్రభుత్వానికి నివేదించాం
 మన ఊరు-మన క్రీడా ప్రణాళికలో జిల్లా క్రీడల అభివృద్ధికి అవసరమైన అంశాలన్నింటినీ పొందుపర్చాం. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు వాటిని రూపొందించాం. జిల్లాలో ప్రధాన క్రీడలు, మైదానాలను అన్ని హంగులతో తీర్చిదిద్దేందుకు ఈ ప్రణాళిక దోహదం చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో క్రీడలకు మంచి భవిష్యత్ ఉంటుందని ఆకాంక్షిస్తున్నాం.
 - మక్బుల్ అహ్మద్, డీఎస్‌డీఓ
 
 పోస్టుల వివరాలు
 నల్లగొండ, మిర్యాలగూడ, నకిరేకల్, భువనగిరి, నూతనకల్, తుంగతుర్తి, ఆలేరు, సూర్యాపేట స్టేడియాల్లో 40 మంది కోచ్‌లతోపాటు ఆయా స్టేడియాల్లో మినిస్టీరియల్ సిబ్బంది 20మంది అవసరం ఉంటుంది.
 
 క్రీడా పాఠశాలలు : అథ్లెటెక్స్, బాక్సింగ్,     
         హ్యాండ్ బాల్, తైక్వాండో
 కోచ్‌లు : ఏడుగురు,
 మినిస్టీరియల్ సిబ్బంది : ఏడుగురు
 జిల్లా అకాడమీలు : వాలీబాల్, కబడ్డీ, హాకీ
 కోచ్‌లు : ముగ్గురు, సిబ్బంది :  ముగ్గురు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement