హైదరాబాద్: ‘పనులకోసం ప్రజలు ఎవరికీ లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా అడిగితే నేరుగా నావద్దకు రండి’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రజలకు సూచించారు. సోమవారం సాయంత్రం స్ధానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎక్సైజ్ మంత్రి టి. పద్మారావులతో కలిసి ఆయన ఐడీహెచ్ కాలనీలో పర్యటించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేసీఆర్ మాట్లాడారు. జంటనగరాల్లోని పేదల బస్తీల తీరుతెన్నులకు మారుస్తామని ఇందుకు నమూనాగా తొలుత సనత్‌నగర్ నియోజకవర్గంలోని ఐడీహెచ్ కాలనీని ఆధునిక వసతులతో తీర్చిదిద్దుతామని సీఎం వెల్లడించారు. అయిదు నెలల్లో ఐడీహెచ్ కాలనీలో పక్కాఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు.
కూలే దశలో ఉన్న ఇండ్లలో ప్రజలు ఉండకుండా వెంటనే ఖాళీ చేయాలన్నారు. బ్యాంక్ లోను, మార్జిన్ మనీ అవసరం లేకుండా మొత్తం వ్యయాన్ని ప్రభుత్వమే భరించి పక్కా ఇళ్ల నిర్మాణం చేయిస్తుందన్నారు. అధికారులు రేయింబవళ్లు పని చేసి ఇళ్ల నిర్మాణం సాగించాలని..ఇందుకు మంగళవారం నుంచే పనులు ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. ఐడీహెచ్ కాలనీ, అమ్ముగూడ, పార్ధివాడ, సుభాష్‌చంద్రబోస్ నగర్, భగత్‌సింగ్ నగర్ మురికివాడల్లో ఇండ్ల మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్యే తలసాని నిర్మాణాన్ని పర్యవేక్షిస్తారన్నారు. ప్రజలు పనుల కోసం ఎవరికీ లంచం ఇవ్వొద్దనీ.. ఎవరైనా అడిగితే తన వద్దకు రావాలని సీఎం ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు.