కన్ఫర్డ్‌ ఐపీఎస్‌ పదోన్నతులకు లైన్‌క్లియర్‌ | Police Department sent list with seven names | Sakshi
Sakshi News home page

కన్ఫర్డ్‌ ఐపీఎస్‌ పదోన్నతులకు లైన్‌క్లియర్‌

Published Sat, Dec 30 2017 1:02 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM

Police Department sent list with seven names - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర పోలీసు శాఖకు ఎస్పీ స్థాయి ఐపీఎస్‌ అధికారుల కొరత త్వరలో తీరబోతోంది. మూడేళ్లుగా పెండింగ్‌ పడుతూ వస్తున్న కన్ఫర్డ్‌ ఐపీఎస్‌ పదోన్నతుల ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇప్పటికే కన్ఫర్డ్‌ ఐఏఎస్‌ పదోన్నతుల కోసం జాబితా రూపొందించగా.. తాజాగా కన్ఫర్డ్‌ ఐపీఎస్‌ పదోన్నతుల కోసం ప్రతిపాదనలు ఇవ్వాలని పోలీస్‌ శాఖను కోరింది. ఈ మేరకు పోలీసుశాఖ అర్హత కలిగిన 2007 బ్యాచ్‌ డైరెక్ట్‌ గ్రూప్‌–1 అధికారుల జాబితాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేసింది. ప్రస్తుతం ఈ బ్యాచ్‌ అధికారులు రాష్ట్రంలో నాన్‌కేడర్‌ ఎస్పీ హోదాలో.. జిల్లా ఎస్పీ, జోనల్‌ డీసీపీలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జాబితాలో జానకీ షర్మిల, జానకీ ధరావత్, డీవీ శ్రీనివాస్‌రావు, టి.అన్నపూర్ణ, సాయి శేఖర్, ఎన్‌.కోటిరెడ్డి, పీవీ పద్మజల పేర్లు ఉన్నట్లు తెలిసింది. ఈ కన్ఫర్డ్‌ ఐఏఎస్, కన్ఫర్డ్‌ ఐపీఎస్‌ల   జాబితాలను ఒకేసారి కేంద్రానికి పంపే అవకాశముందని సచివాలయ వర్గాలు వెల్లడించాయి. 

పదిహేను రోజుల్లో.. 
రాష్ట్ర విభజన తర్వాత 18 కన్ఫర్డ్‌ ఐపీఎస్‌ పోస్టులు తెలంగాణ పరిధిలోకి వచ్చాయి. కానీ విభజన నాటి నుంచి ఇప్పటివరకు ఒక్క ప్యానెల్‌ కూడా కేంద్ర ప్రభుత్వానికి చేరలేదు. దీనితో ప్రస్తుతం అర్హత కల్గిన ఏడుగురు అధికారుల జాబితాను పంపినట్లు పోలీస్‌ శాఖ తెలిపింది. అదే విధంగా సీనియారిటీ జాబితా సవరణ కూడా తుదిదశకు చేరిందని పేర్కొంది. అయితే ఆ జాబితాకు ఈ పదోన్నతులకు ఎలాంటి వివాదం లేదని, సరైన వేకెన్సీ పోస్టుల్లోనే ప్రస్తుత జాబితాలోని అధికారులు పనిచేస్తున్నారని స్పష్టం చేసింది. ప్రభుత్వానికి పంపిన కన్ఫర్డ్‌ ఐపీఎస్‌ పదోన్నతుల జాబితాపై త్వరలో వెరిఫికేషన్‌ ఉంటుందని.. అదంతా పూర్తయి జాబితా కేంద్రానికి వెళ్లేందుకు 15 రోజుల సమయం పడుతుందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement