రాష్ట్రానికి పోలీసు అధికారులు కావలెను!
త్వరలో ఐదుగురు ఐపీఎస్‌ల పదవీ విరమణ
ముఖ్యమైన పోస్టులు ఇన్‌చార్జీలతో సరి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసుశాఖను ఐపీఎస్‌ల కొరత పీడిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత అరకొరగా లభించిన ఐపీఎస్ అధికారులతో నెట్టుకొస్తున్న ఆ శాఖలో రాష్ట్ర కేడర్‌కు చెందిన ఐదుగురు అధికారులు త్వరలో పదవీ విరమణ చేయబోతున్నారు. వారిలో ఎన్.సూర్యనారాయణ , కె.వేణుగోపాల్‌రావు, ఎస్.జె.జనార్దన్, సత్యనారాయణ్, ఎ.కె.ఖాన్ ఉన్నారు. మరోవైపు ముగ్గురు అధికారులు డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసులకు వెళ్లాలని యోచిస్తున్నారు. అధికారుల కొరత కారణంగా కొన్ని ముఖ్యమైన పోస్టుల్లో ఇన్‌చార్జీలే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి భారీగా ఐపీఎస్‌లను కేటాయించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం తరచూ విన్నవిస్తున్నా తగిన స్పందన లభించడం లేదు. దీంతో ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఐపీఎస్ అధికారులను డిప్యుటేషన్లపై తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
అధికారుల కొరతతో తీవ్ర ఇబ్బందులు
రాష్ట్ర విభజనలో భాగంగా తెలంగాణకు 92 మంది ఐపీఎస్‌లను కేటాయించారు. అయితే వీరిలో పది మంది వరకు కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్ వెళ్లారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎస్పీ స్థాయి అధికారులు కేవలం 33 మంది మాత్రమే ఉన్నారు. వీరిలో హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో అత్యధికంగా 15 మంది విధులు నిర్వహిస్తున్నారు. మిగతా సగం మందిలో తొమ్మిది మంది జిల్లాల్లో విధులు నిర్వహిస్తుండగా, ఇద్దరు సీఐడీ, ముగ్గురు ఏసీబీలో పనిచేస్తున్నారు. కొందరు అధికారులు అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వరంగల్ కమిషనరేట్‌లో ఐపీఎస్‌లు లేకపోవడంతో కేవలం ఏసీపీల సేవలతోనే సరిపెడుతున్నారు. కొత్తగా ఏర్పాటు చేయాలని భావిస్తున్న మూడు కమిషనరేట్లకు, 14 కొత్త జిల్లాలకు అధికారులను ఎలా సర్దుబాటు చేయాలోనని ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. రాష్ట్రం పట్ల ఆసక్తి ఉన్న ఇతర రాష్ట్రాల అధికారులను, ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆరుగురు ఐపీఎస్‌లను డిప్యుటేషన్ల మీద తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.