పీఆర్‌పై నిఘా
రోడ్ల పనుల్లో నిర్లక్ష్యం, నాణ్యతపై ఆరోపణలు
ఉన్నతాధికారులు సమీక్షించినా మారని తీరు..
ఇంజనీరింగ్ శాఖపై ఏసీబీ నజర్
సర్వత్రా కొనసాగుతున్న చర్చ
వరంగల్ : ప్రజల అవసరాలను తీర్చే రోడ్ల నిర్మాణంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం పనితీరుపై ప్రభుత్వం అసంతృప్తితో ఉంది. స్వయంగా ఇంజనీర్ ఇన్ చీఫ్ వచ్చి సమీక్షించినా ఆ శాఖ అధికారుల తీరులో మార్పు రాలేదు. దీంతో ఉన్నతస్థాయిలో ఈ విభాగంపై నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. ఆ శాఖలో జరుగుతున్న పనుల జాప్యం, నాణ్యత లేమిపై విజిలెన్స్ విభాగం దృష్టి పెట్టినట్లు సమాచారం. రోడ్ల నిర్మాణంలో నాణ్యత పాటించకపోవడం, పూర్తికాని పనులకు బిల్లులు చెల్లించడం వంటి విషయాలపై అవినీతి నిరోధక శాఖ సైతం ఆరా తీస్తోంది. ఇంజనీరింగ్ విభాగంలోని కార్యకలాపాలపై ప్రభుత్వ నిఘా విభాగం, అవినీతి నిరోధక శాఖ దృష్టి పెట్టడంతో ఆ శాఖ అధికారుల్లో ఇదే చర్చ జరుగుతోంది. అరుుతే రోడ్ల నిర్మాణ పనుల విషయంలో మాత్రం అధికారుల్లో మార్పు కనిపించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు జనవరి 5న జిల్లా అభివృద్ధిపై ఉన్నతాధికారులతో నగరంలోని నందన గార్డెన్స్‌లో సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల ఎంపిక, ప్రారంభించిన పనులు పూర్తి చేయడంలో ఈ శాఖ అధికారుల తీరును సమావేశంలో తప్పుపట్టారు. మేడారం జాతర ఏర్పాట్ల ప్రక్రియలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఊరట్టం-మల్యాల రోడ్డు నిర్మా ణ పనులు చేపట్టకపోవడంపై ముఖ్యమంత్రి కేసీఆర్.. పంచాయతీరాజ్ ఎస్‌ఈ సత్తయ్య పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే ఈ రోడ్డును పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించిన తర్వాత సైతం జిల్లాలోని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభా గం పనితీరులో మార్పు కనిపించడం లేదు. ఇంజనీర్ ఇన్ చీఫ్ వచ్చి ఆదేశాలు ఇచ్చినా కదలిక ఉండడం లేదు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో రోడ్ల నిర్మాణం, పాత రోడ్ల పునరుద్ధరణ(రెన్యూవల్) చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు రూ.416 కోట్లు మంజూరు చేసింది. మేడారంలో రోడ్ల పనుల కోసం మరో రూ.12.15 కోట్లను విడుదల చేసింది.
రూ.230.35 కోట్లతో 1676.37 కిలోమీటర్ల పొడవైన బీటీ రోడ్లను పునరుద్ధరించాలని నిర్ణయించింది. జిల్లాలో కొత్తగా 396.83 కిలో మీటర్ల మట్టి రోడ్లను బీటీగా అభివృద్ధి చేసేందుకు రూ.185.71 కోట్లను విడుదల చేసింది. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో రోడ్ల పనులు పూర్తి చేయడంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. చేపట్టిన కొన్ని పనుల్లోనూ నాణ్యత లేకపోవడంపై విమర్శలు వస్తున్నా ఈ శాఖ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం ఆరోపణలకు తావిస్తోంది.