జోరుగా వానలు | Rains in Khammam and Warangal districts | Sakshi
Sakshi News home page

జోరుగా వానలు

Published Sun, Jun 21 2015 2:01 AM | Last Updated on Sun, Sep 3 2017 4:04 AM

Rains in Khammam and Warangal districts

రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు..
 ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో
 పొంగిన వాగులు
 ఖమ్మం జిల్లా దమ్మపేటలో 15 సెం.మీ.ల    అత్యధిక వర్షపాతం నమోదు
 భద్రాచలం ఏజెన్సీలో
 నీటమునిగిన 40 గిరిజన గ్రామాలు
 మరో 2 రోజుల్లో తెలంగాణ,
 ఏపీలకు భారీ వర్ష సూచన

 
 సాక్షి, నెట్‌వర్క్: వాయవ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల మధ్య ఏర్పడిన అల్పపీడనం శనివారం వాయుగుండంగా మారడం దానికి నైరుతి రుతుపవనాల ప్రభావం తోడవడంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఖమ్మం, వరంగల్ జిల్లాలను వర్షాలు ముంచెత్తగా... ఆదిలాబాద్, కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.
 
 ఖమ్మం జిల్లాలో అత్యధిక వర్షపాతం
 ఖమ్మం జిల్లావ్యాప్తంగా శనివారం సగటున 6 సెం.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా దమ్మపేటలో 15 సెం.మీ వర్షం కురిసింది. భద్రాచలంలో 24 వ్యవధిలో 17.6 సెం.మీల వర్షపాతం నమోదైంది. ఏజెన్సీలో సుమారు 40 గిరిజన గ్రామాలు నీటమునిగాయి. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం శనివారం సాయంత్రానికి 25 అడుగులకు చేరింది. బూర్గంపాడు మండలంలో సుమారు 20 చెరువులకు గండ్లు పడ్డారుు. వరంగల్ జిల్లావ్యాప్తంగా సగటున 10.2 మి.మీ. వర్షపాతం నమోదైంది.
 
  జిల్లాలోని ఏటూరునాగారం, మంగపేట, ములుగు, తాడ్వాయి మండలాల్లోని వాగులు ఉప్పొంగడంతో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నారుు. కరీంనగర్ జిల్లాలో శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు జిల్లా సగటున 8.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహాముత్తారం, మహదేవపూర్, మల్హర్, కాటారం మండలాల్లోని వాగులు, వంకలు ఉప్పొంగాయి. నల్లగొండ జిల్లావ్యాప్తంగా 38 మండలాల్లో వర్షం కురిసింది. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం ఉదయం 8 గంటల వ రకు జిల్లావ్యాప్తంగా సగటు వర్షపాతం 3.7 మి.మీలుగా న మోదైంది. ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా సగటున 10.4 మి.మీ వర్షపాతం నమోదైంది.
 
 బొగ్గు ఉత్పత్తికి వర్షం బ్రేక్: సింగరేణి ఓపెన్‌కాస్ట్‌ల్లో భారీగా వరదనీరు చేరడంతో సుమారు 60 వేల టన్నుల ఉత్పత్తికి అంతరాయం కలిగింది. ఖమ్మం జిల్లా కొత్తగూడెం ఏరియాలోని గౌతంఖని ఓపెన్‌కాస్టు వద్ద 9.8 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. సత్తుపల్లి జేవీఆర్ ఓసీపీ వద్ద 8.6 సెం.మీ, కోయగూడెం ఓపెన్‌కాస్టు వద్ద 3.9  సెం.మీ, ఇల్లెందు జేకే-5 ఓసీపీ వద్ద ఆదిలాబాద్ జిల్లా మందమర్రి ఓపెన్‌కాస్టుల వద్ద 2.6  సెం.మీ, కరీంనగర్ జిల్లా రామగుండం ఓసీపీ-1 వద్ద 3 సెం.మీ, రామగుండం ఓసీపీ-2 వద్ద 2.5 సెం.మీ వర్షపాతం నమోదైంది.
 
 288 మండలాల్లో అధిక వర్షపాతం
 రాష్ట్రంలో వ్యవసాయ సీజన్ ప్రారంభమైన ఈ నెల ఒకటి  నుంచి 20 వరకు సాధారణం కంటే 96 శాతం అధిక వర్షపాతం నమోదైంది. మహబూబ్‌నగర్ జిల్లాను మినహాయిస్తే మిగిలిన అన్ని జిల్లాల్లో మంచి వర్షాలు కురిశాయి. ఖమ్మం జిల్లాలోనైతే 264 శాతం అధికంగా నమోదైంది. రాష్ట్రంలో 459 మండలాలకుగాను 288 మండలాల్లో అధిక వర్షం కురిసింది. 96 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. 61 మండలాల్లో వర్షపాతం లోటు ఉండగా, 14 మండలాల్లో మాత్రం తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఇందులో అధికంగా మహబూబ్‌నగర్ జిల్లాలోని 8 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి.
 
 వరద బాధితులకు 24 గంటల్లోనే పరిహారం: హరీశ్
 వర్షాలకు నష్టపోయిన బాధితులకు 24 గంటల్లోనే పరిహారాన్ని అందిస్తున్నామని, ఏ ప్రభుత్వం చేయని తరహాలో తమ ప్రభుత్వం పనిచేస్తున్నదని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఇది ఒక రికార్డు అన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా సిద్దిపేట మండలం, పట్టణంలో కురిసిన వర్షానికి నష్టపోయిన బాధితులకు శనివారం రాత్రి సిద్దిపేటలో జరిగిన కార్యక్రమంలో రూ. 3,200 చొప్పున రూ. 48 వేల పంపిణీ చేశారు.
 
 తెలంగాణ, ఏపీలో  మరో రెండు రోజుల్లో భారీ వర్షాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో మరో రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో మరో 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని  తెలిపింది. ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వచ్చే 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.  వాయవ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల మధ్య ఏర్పడిన అల్పపీడనం శనివారం ఉదయం వాయుగుండంగా మారింది. రాత్రికి ఒడిశాలోని పూరీకి దక్షిణంగా 150 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది వాయవ్య దిశగా పయనించి గోపాల్‌పూర్-పూరీల మధ్య ఆదివారం ఉదయానికి తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement