పడావుగా రీజనల్ సైన్స్ సెంటర్
రాష్ట్రంలోనే ఏకైక కేంద్రం దుస్థితి
నిర్మాణం పూర్తయినా తెరుచుకోని వైనం
{పతినెల నిర్వహణకే రూ.లక్ష
రెండేళ్లుగా పట్టించుకోని యంత్రాంగం
వరంగల్ : శాస్త్ర, సాంకేతిక అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రాంతీయ సైన్స్ సెంటర్ తెరుచుకోవడంలేదు. రెండేళ్ల క్రితమే నిర్మాణం పూర్తయినా.. రాష్ట్రంలోని ఏకైక సెంటర్ ఎప్పటికి అందుబాటులోకి వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. రూ.3.85 కోట్లతో శాస్త్ర సాంకేతిక శాఖ నిర్మించిన ఈ సైన్స్ సెంటర్ సందర్శకులు అడుగు పెట్టకుండానే.. మూత పడే పరిస్థితి నెలకొంది. సందర్శకులు వస్తే వసూలయ్యే ఫీజుతో నడిచే ఈ కేంద్రం నిర్వహణ కోసం వరంగల్ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) ప్రతి నెల రూ.లక్ష ఖర్చు చేయాల్సి వస్తోంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన అద్భుతమైన కట్టడం నిర్మాణ లక్ష్యం నెరవేరకుండా పోతోంది. తెలంగాణ రాష్ట్రంలోని ఏకైక సైన్స్ సెంటర్ ప్రారంభించాలనే ఆలోచన వరంగల్ జిల్లాలోని ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఎంత మాత్రం రాకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
పాతికేళ్ల కళ..
1986లో తిరుపతి, విజయవాడ, వరంగల్‌లో ప్రాంతీయ సైన్స్‌సెంటర్ల నిర్మించాలని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 1999లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ఈ సైన్స్ సెంటర్‌ల నిర్మాణం కోసం శిలాఫలం వేశారు. నిధులు మాత్రం కేటాయించలేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 2008లో ఈ సెంటర్ల నిర్మాణం కోసం రూ.5.87 కోట్లు కేటాయించారు. రెండేళ్ల క్రితం నిర్మాణం పూర్తయ్యింది. 2013 మార్చి నాటికి భవనంతోపాటు ఎగ్జిబిట్లను బిగించడం పూర్తయ్యింది. సైన్స్ సెంటర్ ప్రారంభానికి ముహూర్తం మాత్రం కుదరడం లేదు.
అందుబాటులో విజ్ఞానం
పాఠ్యపుస్తకాల్లోని క్లిష్టమైన అంశాలను విద్యార్థులకు సులువు గా తెలియజేసే లక్ష్యంతో సైన్స్ సెంటర్ నిర్మాణం జరిగింది. గణితం, భౌతిక, రసాయన, జీవశాస్త్రాలకు సంబంధించిన మౌలిక అంశాలపై పిల్లలకు అవగాహన కల్పించే ఎన్నో అంశాలు(ఎగ్జిబిట్లు) ఈ సైన్స్ సెంటర్‌లో ఉన్నాయి. మూడు అంతస్థుల భవనం గల సైన్స్ సెంటర్ ప్రాంగణంలో పార్కింగ్ మొదలు భవనంలో ప్రతీ అంతస్తులో వివిధ శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించిన ఎగ్జిబిట్లు ఏర్పాటు చేశారు. ఏడు విశాలమైన హాళ్లు ఉన్న ప్రధాన భవనంలో.. మొదటి రెండు హళ్లలో ఫిజికల్ సైన్స్ ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేశారు. మిగితా వాటిలో వరుసగా స్పేస్ సైన్స్, సోలార్ పవర్, 5డి థియేటర్, పర్యావరణ కాలుష్యం, మానవ శరీర నిర్మాణ శాస్త్రానికి సంబంధించిన నమూనాలు ఉన్నాయి. ఎడ్యుకేషన్ త్రూ సాటిలైట్ హాల్ కూడా ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక సాంకేతిక సంస్థల్లో జరిగే వైజ్ఞానిక సదస్సులను ఈ హాల్‌లో ప్రత్యక్షంగా చూసే వీలుంటుంది.
తెరవకుండానే తాళం!
Published Wed, Mar 4 2015 12:31 AM | Last Updated on Sat, Sep 2 2017 10:14 PM
Advertisement
Advertisement