విద్యుత్ బిల్లుల భారం.. రూ.2000కోట్లు
- గృహ వినియోగదారులకు మినహాయింపు
- పరిశ్రమలు, వాణిజ్య కేటగిరీలపై పడనున్న భారం
- పెంపు ప్రతిపాదనలను ధ్రువీకరించిన ప్రభుత్వ వర్గాలు
- చార్జీలు ఏప్రిల్ నుంచే అమల్లోకి వచ్చే అవకాశం
- 6,857 కోట్లు డిస్కంల ఆదాయ లోటు అంచనా
- 4,500 కోట్లకు పైగా ప్రభుత్వం ఇవ్వనున్న సబ్సిడీ
- మిగతా మొత్తం వినియోగదారులపైనే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెరగనున్నాయి. అటుఇటుగా రూ.2 వేల కోట్ల మేర భారం పడబోతోంది. 7 నుంచి 8 శాతం దాకా చార్జీలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఏప్రిల్ నుంచే ఈ పెంపు అమల్లోకి తెచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. అయితే గృహ వినియోగదారులను ఈ విద్యుత్ చార్జీల పెంపు నుంచి మినహాయించే అవకాశాలున్నాయి. నివాస కేటగిరీ వినియోగదారులపై చార్జీల భారానికి సీఎం కేసీఆర్ అయిష్టతతో ఉన్నట్లు సమాచారం. పరిశ్రమలు, వాణిజ్య కేటగిరీలపై పెంపు భారం పడనుంది.
సబ్సిడీ పెంచితే తగ్గనున్న భారం
2017–18కుగాను రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థల(డిస్కం) వార్షిక ఆదాయ అవసరాల అంచనా రూ.31,930 కోట్లు కాగా.. ప్రస్తుత చార్జీలతో రూ.6,857 కోట్ల లోటును ఎదుర్కోనున్నాయి. ఈ లోటును అధిగమించేందుకు డిస్కంల ముందు రెండే మార్గాలున్నాయి. ఒకటి.. ప్రభుత్వం డిస్కంలకు ఇచ్చే సబ్సిడీ మొత్తాన్ని పెంచడం. రెండు.. విద్యుత్ చార్జీల పెంపు. 2016–17లో రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు రూ.4,500 కోట్ల వరకు విద్యుత్ సబ్సిడీ మంజూరు చేయగా.. 2017–18లో రూ.4,500 కోట్లకు పైనే ఇచ్చే అవకాశాలున్నాయి.
దీంతో మిగతా లోటును అధిగమించేందుకు అటుఇటుగా రూ.2 వేల కోట్ల మేర చార్జీల పెంపును ప్రతిపాదించనున్నామని ఉన్నతస్థాయి అధికార వర్గాలు ధ్రువీకరించాయి. విద్యుత్ చార్జీల పెంపు వినియోగదారులకు భారంగా మారకుండా ఉండేందుకు సబ్సిడీ పెంచాలని డిస్కంలు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. వ్యవసాయ విద్యుత్ సరఫరాను 6 నుంచి 9 గంటలకు పెంచిన నేపథ్యంలో విద్యుత్ సబ్సిడీని రూ.4,500 కోట్ల నుంచి రూ.8,000 కోట్లకు పెంచాలని కోరాయి. అయితే ఈ విజ్ఞప్తిని ఆర్థిక శాఖ తోసిపుచ్చినట్లు సమాచారం. రాష్ట్ర బడ్జెట్లో విద్యుత్ సబ్సిడీని రూ.5 వేల కోట్లకు మించి కేటాయించలేమని తేల్చిచెప్పినట్లు తెలిసింది.
ఏప్రిల్ నుంచే పెంపు...
నిబంధనల ప్రకారం డిస్కంలు ఏటా నవంబర్ చివరిలోగా... రానున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక(ఏఆర్‌ఆర్)తో పాటు విద్యుత్ టారిఫ్ పెంపు ప్రతిపాదనలను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ)కి సమర్పించాలి. కానీ 2017–18కు సంబంధించిన ఏఆర్‌ఆర్‌లను మాత్రమే గత నవంబర్ 30న డిస్కంలు ఈఆర్సీకి అందజేశాయి. విద్యుత్ టారిఫ్ పెంపు ప్రతిపాదనలను వాయిదా వేస్తూ వచ్చాయి. సాధారణంగా డిస్కంలు సమర్పించే టారిఫ్ పెంపు ప్రతిపాదనలపై ఈఆర్సీ వివిధ వర్గాల నుంచి అభ్యంతరాల స్వీకరించి, బహిరంగ విచారణ జరిపి కొత్త టారిఫ్ ఆర్డర్‌ను జారీ చేసేందుకు కనీసం రెండు నెలల సమయం తీసుకుంటుంది.
డిస్కంలు ఇంకా టారిఫ్ ప్రతిపాదనలను సమర్పించకపోవడంతో వచ్చే ఏప్రిల్(ఆర్థిక సంవత్సరం ప్రారంభం) నుంచి చార్జీల పెంపు సాధ్యం కాకపోవచ్చన్న చర్చ జరుగుతోంది. అయితే వచ్చే ఏప్రిల్ నుంచే విద్యుత్ చార్జీల పెంపు అమలు ఉంటుందని ట్రాన్స్‌కో ఉన్నతాధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. విద్యుత్ చార్జీల పెంపుపై సీఎంతో సంప్రదింపులకు అవకాశం లభించలేదని, ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన వాయిదా పడిన నేపథ్యంలో ఒకట్రెండు రోజుల్లో ఆయనతో చర్చించి చార్జీల పెంపు ప్రతిపాదనలను ఈఆర్సీకి సమర్పిస్తామని తెలిపాయి.
సీఎంతో ఇంకా చర్చించ లేదు: డి.ప్రభాకర్ రావు, తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ
విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను ముఖ్యమంత్రి మూడుసార్లు తిరస్కరించి తిప్పి పంపారని కొన్ని పత్రికల్లో వచ్చింది అవాస్తవం. ఇంతవరకు ఈ విషయంపై సీఎంతో చర్చించనే లేదు. చార్జీల పెంపు అవసరాలపై ఒకట్రెండు రోజుల్లో సీఎంతో చర్చించి ఈఆర్సీకి కొత్త టారిఫ్ సమర్పిస్తాం. గృహాలకు చార్జీల పెంపుపై సీఎం అయిష్టత వ్యక్తం చేయవచ్చు. ఆదాయ లోటు పూడ్చుకునేందుకు కొంత మేర చార్జీలు పెంచక తప్పదు. ఎవరిపై ఎక్కువ భారం లేకుండా చార్జీల పెంపును అమలు చేసేందుకు ప్రయత్నిస్తాం.