మొయినాబాద్ (రంగారెడ్డి): వర్షాభావ పరిస్థితులతో వేసిన పంటలు ఎండిపోతున్నాయి.. అష్టకష్టాలు పడి పండించిన పంటలకు మార్కెట్‌లో గిట్టుబాటు ధరల్లేవు.. చేసిన అప్పులు పెరిగిపోయి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ప్రభుత్వం మాత్రం రుణమాఫీ చేశామని గొప్పలు చెప్పుకుంటోందని మాజీ హోంమంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మండల పరిధిలోని అమ్డాపూర్‌లో అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడిన కౌలురైతు నేదునూరు గణేష్‌రెడ్డి కుటుంబ సభ్యులను సోమవారం ఆమె పరామర్శించారు. మృతుడి తల్లిదండ్రులు రాములమ్మ, జంగారెడ్డి, భార్య వరలక్ష్మిలతో మాట్లాడి జరిగిన ఘటనా వివరాలు తెలుసుకున్నారు. జరిగిన నష్టాన్ని పూడ్చలేమని.. ఆత్మస్తైర్యంతో ముందుకు సాగాలని సూచించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీలో సరైన స్పష్టత లేదన్నారు. రైతులు పండించిన పూలు, కూరగాయలను మార్కెట్‌లో విక్రయించేందుకు వెళ్తే సరైన మద్దతు ధర రావడం లేదన్నారు. మార్కెట్‌లో జరిగే అవినీతి, అక్రమాలపై పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం రైతు సమస్యలను పట్టించుకోవడం వల్ల అప్పులు ఎక్కువై రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారన్నారు. కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారిందన్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలపై త్వరలోనే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని పేర్కొన్నారు.
'రుణమాఫీ చేశామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది'
Published Mon, Aug 31 2015 8:52 PM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM
Advertisement