అందరికీ అండగా హాక్‌-ఐ | Special Story On Hawk Eye Application | Sakshi
Sakshi News home page

అందరికీ అండగా హాక్‌-ఐ

Published Mon, Sep 16 2019 11:47 AM | Last Updated on Mon, Sep 16 2019 12:05 PM

Special Story On Hawk Eye Application - Sakshi

హాక్‌–ఐ యాప్‌

సాక్షి, మంచిర్యాల: ఎప్పుడైనా.. ఎక్కడైన ఏదైనా సంఘటన జరిగితే వెంటనే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలంటే భయపడుతున్నారా..? నేరం ఏదైనా చేసిన వారు ఎవరైనా సరే.. చివరికి పోలీస్‌ అధికారైనా పర్వాలేదు. ఒంటరిగా టాక్సీ లేదా ఆటోలో ప్రయాణం చేస్తున్నారా...? అయితే ప్రతి సమస్యనుంచి మీకు తక్షణ రక్షణ చర్యలు, సమస్యలకు పరిష్కారం, వీటన్నింటికి సమాదానం చెప్పేందుకు హాక్‌–ఐ అందరికి అండగా ఉండనుంది. ఎలాంటి సంఘటన చోటుచేసుకున్న వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే చాలు ఉన్నచోట నుంచే పోలీసులకు సమాచారం అందించవచ్చు. రహస్యమైన ఫిర్యాదులు గోప్యంగా ఉంచబడుతాయి.. అయితే హాక్‌–ఐ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోండి... దీని పనితీరు, ఉపయోగాలు తదితర అంశాలపై  ప్రత్యేక కథనం...

నేరాలను అరికట్టేందుకు...
నేరరహిత తెలంగాణ రాష్ట్రం సాధించేందుకు తెలంగాణ పోలీస్‌శాఖ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఇప్పటికే పోలీస్‌ శాఖ దూసుకువెళ్తోంది.  హాక్‌–ఐ యాప్‌ ఇప్పటికే రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా సేవలు అందిస్తోంది. రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 2017 ఫిబ్రవరి 28 అప్పటి కమిషనర్‌ విక్రమ్‌ జిత్‌ దుగ్గల్‌ కమిషనరేట్‌ పరిధిలోని మంచిర్యాల, పెద్దపెల్లి జిల్లాలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. నాటి ప్రారంభంలో కొంత అక్కడక్కడ అవగాహన సదస్సులు నిర్వహించారు. నేటికి పూర్తి స్థాయిలో ప్రజలకు అవగాహన రాకపోవడం గమనార్హం. ప్రజల భద్రతే పోలీసుల లక్ష్యం అంటు సాంకేతిక పరిజ్ఞానంతో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలాజీని ఉపయోగించి కొత్తకొత్త యాప్‌లను ఉపయోగిస్తూ ఫ్రెండ్లీ పోలీస్‌ విధానంతో ప్రజలకు దగ్గరవుతోంది.

హాక్‌ – ఐ యాప్‌ను స్మార్ట్‌ ఫోన్లో ఇన్‌స్టాల్‌ చేసుకున్న వారు ఏ రాష్ట్రంలో, ఏ ప్రాంతంలో ఉన్నా  అత్యవసర సమయాల్లో పోలీస్‌ సాయం కోసం ఏర్పాటు చేసిన పర్చువల్‌ బటన్‌ ‘ఎస్‌వోఎస్‌’ ప్రెస్‌ చేస్తే చాలు పోలీసులు స్పందిస్తారు. ఈ బటన్‌ ద్వారా లొకేషన్‌ తెలుసుకునే సౌకర్యం ఉండటంతో బాధితుల ఆచూకీ గుర్తించి ఆయా ప్రాంతాలకు చెందిన స్థానిక పోలీసులను అప్రమత్తం చేసేందుకు అవకాశముంది. ఈ తరహాలో ఇప్పటి వరకు రామగుండం పోలీస్‌ కమిషనర్‌ పరిధిలో సుమారు 20కాల్స్‌కు పోలీసులు స్పందించారు. హాక్‌– ఐ ఫిర్యాదుల పర్యవేక్షణకు కమిషనరేట్‌లో 24గంటలు పని చేసేలా సిబ్బందిని ఏర్పాటు చేశారు.

ఆపన్న హస్తం....
రామగుండం పోలీస్‌ కమి షనరేట్‌ పరిధిలో దాదాపు 20వేల మంది ఈ యాప్‌ ను డౌన్‌లోడ్‌ చేసుకున్నా రు. ఈ యాప్‌ ద్వారా ట్రా ఫిక్‌ ఉల్లంఘనలు మొదలుకుని ఇతర నేరాల వరకు ఉన్న చోటు నుంచే ఫిర్యాదు చేయవచ్చు. ఆపదలో ఉన్నప్పుడు అత్యవసరమైనప్పుడు పోలీసుల నుంచి సాయం సైతం పొందేందుకు ఉపయుక్తంగా ఉండేలా డిజైన్‌ చేశారు. పోలీసింగ్‌ను మెరుగుపరిచేందుకు అవసరమైన సలహాలు సూచనలను సైతం ప్రజలు ఈయాప్‌ ద్వారా చేసే అవకాశం ఉంది.

తక్షణ సాయం కోసం...
పోలీస్‌ మొబైల్‌ యాప్‌ హాక్‌–ఐలోని వివిధ ఆప్షన్స్‌లో ఎస్‌ఓఎస్‌ కీలకమైనది. అత్యవసర సమయంలో ఫోన్‌చేసి పూర్తిస్థాయి సందేశం పంపేందుకు అవకాశం లేనప్పుడు మీటా నొక్కడం ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఉపయోగించే పర్చువల్‌ ఎమర్జెన్సీ బటన్‌ ఇది. ఈ అప్షన్‌లోకి ప్రవేశించిన తర్వాత వినియోగదారులు తమ పేరు, ఫోన్‌ నంబర్‌ ఎంటర్‌ చేయాలి. అత్యవసర సమయాల్లో ఎవరిని సంప్రదించాలని భవిస్తున్నారో వారి నంబర్లు సైతం పొందుపరుచాలి. గరిష్టంగా ఐదుగురికి చెందిన సెల్‌ఫోన్‌ నంబర్లు ఎంటర్‌ చేసుకునే అవకాశముంది. ఇందులో ఒక్కసారి రిజిష్టర్‌ చేసుకుని, సంబంధికుల నంబర్లు పొందుపరిస్తే చాలు. ఆపై అత్యవసర సమయాల్లో ఎస్‌వోఎస్‌ బటన్‌ నొక్కితే సరిపోతుంది.  ఎలాంటి నేరాలైనా యాప్‌తో తెలుపవచ్చు. 

ఎక్కడున్నా సరే...
ఈ యాప్‌ పూర్తి జీపీఎస్‌ పరిజ్ఞానంతో అనుసందానమై ఉన్న ఈ యాప్‌లో ఎస్‌వోఎస్‌ బటన్‌ నొక్కితే వారు ఏ ప్రాంతంలో ఉన్నారనే విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉంది. ఎస్‌వోఎస్‌ నొక్కిన వెంటనే వీటిపై మ్యాప్‌లో బాధితుడు ఏ ప్రాంతంలో ఉన్నారనేది హాక్‌–ఐ మార్క్‌లోనే కనిపించడంతో పాటు ప్రత్యేక సైరన్‌ వస్తుంది. దేశంలో ఎక్కడున్నా ఈ విషయాన్ని గుర్తించే ఆస్కారముంది. ఎస్‌వోఎస్‌ నొక్కిన తర్వాత బాధితుడు ఎటూ సంచరించినా.. ఫిర్యాదు క్లోజ్‌ అయ్యే వరకు కమిషనరేట్‌ కంట్రోల్‌ రూంలో ఏర్పాటు చేసిన స్క్రీన్‌పై ఆ వివరాలు కనిపిస్తాయి. హాక్‌–ఐ మార్క్‌ను క్లిక్‌ చేస్తే బాధితుల పేరు, ఫోన్‌నంబర్‌ డిస్‌ప్లే అవుతాయి. 

ముందుగా సంప్రదించేందుకు ప్రయత్నిస్తారు..
హాక్‌–ఐ ద్వారా అత్యవసర కాల్‌ ఎస్‌వోఎస్‌ ద్వారా సమాచారం వచ్చిన వెంటనే పోలీసులు ప్రాథమికంగా బాధితులు ఎక్కడ ఉన్నారో గుర్తిస్తారు. ఆపై ఫోన్‌ చేయడం, పూర్తి సందేశం పంపడం ద్వారా వారిని సంప్రదించే ప్రయత్నం చేస్తారు. గరిష్టంగా రెండు నిమిషాలు వేచి చూసి ఈ రెండింటికీ బాధితుల నుంచి స్పందన రాని పక్షంలో బాధితులు ఇబ్బందుల్లో ఉన్నట్లు నిర్ధారిస్తారు. రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోకి వచ్చే కేసు అయితే పోలీస్‌ స్టేషన్లతో సంబంధం లేకుండా సమీపంలో విధులు నిర్వహిస్తున్న రక్షక్, బ్లూకోట్స్‌ సిబ్బందిని బాధితులు ఉన్న ప్రదేశానికి పంపిస్తూ పూర్తి వివరాలు అందిస్తారు. బాధితులు ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్‌లైతే అక్కడి పోలీసులను అప్రమత్తం చేస్తూ సమాచారం చేరవేస్తారు. ఇప్పటి వరకు కమిషనరేట్‌లో 10అత్యవసర కాల్స్‌ను అటెండ్‌ చేశారు.

ఉద్యోగులు, కిరాయిదారుల వివరాల కోసం
ఎవరైన డ్రైవర్‌గా పనిలో పెట్టుకున్న, ఇంట్లో ఎవరికైన ఇళ్లు కిరాయికి ఇచ్చిన... ఉద్యోగంలో చేర్చుకున్న.. ఈ యాప్‌ ఎంతో ఉపయోగపడుతోంది. ఇందులో ఎవరైన నేరం చేసి పారిపోయినప్పుడు వారి పూర్తి సమాచారం కావాలంటే కష్టం అవుతోంది. వీరి వివరాలు పోలీసులకు తెలియజేస్తూ వాళ్ల వివరాలు అన్ని పోలీస్‌స్టేషన్లలోని సర్వర్‌లో వారి ఫొటోలు నిక్షిప్తం చేయబడి ఉంటాయి. నేరం చేసి తప్పించుకుని పోతే ఈ యాప్‌ ద్వారా సులభంగా పట్టుకునే అవకాశం ఉంది.

టాక్సీ ప్రయాణంలో...
మహిళలు టాక్సీలో ఆటోలో గాని ప్రయాణం చేస్తూ వాహనం నంబర్, వాహన వీడియో లేదా ఫొటో తీయాలి,  వాహనం నంబర్‌ వెళ్తున్న ప్రదేశం పేరు.  వెళ్లాల్సిన ప్రదేశం పేరు రాసుకుని ఈ హాక్‌–ఐ యాప్‌ ద్వారా పంపించాలి. ప్రయాణం చేస్తున్న వాహనం పూర్తిగా పోలీసుల ఆధీనంలో ఉంటుంది. చేరాల్సిన గమ్యం చేరకుండా వేరేచోటికి మళ్లించినట్లు తెలిస్తే వెంటనే పోలీసులు అప్రమత్తమై పట్టుకునే విధంగా యాప్‌ను డిజైన్‌ చేశారు.

యాప్‌ ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి...
ఆండ్రాయిడ్‌ మొబైల్‌ వినియోగించే వారు గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి ఐఓఎస్‌ నుంచి హాక్‌–ఐ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని యాప్‌ని ఓపెన్‌ చేయాగానే రిపోర్ట్‌ స్టేషన్‌ టూ పోలీస్, ఉమెన్‌ ట్రావెల్‌ మూడ్‌ సేఫ్, రిజిష్టర్‌ డిటెయిల్స్‌ ఆఫ్‌ సర్వెంట్, వర్కర్, టెనెంట్,  ఎస్‌ఓఎస్, ఎమర్జెన్సీ పోలీస్‌ కాంట్రాక్ట్, కమ్యూనిటీ పోలీసింగ్‌ అని స్క్రీన్‌ మీద కనిపిస్తాయి. ఇక్కడ ఆప్షన్‌లు వస్తాయి.

ఆప్షన్ల గురించి వివరాలు...
ఆప్షన్‌– 1 లో మూడు కేటగిరీలు ఉంటాయి.  ఇందులో సెలెక్ట్‌ కేటగిరిలో ట్రాఫిక్‌ మంచిర్యాలలో జరిగిన నేరం మహిళలపై జరుగుతున్న వేధింపులు, పోలీసులు చేసే ఉల్లంఘనలు, ఉత్తమ పోలీసింగ్‌ సలహాలు తీసుకోవడానికి ఆప్షన్లు పొందుపరిచారు.
ఆప్షన్‌–2 ఇందులో ఫొటో లేదా వీడియో సేవ్‌ సదుపాయం, ప్లేస్‌ ఆప్‌ బోర్డింగ్‌ అని ఉంటుంది. బాధితులు ఎక్కడ ఉన్నారో పక్కనే ఉన్న బాక్స్‌లో స్పష్టంగా టైప్‌ చేయాలి. ఇది పూర్తిగా మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన అప్షన్‌
ఆప్షన్‌ – 3, ఇందులో ఇంట్లో అద్దెకు దిగినవారు, పని మనుషులు, ఎలక్ట్రికల్‌ బోర్డ్‌ రిపేర్లు చేసే వారి సమాచారాన్ని సేకరించడానికి దీనిని ఏర్పాటు చేశారు. 
ఆప్షన్‌– 4, ఎస్‌ఓఎస్‌ అంటే సేవ్‌ అవర్‌ సెల్ప్‌ ఇది కూడా మ హిళ భద్రతను దృష్టిలో ఉంచుకుని తయారు చేశారు. ఇందులో సెల్‌నంబర్, పేరు, ఎలాంటి ఆపాద పొంచి ఉందో నమోదు చేయాలి.
ఆప్షన్‌– 5, ఇందులో రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధి లోని మంచిర్యాల, పెద్దపెల్లి జిల్లాల పోలీస్‌స్టేషన్ల నంబర్‌తో పాటు పెట్రోలింగ్‌ వాహనంలో ఉంటే వారి నంబర్లు స్టేషన్‌ నంబర్, స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్‌ నంబర్, ఏసీపీ, నంబర్‌పేరు, డీసీపీ నంబర్‌ పేరు కంట్రోల్‌ నంబర్లు పొందుపరిచారు.
ఆప్షన్‌– 6,  కమ్యూనిటీ పోలీసింగ్‌లో చేరాలనుకునే వారి కోసం ఈ అప్షన తయారు చేశారు. పేరు మొబైల్‌ నంబర్, ఈ– మెయిల్‌ ఐడీ, చిరునామ పొందుపరిచారు. సంబంధిత పోలీస్‌స్టేషన్‌ పేరు నమోదు చేయాలి. 
ఆప్షన్‌– 7, వివిధ ఆప్షన్ల ద్వారా పోలీసులు చేసిన ఫిర్యాదు ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు వీలుగా ఉండే అప్షన్‌ ఇది. ఒక ఫిర్యాదు పంపిణీ తర్వాత దాని ఐడీ నంబర్‌ తెలుస్తోంది. ఫిర్యాదు పరిష్కారం కాకపోతే అది పెండింగ్‌ అని చెబుతుంది.
ఆప్షన్‌ – 8, ఈ ఆప్షన్‌లో యాప్‌లో రిజిష్టరైన తర్వాత మళ్లీ ఏదైనా మార్పులు చేసుకునే విధంగా ఉపయోగపడుతోంది.

యాప్‌ ఇలా పని చేస్తుంది...
యూజర్‌ పంపించే సమాచారాన్ని తక్షణం స్థానిక పోలీసులకు షీ టీమ్స్, పెట్రోలింగ్, వాహనాలకు అందించడం ప్రత్యేకత వివరాలు అందగానే సిబ్బంది తక్షణమే సంఘటన స్థలానికి చేరుకుని సమస్యలు వెంటనే పరిష్కరిస్తారు. రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పోలీసులతో ప్రజల భాగస్వామ్యం అవశ్యకత ప్రజల భద్రత కల్పించి నేర రహిత కమిషనరేట్‌గా మార్చేందుకు ఈ యాప్‌ ఎంతో ఉపయోగపడుతోంది. ప్రతి ఒక్కరూ ఈ హాక్‌–ఐ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని వ్యక్తిగత సమాచారం కాకుండా నేరాల గురించి తెలుసుకోవచ్చు. సమాజంలో అన్ని వర్గాల ప్రజల మధ్య సమన్వయం ఏర్పాటు చేయడానికి ఈ యాప్‌ ఎంతో ఉపయోగపడుతోంది. యాప్‌ ద్వారా సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచబడుతాయి. ఒక వేల ఎవరికైనా కావాలంటే స్టేషన్‌కు వెళ్లి సంతకం చేయాల్సి ఉంటుంది.

హాక్‌–ఐతో నేరాల నియంత్రణ 
హాక్‌– ఐ ద్వారా నేరాల నియంత్రన సాధ్యమవుతోంది. తెలంగాణ పోలీస్‌ ఇప్పటికే దేశంలో నంబర్‌ వన్‌ స్థానంలో ఉంది. హాక్‌–ఐ యాప్‌ను అన్ని వర్గాల ప్రజలు ఉపయోగించాలి. నేరా నియంత్రణకు సహకరించాలి. అందరు ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని దుర్వినియోగం కాకుండా సద్వినియోగం చేసుకోవాలి. ఎవరైన దుర్వినియోగం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతోంది.
– గౌస్‌బాబా, ఏసీపీ, మంచిర్యాల

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

హాక్‌–ఐ యాప్‌పై అవగాహన కల్పిస్తున్న పోలీసులు (ఫైల్‌)

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement