సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితులపై ఇకపై ప్రతి వారంలో ఒకరోజు రాష్ట్రస్థాయి అధికారుల నేతృత్వంలో ఆకస్మిక తనిఖీలు చేపడతామని పాఠశాల విద్య డెరైక్టర్ టి.చిరంజీవులు తెలిపారు. ఈనెల 14నుంచి ఈ తనిఖీలను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోనే ఉండి శాఖపరమైన నిర్ణయాలు తీసుకోవడం కాకుండా క్షేత్రస్థాయికి వెళ్లి పరిస్థితులను స్వయంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా పాఠశాల విద్యను పక్కాగా గాడిలో పెట్టడం సాధ్యం అవుతుందని వివరించారు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆదేశాలపై చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. ఇందులో భాగంగా ప్రతి శుక్రవారం విభాగాధిపతులు జిల్లాల్లో క్షేత్ర స్థాయి పర్యటనలు చేపడతారన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు, బోధన స్థితి గతులు, మధ్యాహ్నం భోజనం పరిస్థితి, విద్యా కార్యక్రమాల అమలు తదితర అంశాలన్నింటిపై పరిశీలన జరుపుతారన్నారు.