అవిశ్వాసానికి మద్దతుగా చేతులు పైకెత్తిన సభ్యులు
బెల్లంపల్లి : బెల్లంపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ పసుల సునీతారాణిపై ప్రతి పాదించిన అవిశ్వాసం నెగ్గింది. ఎంతో ఉత్కంఠ రేపిన అవిశ్వాస తీర్మానాన్ని సభ్యులు ఏకపక్షంగా ఆమోదించి సునీతారాణిని గద్దె దింపారు. గురువారం అవిశ్వాసంపై బెల్లంపల్లి మున్సిపాలిటీలో ప్రిసైడింగ్ అధికారిగా బెల్లంపల్లి సబ్ కలెక్టర్ పీఎస్.రాహుల్‌రాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశం ఉదయం సరిగ్గా 11 గంటలకు ప్రారంభమైంది.
35 రోజులుగా రహస్యంగా నిర్వహించిన క్యాంపు నుంచి అసమ్మతి సభ్యులు ప్రత్యేక బస్సులో ఉదయం 10:36 గంటలకు చేరుకున్నారు. వీరి రాక సందర్భంగా మున్సిపల్ కార్యాలయం వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సభ్యులు మున్సిపల్ కార్యాలయం వరకు బస్సులో వచ్చారు. బస్సు దిగగానే సభ్యులను మెటల్ డిటెక్టర్‌తో పరిశీలించాక సమావేశ మందిరంలోకి పంపించారు. సమావేశం ఆరంభం కాగానే ప్రిసైడింగ్ అధికారి అవిశ్వాసంపై సభ్యులకు విఫులంగా విషదీకరించారు.
ముందస్తుగా సమావేశానికి హాజరైన సభ్యుల సంతకాలను హాజరు రిజిష్టర్‌లో తీసుకున్నారు. ఆ తర్వాత ఓటింగ్ నిర్వహించారు. చేతులు పైకెత్తే విధానంతో ఓటింగ్ జరిపారు. సమావేశానికి హాజరైన 32 మంది సభ్యులు ఏకపక్షంగా చేతులు పైకి ఎత్తి అవిశ్వాసానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. చైర్‌పర్సన్ సునీతారాణి, కిడ్నాప్‌కు గురైనట్లు చెబుతున్న 18 వార్డు కౌన్సెలర్ లింగంపల్లి రాములు ప్రత్యేక సమావేశానికి గైర్హాజరయ్యారు.
ఎక్స్‌అఫిషియో సభ్యుడైన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కూడా సమావేశానికి రాలేదు. కాగజ్‌నగర్‌లో మంత్రి కేటీఆర్ పర్యటన ఉండటంతో అక్కడికి వెళ్లారు. కాగా అవిశ్వాసాన్ని వ్యతిరేకించే సభ్యులు సమావేశంలో ఒక్కరు కూడా లేకుండా పోయారు. దీంతో సునీతారాణిపై అవిశ్వాసం నెగ్గినట్లు సబ్‌కలెక్టర్ రాహుల్‌రాజ్ ప్రకటించారు. నేటి నుంచి సునీతారాణి చైర్‌పర్సన్ పదవిని కోల్పోయారని ఆయన వెల్లడించడంతో సభ్యుల్లో ఒక్కసారిగా ఆనందం వెల్లివిరిసింది.
అవిశ్వాస సమావేశం జరిగిన తీరును పూర్తిగా వీడియో చిత్రీకరణ చేయించారు. ప్రత్యేకంగా ఫొటోలు తీయించారు. సునీతారాణిపై అవిశ్వాసం కోసం 29 మంది సభ్యులు జూన్ 23న అజ్ఞాతంగా క్యాంపునకు వెళ్లి పోగా, జూలై 5న జిల్లా జాయింట్ కలెక్టర్ సురేందర్‌రావుకు అవిశ్వాసం ప్రవేశపెట్టడానికి నోటీసు అందించారు. ఆ వెల్లువలోనే అప్పటి ఇన్‌చార్జి కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్ గురువారం అవిశ్వాసం కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటుకు ముహూర్తం ఖరారు చేసిన సంగతి తెలిసిందే.
కలెక్టర్‌కు నివేదిక
అవిశ్వాసం జరిగిన తీరుతెన్నులను సమగ్రంగా కలెక్టర్ కర్ణన్‌కు నివేదిక రూపంలో అందిస్తామని సమావేశం అనంతరం సబ్‌కలెక్టర్ రాహుల్‌రాజ్ విలేకరులకు తెలిపారు. ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలను అనుసరించి అవిశ్వాస సమావేశం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. సమావేశానికి 24 మంది సభ్యుల కోరం ఉండాల్సి ఉండగా 32 మంది హాజరయ్యారని తెలిపారు. కోరం నిండుగా ఉండటంతో అవిశ్వాస సమావేశం నిర్వహించామన్నారు.
కొత్తగా చైర్‌పర్సన్‌ను ఎన్నుకోవడానికి ఎన్నికల కమిషన్ తేదీ నిర్ణయిస్తుందన్నారు. తాము పంపిన నివేదికను కలెక్టర్ పరిశీలించి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు పంపుతారని వివరించారు. ఆ తదనంతరం ఎన్నికల కమిషన్ కొత్త చైర్‌పర్సన్ ఎన్నికకు మార్గం సుగమం చేస్తుందని తెలిపారు.
రాజీనామాపై అత్యవసర సమావేశం
అవిశ్వాసం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి ముందు బుధవారం చైర్‌పర్సన్ సునీతారాణి చేసిన రాజీనామాపై చర్చించడానికి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. మున్సిపల్ కమిషనర్ జి.రాజు అధ్యక్షతన అరగంట ముందుగా అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయగా సునీతారాణి మినహా ఇతర సభ్యులెవరు హాజరు కాలేదు. అత్యవసర సమావేశం నిర్వహించే సమయానికి ముందుగానే అసమ్మతి సభ్యులు 32 మంది మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నా ఆ సమావేశానికి ఏ ఒక్కరు హాజరు కాలేదు.
తామంతా అవిశ్వాసం కోసం ఏర్పాటు చేసే సమావేశంలో మాత్రమే పాల్గొంటామని స్పష్టం చేయడంతో సమావేశం జరగలేదు. దీంతో హాజరు రిజస్టరులో సునీతారాణి సంతకం తీసుకున్నారు. ఇతర సభ్యుల గైర్హాజరుతో అత్యవసర సమావేశం నిర్వహించలేకపోయారు. అంతటితో సునీతారాణి సమావేశం నుంచి భావోద్రేకంతో నిష్క్రమించి బయటకు వెళ్లిపోయారు. చైర్ పర్సన్ చేసిన రాజీనామాపై సమావేశంలో ఎలాంటి చర్చ జరగలేదు. ఆ తర్వాత ప్రత్యేక సమావేశం నిర్వహించగా మెజార్టీ సభ్యులు 32 మంది హాజరయ్యారు.
మళ్లీ క్యాంపునకే..
అవిశ్వాసం నెగ్గించుకున్నా మళ్లీ చైర్‌పర్సన్‌ను ఎన్నుకునేంత వరకు రహస్యంగా నిర్వహిస్తున్న క్యాంపునకు సభ్యులు వెళ్లిపోయారు. అవిశ్వాస ఘట్టం ముగిసిన వెంటనే సభ్యులు నేరుగా 21వార్డు కౌన్సిలర్ మునిమంద స్వరూప ఇంటికి వెళ్లారు. అప్పటికే అక్కడ వంటలు చేయించారు. భోజనం చేసిన తర్వాత ప్రత్యేకంగా తీసుకొచ్చిన బస్సులో ఎక్కి సభ్యులు క్యాంపునకు బయలు దేరారు. కాగా క్యాంపునకు నాయకత్వం వహిస్తున్న మునిమంద స్వరూపను నూతన చైర్ పర్సన్‌గా ఎన్నుకోవడానికి సభ్యులు సంసిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఏదేమైనా నెల రోజులకు పైబడి సాగిన రహస్య క్యాంపు నుంచి సభ్యులు ప్రత్యేక సమావేశానికి హాజరుకావడం, ఆ తదుపరి అవిశ్వాసం నెగ్గడం చకచకా జరిగిపోయాయి. ఈ పరిణామాలు పుర ప్రజలను ఆలోచనల్లో పడేశాయి.
Comments
Please login to add a commentAdd a comment