టార్గెట్ ఏపీ! | Suryapet assaults to target Andhra pradesh | Sakshi
Sakshi News home page

టార్గెట్ ఏపీ!

Published Sun, Apr 5 2015 3:30 AM | Last Updated on Sat, Sep 2 2017 11:51 PM

టార్గెట్ ఏపీ!

టార్గెట్ ఏపీ!

‘సూర్యాపేట ముష్కరులు’ వెళ్లాల్సింది విజయవాడకు
మిస్టరీగా మారిన మరోనలుగురు ముష్కరుల జాడ
రాష్ట్రంలోకి ప్రవేశించి ఉంటారని అనుమానిస్తున్న ఇంటెలిజెన్స్
అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిక

 
 సాక్షి, హైదరాబాద్: నిషేధిత ‘స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)’ ఉగ్రవాదులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై గురిపెట్టారా? ఆర్థిక కార్యకలాపాలు బాగా పెరిగిన నేపథ్యంలో ఏపీలో ఏదైనా భారీ దోపిడీకో, విద్రోహ చర్యకో కుట్రపన్నారా? ఈ ప్రశ్నలకు నిఘా వర్గాలు అవుననే సమాధానమిస్తున్నాయి. నల్లగొండ జిల్లా సూర్యాపేట బస్టాండ్‌లో బుధవారం అర్ధరాత్రి పోలీసులపై కాల్పులకు తెగబడి.. శనివారం జానకిపురం ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన సిమి ఉగ్రవాదులు అస్లం అయూబ్, జకీర్‌ల ఉదంతాన్ని విశ్లేషించిన అధికారులు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే ముఠాకు చెందిన మరో నలుగురి జాడ తెలియకపోవడంతో... వారు ఇప్పటికే రాష్ట్రంలోకి ప్రవేశించి ఉంటారని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిందిగా అన్ని జిల్లాల ఎస్పీలు, సిటీ కమిషనర్లకు హెచ్చరికలు జారీచేశాయి.
 
 గమ్యం విజయవాడ..
 దాదాపు రెండేళ్లుగా పరారీలో ఉన్న సిమి ఉగ్రవాది అబు ఫైజల్ గ్యాంగ్‌లో సభ్యులుగా ఉన్న ఉత్తరప్రదేశ్ వాసులు అస్లాం, జకీర్ బుధవారం విజయవాడకు బయలుదేరారు. హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్ సమీపంలో తాండూరు డిపోకు చెందిన బస్సు ఎక్కిన వీరిద్దరూ విజయవాడకు టికెట్ కూడా తీసుకున్నారు. అయితే మార్గమధ్యలో సూర్యాపేట బస్టాండ్‌లో పోలీసులు బస్సును తనిఖీ చేయడం, కిందికి దిగిన ఉగ్రవాదులు కాల్పులు జరిపి పారిపోవడం జరిగింది. లేదంటే వారు నేరుగా విజయవాడకు చేరుకునే వారేనని నిఘావర్గాలు అంచనా వేస్తున్నాయి. సిమి కేసులను దర్యాప్తు చేస్తున్న అధికారులు సేకరించిన సమాచారం ప్రకారం.. ఈ ముఠాలో మొత్తం ఆరుగురు సభ్యులు ఉన్నారు. ఇద్దరు ఎన్‌కౌంటర్‌లో హతం కాగా.. మిగతా నలుగురు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టి ఉంటారని భావిస్తున్నారు.
 
 విడివిడిగా..
 అబు ఫైజల్ నేతృత్వంలో ఏడుగురు ఉగ్రవాదులు 2013లో మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జైలు నుంచి తప్పించుకున్నారు. ఇది జరిగిన రెండు నెలల్లోనే అబు ఫైజల్‌తో పాటు మరో ఉగ్రవాది పోలీసులకు దొరికారు. మిగతా ఐదుగురు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో సంచరిస్తూ నేరాలకు పాల్పడుతున్నారు. ఈ ముఠాలోకి గత ఏడాది మరో సభ్యుడు చేరినట్లు నిఘావర్గాలు గుర్తించాయి. పోలీసు, నిఘావర్గాల వేట ముమ్మరం కావడంతో.. వీరంతా విడివిడిగా నివసించడం, సంచరించడం వంటివి చేస్తున్నారు. కేవలం ‘ఆపరేషన్’ చేపట్టే ముందు ఎంపిక చేసుకున్న స్థలంలో మాత్రమే కలుస్తుంటారు. గత ఏడాది సెప్టెంబర్‌లో ఈ ఆరుగురు ఉగ్రవాదులు ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నూర్‌లో ఉన్నట్లు గుర్తించిన యూపీ యాంటీ టైస్ట్ స్క్వాడ్ దాడి చేసింది. ఆ సమయంలోనే వారు ముగ్గురు చొప్పున వేర్వేరు ఇళ్లలో ఉండటంతో ప్రతి దాడి చేసి తప్పించుకున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కీ ఆరుగురూ విడివిడిగా వెళుతున్నట్లు అనుమానిస్తున్నారు.
 
 నేరాలకా.. విద్రోహ చర్యలకా?
 ఈ ఉగ్రవాదులు నేరాలకు పాల్పడి డబ్బు సమకూర్చుకుంటూనే.. మరోవైపు విద్రోహక చర్యలకూ పాల్పడుతున్నారు. ప్రధానంగా దోపిడీలు, భారీ దొంగతనాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ ముఠా గత ఏడాది కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎస్‌బీఐలో భారీ దోపిడీ చేసింది. దేశంలోని మరికొన్ని చోట్ల కూడా ఇలాంటి నేరాలకు పాల్పడి... దోపిడీ చేసిన సొమ్మును వివిధ ఉగ్రవాద సంస్థలకు, ప్రస్తుతం జైళ్లలో ఉన్న ఉగ్రవాదుల కుటుంబాలకూ అందిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వారు ఇప్పుడు ఏపీలోకి అడుగుపెట్టడం దేనికోసమనే అంశంలో నిఘావర్గాలు లోతుగా ఆరా తీస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక లావాదేవీలు బాగా పెరగడంతో నేరాలు చేయడానికి వచ్చారా, లేక విద్రోహ దాడి కోణం ఉందా? అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హనుమాన్ జయంతికి రెండు రోజుల ముందు వారు మారణాయుధాలతో రాష్ట్రంలోకి ప్రవేశించే యత్నం చేయడంతో... ఏదైనా విద్రోహ చర్యకు కుట్ర పన్నారనే అంశాన్ని కొట్టిపారేయలేమని ఒక ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.
 
 వివరాలెలా తెలుస్తున్నాయి?
 ఈ ముఠా గత ఏడాది కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ఉన్న ఎస్‌బీఐని టార్గెట్ చేసింది. ఇప్పుడు అస్లాం, జకీర్ నల్లగొండ జిల్లా అర్వపల్లిలో ఉన్న ఖాజా నసీరుద్దీన్ బాబా దర్గాలో షెల్టర్ తీసుకున్నారు. ఈ రెండూ ప్రాంతాలు ప్రధాన రహదారికి దూరంగా ఉన్నవే. వీటికి తోడు జనవరిలో నెల్లూరు జిల్లా తడలోని మారుమూల ప్రాంతంలో ఈ ఉగ్రవాదుల కదలిక ఉన్నట్లు నిఘావర్గాలకు సమాచారం అందింది. ఇలా అంతగా ప్రాచుర్యం లేని ప్రాంతాల వివరాలు ఈ ఉగ్రవాదులకు ఎలా తెలుస్తున్నాయనేది నిఘావర్గాలకు అంతు చిక్కడం లేదు. బిజునూరు మాదిరిగా ఇతర ప్రాంతాల్లోనూ వీరికి స్థానికులు లేదా స్థానిక పరిస్థితులపై అవగాహన ఉన్నవారు సహకరిస్తున్నట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాద సానుభూతిపరుల జాబితాలో ఉన్న వారిపై నిఘా ముమ్మరం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement