పన్ను ఎగవేతదారులను వదలొద్దు
- వాణిజ్య శాఖ అధికారులకు మంత్రి తలసాని స్పష్టీకరణ
- హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టండి
- ట్రాన్స్‌పోర్టు కంపెనీలు, గోడౌన్‌లపై నిఘా పెంచండి
- డిప్యూటీ కమిషనర్‌లు కార్యక్షేత్రంలోకి దిగాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న వాణిజ్య పన్నుల శాఖను క్షేత్రస్థాయి నుంచి పటిష్టం చేయాలని తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులకు స్పష్టం చేశారు. సక్రమంగా పన్నులు చెల్లించే వ్యాపారులకు సహకరిస్తూనే ఎగవేతదారులు, జీరో వ్యాపారం చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. హైదరాబాద్, రంగారెడి జిల్లాల్లో సాగుతున్న అక్రమ వ్యాపారంపై ప్రత్యేక దృష్టి సారించి పన్నులు వసూలు చేయాలని సూచించారు.
సోమవారం వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో మంత్రి తలసాని సమీక్ష సమావేశం నిర్వహించారు. కమిషనర్‌తో పాటు డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తూ పన్నుల వసూళ్ల పరిధిని పెంచాలని ఈ సందర్భంగా సూచించారు. ‘‘రోజుకు రూ.2 లక్షల టర్నోవర్‌తో వ్యాపారం చేస్తూ పన్ను చెల్లించని వారు గ్రేటర్ పరిధిలో కనీసం లక్ష మంది ఉన్నారు. అంటే రోజుకు రూ. 2 వేల కోట్లు. నెలకు రూ.60 వేల కోట్లు. వారిని మనం పన్నుల పరిధిలోకి తీసుకోలేదు.
నాకున్న సమాచారం ప్రకారం 13 ట్రాన్స్‌పోర్టు కంపెనీల ద్వారా ప్రతిరోజూ కోట్ల రూపాయల వస్తు సామగ్రి హైదరాబాద్‌కు దిగుమతి అవుతుంది. చెక్‌పోస్టుల వద్ద నామ్‌కే వాస్తేగా వే బిల్లులు, సీ బిల్లులు చూసి వారిచ్చే డబ్బులు పుచ్చుకొని వదిలేస్తున్నారు. ట్రాన్స్‌పోర్టు గోడౌన్‌లను తనిఖీ చేస్తే దొంగ సరుకు ఎంతుంతో తెలుస్తుంది. కోట్ల రూపాయల బంగారం వ్యాపారం చేసేవారు బిల్లులు చూప రు. పాన్ మసాలా, గుట్కా అక్రమంగా నగరానికి వస్తోంది. చెన్నై, ముంబై, ఢిల్లీ, చైనా నుంచి స్టీల్, ఫర్నిచర్ దిగుమతి చేసుకుంటూ అతి తక్కువ పన్ను చెల్లిస్తున్నారు. రూ. కోట్లలో సిగరెట్ వ్యాపారం సాగుతుంటే దానికి చెల్లించే పన్నులు అతి తక్కువ.
కిరాణా, డ్రైఫ్రూట్స్, చక్కెర, పప్పులు, మైదా, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ స్పేర్‌పార్ట్స్, వాయినల్ ఫిల్మ్స్, ఫ్లెక్సీ బ్యానర్ రోల్స్ దేశ విదేశాల నుంచి నగరానికి తరలివస్తున్నాయి. కోట్లలో టర్నోవర్ సాగుతున్నా పన్నులు వేలల్లో కడుతున్నారు. ఏసీటీవో నుంచి డిప్యూటీ కమిషనర్ స్థాయి వరకు కార్యక్షేత్రంలోకి దిగితే తప్ప పరిస్థితి చక్కబడదు’’ అని వాణిజ్య పన్నుల శాఖలో జరుగుతున్న అక్రమాలను మంత్రి పూసగుచ్చినట్లు వివరించారు. 15 కేటగిరీల్లో పన్నుల వసూలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, బంగారం మొదలు ఆన్‌లైన్ వ్యాపారం వరకు దే న్నీ వదలొద్దని ఆదేశించారు.
చెక్‌పోస్టుల వద్ద నిఘా పెంచాలి
రాష్ట్ర సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద నిఘాను పెంచాలని, ప్రతి వాహనాన్ని తనిఖీ చేసిన తర్వాతే అనుమతించేలా సాఫ్ట్‌వేర్ రూపొందించాల్సిన అవసరం ఉందని తలసాని అధికారులకు సూచించినట్లు సమాచారం. చెక్‌పోస్టుల అక్రమాలను నియంత్రించేందుకు ట్రాన్స్‌పోర్టు, పోలీస్, అటవీ శాఖల సహకారం తీసుకోవాలని, టోల్‌గేట్ల వద్ద రికార్డయిన డేటాతో వాణిజ్యశాఖ చెక్‌పోస్టు వద్ద నమోదైన డేటాతో పోల్చి చూసుకొని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అన్ని చెక్‌పోస్టుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని ఉన్నతాధికారులు ప్రత్యక్షంగా వీక్షించేలా ఏర్పాటు చేసుకుంటే అవకతవకలు తగ్గుతాయన్నారు. అవసరమైన చోట్ల కొత్త చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి కొనుగోలుకు సంబంధించి వినియోగదారులు బిల్లులు తీసుకునేలా వినియోగదారుల కౌన్సిల్‌లను ఏర్పాటు చేసి చైతన్యవంతులను చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి బి.ఆర్.మీనా, కమిషనర్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
‘నంది’ అవార్డు పేరు మార్చుతాం
చలనచిత్ర రంగానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏటా అందజేస్తున్న నంది అవార్డు పేరు మార్చి తెలంగాణ ప్రభుత్వం తరఫున కొత్త అవార్డును అందజేస్తామని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం విలేకరుల సమావేశంలో తెలి పారు. ముఖ్యమంత్రి వద్ద మూడు పేర్లు పరిశీలనలో ఉన్నాయని, పేరు ఖరారైన తర్వాత అవార్డు వివరాలు ప్రకటిస్తామన్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ప్రభుత్వం పూర్తి అండదండలు అందజేస్తుందన్నారు. టాలీవుడ్ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చిత్ర పరిశ్రమ ప్రముఖులతో చర్చించి విధానాలు రూపొందిస్తామని పేర్కొన్నారు.