పార్టీలు మారినా అభ్యర్థులు వారే.. | Telangana Elections Alla Setting MLAs In Khammam | Sakshi
Sakshi News home page

పార్టీలు మారినా అభ్యర్థులు వారే..

Published Sun, Nov 18 2018 8:40 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

Telangana Elections Alla Setting MLAs In Khammam - Sakshi

సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఎట్టకేలకు కాంగ్రెస్, మహాకూటమి సీట్ల లెక్క పూర్తయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్, మూడు నియోజకవర్గాల్లో కూటమి భాగస్వామ్య పక్షమైన టీడీపీ, ఒక నియోజకవర్గంలో సీపీఐ పోటీ చేయాలని నిర్ణయించింది. ఆ మేరకు అభ్యర్థులను కూడా ప్రకటించింది. కాంగ్రెస్‌ శ్రేణుల్లో చివరి నిమిషం వరకు ఉత్కంఠ కలిగించిన ఇల్లెందు అభ్యర్థిత్వం ఎట్టకేలకు హరిప్రియనాయక్‌కు ఖరారైంది. రేవంత్‌రెడ్డితోపాటు కాంగ్రెస్‌లో చేరిన హరిప్రియనాయక్‌ కాంగ్రెస్‌ టికెట్‌ కోసం తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేశారు. రేవంత్‌రెడ్డి ఆశీస్సులతో ఆమెకు టికెట్‌ లభించినట్లు ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో మధిర నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిట్టింగ్‌ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క మినహా గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన వారెవరూ ఈసారి కాంగ్రెస్‌ అభ్యర్థులుగా లేకపోవడం విశేషం.

అనేక నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరి పోటీ చేస్తున్న అభ్యర్థులకు.. కాంగ్రెస్‌ అభ్యర్థులకు మధ్య పోటాపోటీ నెలకొంది. ఇక భద్రాచలం నుంచి పోటీ చేస్తున్న టీఆర్‌ఎస్, కాంగ్రెస్, సీపీఎం అభ్యర్థుల్లో టీఆర్‌ఎస్, సీపీఎం అభ్యర్థులు గతంలో పార్లమెంట్‌కు పోటీ చేయగా.. అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేయడం ఇదే మొదటిసారి. సీపీఎంకు చెందిన మిడియం బాబూరావు గతంలో భద్రాచలం ఎంపీగా గెలుపొందగా.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తెల్లం వెంకట్రావు మహబూబాబాద్‌ ఎంపీ స్థానం నుంచి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక భద్రాచలం కాంగ్రెస్‌ టికెట్‌ను అనూహ్య రీతిలో చేజిక్కించుకున్న మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య జిల్లాలో రాజకీయంగా అడుగిడటం ఇదే మొదటిసారి.

గతంలో ములుగు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వీరయ్యకు కాంగ్రెస్‌ పార్టీ భద్రాచలం టికెట్‌ కేటాయించింది. ఇక బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కుంజా సత్యవతి గతంలో ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఇక్కడ ప్రధాన రాజకీయ పక్షాల మధ్య పోటాపోటీ నెలకొంది. పినపాకలో 2014లో సీపీఐతో పొత్తు వల్ల మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పోటీ చేయనప్పటికీ.. 2009లో తనపై తలపడిన రాజకీయ ప్రత్యర్థితోనే ఈసారి సైతం తలపడుతున్నారు. 2009లో సీపీఐ తరఫున పోటీ చేసిన పాయం వెంకటేశ్వర్లు ఆ ఎన్నికల్లో ఓటమి చెందగా.. 2014లో వైఎస్సార్‌ సీపీ నుంచి పోటీచేసి గెలిచారు. ఇప్పుడు రేగా కాంతారావుపై పాయం వెంకటేశ్వర్లు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా తలపడుతున్నారు.

అశ్వారావుపేటలో ఇద్దరు పాత ప్రత్యర్థుల మధ్యే పోటాపోటీ నెలకొంది. 2014లో వైఎస్సార్‌ సీపీ నుంచి గెలిచిన తాటి వెంకటేశ్వర్లుపై టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మెచ్చా నాగేశ్వరరావు ప్రజాకూటమి భాగస్వామ్య పక్షమైన టీడీపీ నుంచి ఈసారి పోటీ చేస్తుండగా.. తాటి వెంకటేశ్వర్లు ఈసారి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. సత్తుపల్లి నియోజకవర్గంలోనూ పాత ప్రత్యర్థుల మధ్యే పోటాపోటీ నెలకొంది. ఇక్కడ టీఆర్‌ఎస్, ప్రజాకూటమి భాగస్వామ్య పక్షమైన టీడీపీలు ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తున్నాయి. టీడీపీ నుంచి సండ్ర వెంకటవీరయ్య ఇప్పటికే నామినేషన్‌ వేయగా.. టీఆర్‌ఎస్‌ తరఫున పిడమర్తి రవి పోటీ చేస్తున్నారు.

మధిరలో 2014లో పోటీ చేసిన ప్రధాన పార్టీల పాత ప్రత్యర్థులే ఈ ఎన్నికల్లోనూ పోటీపడుతుండగా.. ఆ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ మద్దతుతో సీపీఎం అభ్యర్థి గా పోటీ చేసిన లింగాల కమల్‌రాజు తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఈసారి ఆయన టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా.. 2009, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించిన మల్లు భట్టి విక్రమార్క మరోసారి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. పాలేరులో 2016 ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వరరావు పోటీచేసి విజయం సాధించగా.. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన దివంగత మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి సతీమణి సుచరితారెడ్డి ఈసారి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అక్కడ రెండు పర్యాయాలుగా కాంగ్రెస్‌ టికెట్‌ కోసం తీవ్రస్థాయిలో ప్రయత్నం చేస్తున్న కందాళ ఉపేందర్‌రెడ్డికి ఈసారి టికెట్‌ దక్కింది. ఆయన తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

ఈ నియోజకవర్గాల్లో కూడా.. 
ఇక వైరాలో 2014లో వైఎస్సార్‌ సీపీ నుంచి గెలుపొందిన బానోత్‌ మదన్‌లాల్‌ ఆ తర్వాత టీఆర్‌ఎస్‌ గూటికి చేరారు. ఈసారి ఆయన టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేస్తున్నారు. ఆయనపై 2014 ఎన్నికల్లో సీపీఐ పోటీ చేయగా.. ఈసారి సైతం అదే పార్టీ ఎన్నికల బరిలోకి దిగింది. అయితే అభ్యర్థి మాత్రం మారారు. సీపీఐ అభ్యర్థిగా బానోతు విజయబాయి పోటీ చేస్తుండగా.. ప్రజాకూటమి రెబెల్‌ అభ్యర్థిగా బానోతు రాములునాయక్‌ పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. సీపీఐ అధికారిక అభ్యర్థిగా విజయబాయి నామినేషన్‌ దాఖలు చేయగా.. తిరుగుబాటు అభ్యర్థిగా లాల్‌సింగ్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. ఖమ్మంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించిన పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆ తర్వాత జరిగిన జిల్లా రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.

ఈసారి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా.. మాజీ ఎంపీ, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నామా నాగేశ్వరరావు ప్రజాకూటమి భాగస్వామ్య పక్షమైన టీడీపీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. నామా 2009 ఎన్నికల్లో ఖమ్మం లోక్‌సభ నుంచి ఎంపీగా విజయం సాధించారు. అసెంబ్లీకి పోటీ చేయడం మాత్రం ఇదే మొదటిసారి. ఉమ్మడి జిల్లాలో టీఆర్‌ఎస్, ప్రజాకూటమి, సీపీఎంల నుంచి పోటీ చేస్తున్న వారిలో మాజీ ఎంపీలు మిడియం బాబూరావు, నామా నాగేశ్వరరావు ఉండగా.. లోక్‌సభకు పోటీ చేసిన తెల్లం వెంకట్రావు ఈసారి అసెంబ్లీకి పోటీ చేస్తుండడం విశేషం.

ఇల్లెందులో గత ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులుగా తలపడిన కోరం కనకయ్య, బాణోతు హరిప్రియ అప్పుడు పోటీ చేసిన పార్టీల నుంచి కాకుండా.. ఇద్దరూ వేర్వేరు పార్టీల్లో చేరి మళ్లీ ప్రధాన ప్రత్యర్థులుగా ఇల్లెందు రాజకీయ తెరపైన నిలిచారు. కోరం గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించి.. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆ ఎన్నికల్లో కోరం కనకయ్యపై టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన బాణోతు హరిప్రియ ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పుడు కోరం టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బరిలో దిగగా.. హరిప్రియ నాయక్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తుండడం విశేషం. 

తొలిసారిగా.. 
తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో పాలేరు కాంగ్రెస్‌ అభ్యర్థి కందాళ ఉపేందర్‌రెడ్డి, వైరా సీపీఐ అభ్యర్థి బానోతు విజయాబాయి, ఖమ్మం బీజేపీ అభ్యర్థి ఉప్పల శారద, పినపాక బీజేపీ అభ్యర్థి చందా సంతోష్, వైరా బీజేపీ అభ్యర్థి, సినీ నటి రేష్మారాథోడ్, ఇల్లెందు బీజేపీ అభ్యర్థి నాగ స్రవంతి, మధిర బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థి డాక్టర్‌ రాంబాబు, సత్తుపల్లి సీపీఎం అభ్యర్థి మాచర్ల భారతి, వైరా బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థి భూక్యా వీరభద్రం, ఖమ్మం బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థి పాల్వంచ రామారావు, పాలేరు బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థి బత్తుల హైమావతి తదితరులు ఉన్నారు. ఇక ఇల్లెందు నుంచి సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ తరఫున పోటీ చేస్తున్న గుమ్మడి నర్సయ్య ఇదే నియోజకవర్గం నుంచి తొమ్మిదోసారి పోటీ చేస్తుండడం విశేషం.

జిల్లాలో ఒకే నియోజకవర్గం.. ఒకే పార్టీ నుంచి తొమ్మిదోసారి పోటీ చేస్తున్న పార్టీ నేతగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు లభించింది. గత ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన జలగం వెంకట్రావు, వైఎస్సార్‌ సీపీ నుంచి పోటీచేసిన వనమా వెంకటేశ్వరరావు మరోసారి కొత్తగూడెం నుంచి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌ కోసం ప్రయత్నించిన వనమా.. మిత్రపక్షాల పొత్తులో భాగంగా ఆ సీటు సీపీఐకి కేటాయించడంతో ఆ ఎన్నికల సమయంలో వైఎస్సార్‌ సీపీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు.

మళ్లీ కొద్ది నెలలకే తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. ఈసారి కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ సాధించిన వనమా ఈసారి ఆ పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండగా.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా జలగం వెంకటరావు పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ మద్దతుతో పోటీ చేసిన సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు ఈ ఎన్నికల్లో ఆ సీటును కూటమి భాగస్వామ్య పక్షమైన కాంగ్రెస్‌కు కేటాయించారు. దీంతో సీపీఐ ఇక్కడ ఎటువంటి వ్యూహం అనుసరిస్తుందనే అంశం ఆసక్తికరంగా మారింది. టీఆర్‌ఎస్‌ మినహా కాంగ్రెస్‌ నుంచి ఒకరు, బీఎల్‌ఎఫ్‌ నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి నలుగురు మహిళా అభ్యర్థులు ఈసారి ఎన్నికల బరిలో ఉండడం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement