సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ డిమాండ్ సరికొత్త రికార్డు సృష్టించింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర గరిష్ట విద్యుత్ డిమాండ్ శుక్రవారం ఉదయం 7.52 గంటల ప్రాంతంలో 13,168 మెగావాట్లుగా నమోదైంది. 13 వేల మెగావాట్ల డిమాండ్‌ను రాష్ట్రం అధిగమించడం ఇది రెండోసారి. ఈ నెల 25న నమోదైన 13,040 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్‌ను శుక్రవారం రాష్ట్రం దాటేసింది. ఇంత పెద్ద ఎత్తున విద్యుత్ డిమాండ్ ఏర్పడినా ఏమాత్రం కోత, లోటు లేకుండా విద్యుత్ సరఫరా చేయగలిగామని ట్రాన్స్‌కో ఓ ప్రకటనలో తెలిపింది.
23 జిల్లాలు కలిగిన ఉమ్మడి ఏపీలోనే 2014 మార్చి 23న 13,162 మెగావాట్ల గరిష్ట డిమాండ్ వచ్చింది. ఇప్పుడు తెలంగాణలోనే అంతకు మించి డిమాండ్ ఏర్పడింది. గతేడాది సరిగ్గా ఇదే రోజు రాష్ట్ర గరిష్ట డిమాండ్ 9,770 మెగావాట్లుగా నమోదైంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 34 శాతం అధిక డిమాండ్ వచ్చింది. ప్రస్తుత వేసవి తీవ్రత పెరిగినా కొద్దీ రాష్ట్ర గరిష్ట విద్యుత్ డిమాండ్ రోజుకో కొత్త రికార్డు సృష్టించే అవకాశాలున్నాయి. తెలంగాణ ఏర్పడిన నాటికి తెలంగాణ ప్రాంతంలో నమోదైన గరిష్ట విద్యుత్ డిమాండ్ 5,661 మెగావాట్లు కాగా, ఇప్పుడు 132.6 శాతం వృద్ధిని సాధించింది.
పెరిగిన వార్షిక వినియోగం
రాష్ట్రంలో గరిష్ట డిమాండ్‌తో పాటు వార్షిక విద్యుత్ వినియోగం కూడా అంతకంతకూ పెరుగుతోంది. 2014లో రాష్ట్రంలో 47,338 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరగగా, 2018–19లో 68,147 మిలియన్ యూనిట్ల వినియోగం జరిగింది. ఆరేళ్లలో 44 శాతం వృద్ధి రేటు నమోదైంది. ఇదే సమయంలో జాతీయ వృద్ధి రేటు 23 శాతమే. పెరిగిన తలసరి విద్యుత్ వినియోగం సుస్థిర అభివృద్ధి సూచికల్లో తలసరి విద్యుత్ వినియోగం ఒకటి.
ఈ విషయంలో తెలంగాణ దేశ సగటును మించింది. ప్రస్తుతం రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం 1,896 యూనిట్లు కాగా, జాతీయ సగటు 1,181 యూనిట్లు మాత్రమే. తెలంగాణ ఏర్పడే నాటికి తలసరి విద్యుత్ వినియోగం 1,356 యూనిట్లుండగా, ఆరేళ్లలో 39.82 శాతం పెరిగింది. సీఎం కేసీఆర్ మార్గదర్శకం, అనుక్షణం పర్యవేక్షణ, విద్యుత్ సంస్థల ఉద్యోగుల అవిరళ కృషితోనే రాష్ట్ర విద్యుత్ డిమాండ్‌కు తగ్గట్లు సరఫరా సాధ్యమవుతోందని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు తెలిపారు.
డిమాండ్ పెరిగింది ఇలా..
వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేయడం, భారీ ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ సరఫరా జరుపుతుండటంతో వ్యవసాయ విద్యుత్ డిమాండ్ 6 వేల మెగావాట్లకు పెరిగింది. తెలంగాణ ఏర్పడే నాటికి 19,02,754 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉండగా, ప్రస్తుతం 24,31,056కు పెరిగాయి.
ఎత్తిపోతలకూ అంతే..
2014లో ఎత్తిపోతల పథకాలకు 680 మెగావాట్ల డిమాండ్ మాత్రమే ఉండేది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన భారీ నీటి పారుదల ప్రాజెక్టుల ఫలితంగా పంపుహౌస్‌ల నిర్వహణకు ప్రస్తుతం 2,200 మెగావాట్ల వరకు విద్యుత్ అవసరం అవుతోంది. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో పట్టణీకరణ శరవేగంగా పెరుగుతుండటం వల్ల వ్యాపార, వాణిజ్య కనెక్షన్లు కూడా పెరిగాయి. దీంతో తెలంగాణవ్యాప్తంగా కొత్త విద్యుత్ కనెక్షన్ల వృద్ధి రేటు అధికంగా ఉంది.
కరెంట్.. కొత్త రికార్డు!
Published Sat, Feb 29 2020 3:41 AM | Last Updated on Sat, Feb 29 2020 3:41 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment